సాగు పండగై

Agricultural works in full swing throughout AP - Sakshi

కొంగొత్త ఆకాంక్షలతో ఖరీఫ్‌

రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకున్న వ్యవసాయ పనులు

కలిసొచ్చిన రైతు భరోసా, విత్తన పంపిణీ, వర్షాలు

ఉండూళ్లోనే ఎరువులు, పురుగు మందులు సిద్ధం

సీమ జిల్లాలలో వేరు శనగ విత్తడం ప్రారంభం

ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో నారుమళ్లు.. నాట్లు

దక్షిణాంధ్రలో దుక్కులకు సన్నద్ధం

అన్నీ మంచి శకునములే అంటున్న రైతులు

ఈసారీ రికార్డు స్థాయి ఉత్పత్తికి సై అంటున్న అధికారులు

వ్యవసాయ రంగం ముఖచిత్రాన్నే మార్చి వేసే ప్రభుత్వ నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత ఏడాది 86.33 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం అంత కంటే 6.10 లక్షల ఎకరాలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 92,46,006.30 ఎకరాలు సాగులోకి రావొచ్చని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు.. ప్రధానంగా రైతు భరోసా, విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగుమందుల సంసిద్ధత వంటివి సాగును ప్రోత్సహించేలా ఉన్నాయి. సకాలంలో వర్షాలు పడటంతో ఈ సీజన్‌లో ఇప్పటికే అంటే గురువారం నాటికి 3,29,085.06 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఇది 1,08,590.46 ఎకరాలు ఎక్కువ. గత ఏడాది ఇదే కాలానికి అంటే జూన్‌ ఒకటి నుంచి 17వ తేదీ వరకు 2,20,494.60 ఎకరాల్లో మాత్రమే పంటల్ని వేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, అన్నదాతల ముంగిటకే అందిస్తున్న సేవలు, కలిసి వచ్చిన వాతావరణం.. వెరసి రాష్ట్రంలో వ్యవసాయ రంగం మూడు పూవులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా గత ఏడాది పంట దిగుబడులతో ఆనందంగా ఉన్న రైతాంగం.. ఈ ఖరీఫ్‌లో రెట్టించిన ఉత్సాహంతో సాగులో నిమగ్నమైంది. 
(ఎ.అమరయ్య, జీపీ వెంకటేశ్వర్లు) 

‘కల్లా కపటం కానని వాడా.. లోకం పోకడ తెలియని వాడా..ఏరువాక సాగారో రన్నో చిన్నన్న.. నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న..నవ ధాన్యాలను గంపకెత్తుకొని.. చద్ది అన్నము మూట గట్టుకొని ముల్లు గర్రను చేతబట్టుకొని.. ఇల్లాలునీ వెంటబెట్టుకొని..’ అన్న పాటలోని జీవన సౌందర్యం ఊరూరా కనిపిస్తోంది.  

► నగరాలు నిద్రలేవడానికి మునుపే పల్లెలు పొలం పనుల్లో మునిగి తేలుతున్నాయి. ఓవైపు చిరు జల్లులు, మరోవైపు మసకేసిన మబ్బు.. ఉదయం 8 గంటలు కావొస్తోంది.. అప్పటికే పొలంలో ట్రాక్టర్లు రయ్‌రయ్యిమంటూ రొద చేస్తున్నాయి. హాయ్, హోయ్‌ మంటూ అన్నదాతలు ఎడ్లను అదిలిస్తున్నారు. కొన్ని చోట్ల మహిళలు, పిల్లలు పొలంలో దంటు ఏరుతున్నారు. 
► రాత్రి కురిసిన చిరు జల్లుల వల్లనో ఏమో ట్రాక్టర్లు దుమ్ము లేపడం లేదు. పైరగాలికి గెనాల మీద చెట్ల కొమ్మలు రెపరెపలాడుతున్నాయి. నాగటి చాళ్లంట బయటపడే పురుగుల కోసం కొంగలు, కోనంకి పిట్టలు దేవులాట మొదలు పెట్టాయి. అరేయ్‌.. బువ్వ తిందాం రా అంటూ అవతలి చేలో దుక్కిదున్నుతున్న దోస్త్‌ను ఓ రైతు పిలుస్తున్నాడు. 

