సువర్ణ చరిత్రకు మరో అడుగు

Andhra Pradesh Assembly Has 16 Key Bills In A Single Day - Sakshi

మరో చరిత్రాత్మక ఘట్టానికి వేదికైన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ

మద్యం అక్రమ తయారీ, విక్రయాలు, రవాణాపై ఉక్కుపాదం

జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది

వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు

చిరు, పప్పు ధాన్యాలకు వేర్వేరు బోర్డులు

వర్సిటీ నిబంధనల్లో మార్పులు, తదితర 16 బిల్లులు ఆమోదం

ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో కీలక బిల్లులను ఆమోదించి రాష్ట్ర శాసనసభ సువర్ణాక్షరాలతో కొత్త చరిత్రను లిఖించింది.. ప్రభుత్వ బడుల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ బడుగు, బలహీన వర్గాలు, ఇతరత్రా పేద పిల్లల బంగారు భవిష్యత్‌కు శ్రీకారం చుట్టింది.. మద్యం మహమ్మారిపై ఉక్కుపాదం మోపింది.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం,  ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు.. తదితర కీలక నిర్ణయాలకు నాంది పలికింది.. ఐదున్నర కోట్ల రాష్ట్ర ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా గత శాసనసభ సమావేశాల్లో 19 బిల్లుల ఆమోదంతో తొలి అడుగు వేసిన వైఎస్‌ జగన్‌ సర్కారు.. తాజాగా యావత్‌ ప్రపంచంలోని తెలుగు వారు ప్రశంసించేలా సోమవారం 16 బిల్లులకు ‘ఎస్‌’ అంటూ మలి అడుగు వేసింది.


 ప్రతి అడుగు విప్లవాత్మకమే..
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
ఇవాళ మేము మరో విప్లవాత్మక బిల్లును తెస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా రెండు కమిషన్లు తీసుకొస్తున్నాం. వారి అభివృద్ధి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని, వారి సమస్యల మీద లోతుగా అధ్యయనం చేయాలని, వారి సమస్యలకు సత్వర పరిష్కారం కనుగొనాలనే తపన, తాపత్రయంతో ఈ పని చేస్తున్నాం.  

ఇక ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే
జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే. ప్రతి ఉద్యోగీ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ చరిత్రాత్మక నిర్ణయం వల్ల, ఎప్పటి నుంచో ఉద్యోగులు కోరుకుంటున్న, ఏ ప్రభుత్వం కూడా చేయడానికి ముందుకు రాని ఈ పని.. మా హయాంలో, మా ప్రభుత్వంలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం
రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 1 నుంచి 6వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం కాబోతున్నాయి. ఆ తర్వాత వరుస సంవత్సరాలలో 7, 8, 9, 10 తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నాం. నాలుగేళ్లలో మన పిల్లలందరూ 10వ తరగతి బోర్డు పరీక్ష ఇంగ్లిష్‌లో రాసేలా ఈ బిల్లు మార్చబోతున్నది. ఇది ఒక చరిత్రాత్మక బిల్లు. 

ఆమోదం పొందిన ముఖ్యమైన బిల్లుల్లో కొన్ని
పిల్లలందరికీ ఇంగ్లిష్‌ మీడియం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధన.. ధనిక, పేద అనే తేడా లేకుండా విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య. అన్ని తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టు తప్పనిసరి.
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం
ఆర్టీసీకి చెందిన దాదాపు 52 వేల మంది దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేయడం.. వారిని ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేలా ప్రత్యేకంగా ప్రజా రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయడం. 
ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ల ఏర్పాటు
ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించేందుకు రెండు కమిషన్ల ఏర్పాటు.

మద్యపాన నిషేధం దిశగా వేగంగా అడుగులు
అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయడం.. అలాంటి నేరానికి తొలిసారి పాల్పడితే రూ.2 లక్షల జరిమానా.. రెండోసారి అయితే రూ.5 లక్షల జరిమానా. 

మద్యం ముట్టుకోవాలంటే షాక్‌ కొట్టాల్సిందే
మేము అధికారంలోకి రాక ముందు 43 వేల బెల్టు షాపులుండేవి. వాటిలో ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా చేశాం. పర్మిట్‌ రూమ్‌లను ఎత్తివేశాం. మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చాం. అమ్మకాల సమయాన్ని కూడా కుదించాం. ముట్టుకుంటే షాక్‌ కొట్టేలా ధరలు సైతం పెంచాం.  
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సోమవారం మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో పాఠ్యాంశాల బోధన, ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడం,మద్యం అక్రమ విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టడం, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు వంటి 16 చరిత్రాత్మక బిల్లులకు ఆమోదం తెలిపింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్‌ సమావేశాల్లోనే 19 విప్లవాత్మక బిల్లులను శాసనసభ ఆమోదించడం ద్వారా రికార్డు సృష్టించింది. సోమవారం శాసనసభ ఆమోదించిన ఏపీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌–1982 సవరణ బిల్లు ద్వారా వచ్చే విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు లక్షలాది మంది విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో పాఠ్యాంశాలను బోధించడానికి బాటలు వేసింది.

ఆ తర్వాత వరుస సంవత్సరాల్లో పదో తరగతి వరకూ ఇంగ్లిష్‌  మీడియంలో పాఠ్యాంశాలను బోధించడం ద్వారా మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు ఈ బిల్లు చుక్కానిలా నిలుస్తుంది. ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునే బిల్లును ఆమోదించడం ద్వారా 51,488 మంది కార్మికుల స్వప్నం సాకారం చేసింది. ఎస్సీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం కోసం ఎస్సీ కమిషన్, ఎస్టీ వర్గాల ప్రజల హక్కులను పరిరక్షించడంతోపాటు ఆ వర్గాల ప్రజలకు మరింతగా ప్రయోజనం చేకూర్చడం కోసం ఎస్టీ కమిషన్‌ ఏర్పాటుకు వీలుగా శాసనసభ బిల్లులను ఆమోదించింది. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ధరలు పెరగకుండా నియంత్రించడం.. ప్రజలందరికీ వాటిని అందుబాటులో ఉంచడం ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం కోసం చిరుధాన్యాలు, పప్పుధాన్యాల బోర్డుల ఏర్పాటుకు వీలుగా వేర్వేరు బిల్లులను ఆమోదించింది.

రాష్ట్ర శాసనసభలో ఒక్క రోజే 16 కీలక బిల్లులు.. మరో చారిత్రక ఘట్టానికి వేదికైన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 
సోమవారం ఆమోదం పొందిన బిల్లులు.. వాటి ఉద్దేశాలు 
బిల్లు : ఏపీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌–1982 సవరణ  
ఉద్దేశం: ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యార్థులకు భోదన.. ధనిక, మధ్యతరగతి, పేద అనే తేడా లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను అందించడం.. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహదం చేయడం.. అన్ని తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం. 

బిల్లు: ప్రభుత్వ సర్వీసుల్లోకి ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు
ఉద్దేశం: ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేయడం.. ఆ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేలా ప్రత్యేకంగా ప్రజా రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయడం. 

బిల్లు : ఎస్సీ కమిషన్‌  
ఉద్దేశం: ఎస్సీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం. 

బిల్లు : ఎస్టీ కమిషన్‌   
ఉద్దేశం: ఎస్టీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం. 

బిల్లు : చిరుధాన్యాల(మిల్లెట్స్‌) బోర్డు ఏర్పాటు 
ఉద్దేశం: చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం.. పౌష్టికాహారాన్ని అందించడం. 

బిల్లు: పప్పుధాన్యాల(పల్సస్‌) బోర్డు ఏర్పాటు 
ఉద్దేశం: పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ధరలు పెరగడకుండా నియంత్రించడం.. 
ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం.. పౌష్టికాహారాన్ని అందించడం. 

బిల్లు: ఆంధ్రప్రదేశ్‌ మద్యనిషేధ చట్టం–1995కు సవరణ 
ఉద్దేశం: అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయడం.. అలాంటి నేరానికి తొలిసారి పాల్పడితే రూ.రెండు లక్షల జరిమానా.. రెండోసారి నేరానికి పాల్పడితే రూ.5 లక్షల జరిమానా. 

బిల్లు: ఆంధ్రప్రదేశ్‌ ఆబ్కారీ చట్టం–1968కు సవరణ 
ఉద్దేశం: బార్‌లలో అక్రమ, సుంకం చెల్లించని మద్యం విక్రయం.. సరిహద్దుల నుంచి అక్రమ రవాణా.. ఇలాంటి నేరాలకు తొలిసారి పాల్పడితే హెచ్చరికతోపాటు లైసెన్స్‌ ఫీజుకు రెండు రెట్లు జరిమానా.. రెండోసారి పాల్పడితే బార్‌ లైసెన్స్‌ రద్దు, నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు. 

బిల్లు: కర్నూలులో క్లస్టర్‌ యునివర్సిటీ ఏర్పాటు  
ఉద్దేశం: కర్నూలులో సిల్వర్‌ జూబ్లీ కాలేజీ, కేవీఆర్‌ ప్రభుత్వ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేసి క్లస్టర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం.. విద్యార్థులకు ఉపాధి కల్పన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంచేలా నాణ్యమైన విద్యను అందించడం. 

బిల్లు: జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం చట్టం సవరణ  
ఉద్దేశం: వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం కడపలో ఏర్పాటు చేయడం. 

బిల్లు: ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు 
ఉద్దేశం: విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌/ప్రతినిధి ఎక్స్‌–అఫీషియో సభ్యునిగా నియామకం. 

బిల్లు: ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల చట్టాల రెండో సవరణ బిల్లు 
ఉద్దేశం: విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్‌ (ఉప కులపతులు)ల నియామక నిబంధనల్లో మార్పులు 

బిల్లు: ఆంధ్రప్రదేశ్‌ సహకార సంఘాల రెండో సవరణ బిల్లు 
ఉద్దేశం: సహకార సంఘాల పాలక మండలి ఎన్నికల్లో కుష్టు వ్యాధిగ్రస్తులు, మూగ, చెవిటి వారికి పోటీ చేసే అవకాశం కల్పించడం. 

ఇతర బిల్లులు
ఏపీ వృత్తిదారులు, వ్యాపారులు, ఉద్యోగుల వృత్తిపన్ను చట్టం సవరణ బిల్లు–2019 
ఏపీ జీఎస్టీ సవరణ బిల్లు–2019 
ఏపీ మున్సిపల్‌ చట్టం సవరణ బిల్లు–2019   

చదవండి: మరో అల్లూరి.. సీఎం జగన్‌

చదవండి: ఎస్సీ, ఎస్టీలకుద్రోహం చేయలేదా?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top