‘కేర్’మంటున్న ‘అమృతహస్తం’ | amruta hastam scheme not open in district | Sakshi
Sakshi News home page

‘కేర్’మంటున్న ‘అమృతహస్తం’

Jan 11 2014 2:09 AM | Updated on Jun 1 2018 7:32 PM

అమృతహస్తం పథకాన్ని జిల్లాలో గత ఏడాది జనవరి 4న ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతాలైన ఉట్నూర్, వాంకిడి, ఆసిఫాబాద్‌లతోపాటు నాన్ ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్ రూరల్, బోథ్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని 1,470 అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలవుతోంది.

అమృతహస్తం పథకాన్ని జిల్లాలో గత ఏడాది జనవరి 4న ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతాలైన ఉట్నూర్, వాంకిడి, ఆసిఫాబాద్‌లతోపాటు నాన్ ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్ రూరల్, బోథ్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని 1,470 అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలవుతోంది. మరో నాలుగు ప్రాజెక్టులు నిర్మల్, ఖానాపూర్, సిర్పూర్(టి), చెన్నూర్‌లకు విస్తరించింది. జనవరి నుంచే అమలు చేయాలని ప్రభుత్వం డిసెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. సీడీపీవోలు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో అమృతహస్తం కమిటీలు ఏర్పాటు చేయాలి. ఇందులో ఇద్దరు విలేజ్ ఆర్గనైజర్స్(వీవో), గర్భిణి, బాలింత, అంగన్‌వాడీ కార్యకర్త సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి రోజు పథకం అటెండెన్స్, గర్భిణుల సమీకరణ, నాణ్యమైన ఆహారం తదితరాలు పరిశీలించాలి. రోజు భోజనంలో పదార్థాలు, భోజనం పెట్టే సమయం క్రమపద్ధతిగా చేస్తూ ఉండాలి. ఈ కమిటీలే గర్భిణులు, బాలింతలకు ఎంసీపీ కార్డులు అందించాలి. కానీ కొత్త ప్రాజెక్టుల్లో వీటి కదలిక లేకపోవడంతో పథకం అమలు జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 పర్యవేక్షణ కరువు..
 గర్భిణులు, బాలింతలకు ఒక పూట సంపూర్ణ పౌష్టికాహారం కోసం ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.15 కేటాయిస్తోంది. బియ్యం, పప్పు, నూనె పౌరసరఫరాల శాఖ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతాయి. కూరగాయలు, గుడ్లు, పాలు, ఆకుకూరలను ఐకేపీ వీవోలు కొనుగోలు చేసి అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇవ్వాలి. అన్ని సకాలంలో అందితే వంట చేసి లబ్ధిదారులకు వడ్డించాలి. కానీ బియ్యం ఉంటే పప్పు, పప్పు ఉంటే బియ్యం ఉండకపోవడం.. ఈ రెండూ ఉంటే నూనె, పోపు దినుసులు లేపోవడం జరుగుతోంది. దీంతో పౌష్టికాహారం పోషకాలు లోపిస్తున్నాయి.

 ప్రతి నెల అడ్వాన్స్‌గా సరుకులు అందుబాటులో ఉండేలా చూడాల్సిన సీడీపీవోలు గుడ్లు, బియ్యం, పప్పుదినుసులు, నూనె పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అంగన్‌వాడీ హెల్పర్లకు కట్టెల బిల్లులు వీవోలు చెల్లించకపోవడంతో తామెక్కడి నుంచి తెచ్చి వండేదని కొందరు వంట చేయడం లేదు. ఈ పథకం అమలవుతున్న కేంద్రాలకు సిలిండర్లు, గ్యాస్టౌలు మంజూరు చేసినప్పటికీ పంపిణీలో సీడీపీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కోడిగుడ్డు ధర పెరగడం, ఆకుకూరలు, కూరగాయల ధరలు స్థిరంగా ఉండకపోవడంతో పప్పుతో భోజనం సరిపెడుతున్నారు.

కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో పథకం అమలుకు నోచుకోవడం లేదు. నెలలో పీడీ ఐదు అంగన్‌వాడీ కేంద్రాలు, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు 20 కేంద్రాల్లో పథకం అమలు తీరును పరిశీలించాలనే నిబంధన ఉన్నా ఆచరించిన దాఖలాలు లేవు. హాజరు, నాణ్యత, నిర్దారించిన గ్రాముల్లో ఆహారం అందుతుందా? లేదా ?, వంట వండే చోట శుభ్రత, వడ్డించే తీరును పరిశీలిస్తూ.. ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తే పౌష్టికాహారం అందుతుందని లబ్ధిదారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement