జేసీపై కేసు నమోదు చేస్తాం | Anantapuram district police community fires On JC Diwakar Reddy | Sakshi
Sakshi News home page

జేసీపై కేసు నమోదు చేస్తాం

Dec 19 2019 4:18 AM | Updated on Dec 19 2019 4:18 AM

Anantapuram district police community fires On JC Diwakar Reddy - Sakshi

మాట్లాడుతున్న పోలీసు సంఘం నాయకులు

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: పోలీసులపై మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారి ఆదేశాల మేరకు ఆయనపై కేసు నమోదు చేస్తామని అనంతపురం జిల్లా పోలీస్‌ సంఘం (అడ్‌హక్‌ కమిటీ) పేర్కొంది. అనంతపురంలోని పోలీస్‌ సంఘం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సాకే త్రిలోక్‌నాథ్, కార్యదర్శి జాఫర్, సభ్యులు సుధాకర్‌రెడ్డి, హరి తదితరులు మాట్లాడారు. జేసీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఇంకా అధికారంలోనే ఉన్నాననే భ్రమలో ఉన్నారని, ఆ భ్రమ నుంచి బయటకు రావాలని చెప్పారు. జేసీని ప్రజలు, టీడీపీ వర్గీయులు ఓ జోకర్‌లా చూస్తున్నారని అన్నారు.

రాజకీయంగా ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారాడో తెలుసుకోవాలన్నారు. ఆయనకు పోలీసులు, ఉద్యోగులంటే అలుసుగా ఉందని ధ్వజమెత్తారు. పోలీసులు లేకుంటే కనీసం బయటకు రాలేని పరిస్థితి ఆయనదన్నారు. పోలీసులపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్వుతుండటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. పోలీసులంటే ఏమిటో ప్రతి సోమవారం జరిగే స్పందనకు వస్తే తెలుస్తుందన్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement