నోరు తెరిస్తే బూతులే !

Anantapur DSP Bad Words on Officers - Sakshi

డీఎస్పీ తీరుతో విసిగి   వేసారుతున్న ఉద్యోగులు

డీజీపీ వరకూ ఫిర్యాదులు వెళ్లినా చర్యలు శూన్యం

నామమాత్రపు విచారణతో సరిపెడుతున్న అధికారులు  

ఆయనో డీఎస్పీ.. నోరు తెరిస్తే మాత్రం బూతులు అందుకుంటారు.. ఇది నా రాజ్యం.. అంతా నేను చెప్పినట్లే వినాలి అంటూ హుకుం జారీ చేస్తారు. కాదని ప్రశ్నిస్తే మాత్రం నేరస్తులపై ప్రయోగించే భాష కన్నా హీనంగా మాట్లాడుతారు. తాజాగా నాలుగురోజుల క్రితం సదరు విభాగంలో రిపోర్టు చేసుకోవడానికి వచ్చిన ఓ కానిస్టేబుల్‌ విషయంలో డీఎస్పీ మాట్లాడిన తీరు వింటే అందరూ నివ్వెర పోవాల్సిందే. డీఎస్పీ బూతుపురాణం ఆడియో టేపులు ప్రస్తుతం పోలీసుశాఖలో కలకలం రేపుతున్నాయి. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలోనే ఉన్న ఆ డీఎస్పీ   వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వెళ్లాయి. చివరకు డీజీపీ వరకూ ఫిర్యాదులు వెళ్లినా ఆయనలో మార్పు రాలేదు.  

అనంతపురం సెంట్రల్‌: నగరంలోని పోలీసు కార్యాలయ ఆవరణంలోనే కీలకమైన విభాగానికి ఆయన డీఎస్పీగా వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఇక్కడే ఉంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సిబ్బందిని బందోబస్తుకు కేటాయించాలి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కష్టం చూస్తే ఆయ్యో పాపం అనాల్సిందే. ఒక్కోసారి ఇళ్లు వదిలితే మళ్లీ రావడానికి పది, పదహైదు రోజులు పట్టవచ్చు. నెలలు సమయం పట్టిన కాలాలు కూడా ఉన్నాయి. అలాంటి విభాగానికి సారథ్యం వహిస్తున్న డీఎస్పీ అందరి యోగ క్షేమాలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. వారి సమస్యలను సావధానంగా విని వారి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేయాలి. కానీ డీఎస్పీ ఇందుకు భిన్నం. విభాగంలో ఎవర్ని కదిపినా ఆ డీఎస్పీనే మాకు సమస్య అంటూ నిట్టూరుస్తారు. 

ఆద్యంతం వివాదాలే..
డీఎస్పీ వ్యవహారశైలి మొత్తం వివాదాస్పదంగా మారుతోంది. నెలలో ఏదో ఒక ఘటన ఆ విభాగంలో చోటు చేసుకుంటోంది. తాజాగా ఓ నియోజకవర్గ కేంద్రంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌పై అక్కడి అధికారులు కక్షకట్టి బలిచేశారు. వేధింపులు తాళలేక కొద్దిరోజుల పాటు సిక్‌లీవ్‌లో వెళ్లిన కానిస్టేబుల్‌ ఇటీవల ఎస్పీ వద్ద తన గోడును వెల్ల బోసుకున్నాడు. దీనిపై ఆయన సదరు విభాగంలో రిపోర్టు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో రిపోర్టు చేసుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై డీఎస్పీ బూతులు తిట్టడం చూసి అందరూ కంగుతిన్నారు. సిబ్బంది వద్ద ఆడియో టేపులు కూడా ఉండడంతో డీఎస్పీపై మరోసారి ఫిర్యాదు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. 

విచారణలతోనే సరి  
డీఎస్పీపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎస్పీ దగ్గర నుంచి డీఐజీ, ఐజీ, డీజీపీ వరకు ఫిర్యాదులు వెళ్లాయి. డీజీపీకి వెళ్లిన ఫిర్యాదుపై స్పందించిన అధికారులు అనంతపురం డీఎస్పీచే విచారణకు అదేశించారు. విచారణకు ఆదేశించడంతో అందరూ న్యాయం జరుగుతుందేమోనని భావించారు. చివరకు సదరు డీఎస్పీకి ‘క్లీన్‌చిట్‌’ ఇచ్చి విచారణను ముగించారు. తూతూమంత్రంగా విచారణ చేయడం ద్వారా సిబ్బందికి జరుగుతున్న అన్యాయాలు, వేధింపులు బయటకు రావడం లేదని వాపోతున్నారు. డ్యూటీల కేటాయింపు నుంచి వెల్ఫేర్‌ వరకు అని కక్ష సాధింపు చర్యలకు పాల్పడేవిధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అనేక మంది డ్యూటీ కేటాయింపు అధికారులతో వాగ్వాదాలకు దిగి కొట్టుకునే స్థాయి వరకు వెళ్లారు. ఓ డీఎస్పీపై పదేపదే ఫిర్యాదులు వస్తున్నా... ఇక్కడ మేము పనిచేయలేం బాబోయ్‌ అంటూ మొరపెట్టుకుంటున్నా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమానికి పెద్ద పీట అంటే ఇదేనా అంటూ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఆ విభాగాన్ని ఎప్పటికి గాడిలో పెడతారో వేచిచూడాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top