రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న మూడు ఉద్యోగ సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న మూడు ఉద్యోగ సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఏపీ ఎన్జీవో, రెవెన్యూ, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగ సంఘాలను చర్చలకు రావాలని పిలిచింది. ఈ మూడు సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపనుంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఉదయం 11:30 గంటలకు మూడు సంఘాలతో సమ్మె విరమణపై చర్చించనుంది.
మంత్రివర్గ ఉప సంఘంతో సోమవారం సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు ఫలవంతం కాలేదు. సమ్మె నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం చేసిన విజ్ఞప్తిని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు సోమవారం అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.