రైతు షేక్‌ సత్తార్‌ది ప్రముఖ చిత్రకారుడు సంజీవ్‌దేవ్‌ స్వగ్రామమైన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామం. 
75 సెంట్ల తన సొంత భూమిని ఖరీఫ్‌లో సాగుకు సిద్ధం చేస్తున్నాడు. రైతు భరోసా కింద ఇచ్చిన సొమ్ముతో వరి సాగు పనులు ప్రారంభిస్తున్నారు. 

తూర్పు గోదావరి జిల్లా తొర్రేడు గ్రామానికి చెందిన ఈ రైతు పేరు సీహెచ్‌ వీర్రాజు. తన పిల్లలు కాయకష్టం చేసే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో 13 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. గోదావరి కాలువలు వదిలిన ఈనెల 10కి ముందే ఆయన నారు సిద్ధం చేసుకున్నారు. గురువారం నాటికి 12 ఎకరాల్లో నాట్లు సైతం పూర్తి చేశారు.  

వేరుశనగ విత్తనాన్ని వెదపెడుతున్న ఈ రైతుది వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరు. నైరుతి రుతు పవనాల ప్రభావంతో కురిసిన వర్షాలకు ముందుగా పదును కావడంతో ఈ రైతు విత్తనం వేశారు. 5 ఎకరాల వరకు వేరుశనగను సాగు చేసే ఈ రైతుకు రైతు భరోసా కింద అందిన పెట్టుబడి సాయం కలిసి వచ్చింది. సకాలంలో విత్తనాలు వచ్చాయి. దీంతో భూమిని నమ్ముకున్న ఈ రైతు రాయలసీమలో ప్రధాన వాణిజ్య పంటైన వేరుశనగ సాగుకు ఉపక్రమించారు. 

రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు
► ఖరీఫ్‌లో క్షేత్ర స్థాయి వాస్తవ సాగు పరిస్థితులను తెలుసుకునేందుకు బయలుదేరిన ‘సాక్షి’ ప్రతినిధులకు కనిపించిన దృశ్యాలివి. మొత్తం మీద ఈ ఏడాది ఖరీఫ్‌ కోటి ఆశలు, కొంగొత్త ఆకాంక్షలతో శుభారంభమైందన్న భావన కలిగింది.
► సకాలంలో రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడం, అల్పపీడనం బలపడడంతో ఒక్క చిత్తూరు జిల్లా తప్ప మిగతా 12 జిల్లాల్లోనూ వ్యవసాయ పనులు చేపట్టేలా వానలు పడ్డాయి. అటు ఉత్తరాంధ్ర మొదలు ఇటు రాయలసీమ వరకు ఎక్కడ చూసినా ఖరీప్‌ పనులు ముమ్మరం అయ్యాయి. 
► దక్షిణాంధ్ర జిల్లాల్లో దుక్కులు సిద్ధం చేస్తుండగా రాయలసీమ జిల్లాలలో వేరుశనగ విత్తడం ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు 24 శాతం మేర పూర్తయింది. 
► గోదావరి డెల్టా కాలువలకు నీళ్లు వదలడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో నాట్లు మొదలయ్యాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా నాట్లు పడ్డాయి. వరి సాగు చేసే ప్రాంతంలో వరి నారుమళ్లు పోయడం ముమ్మరమైంది. 
► కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నీటి వసతి ఉన్న ప్రాంతాలలో వేసిన అపరాలు మొలక దశ దాటాయి. మరొక్కసారి పెద్ద వర్షం పడితే పంటల్ని వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.

వ్యవసాయం ఎందుకు పండగైందంటే..
► రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు.. ప్రధానంగా రైతు భరోసా, విత్తనాల పంపిణీ, ఎరువులు, పురుగు మందుల సంసిద్ధత వంటివి సాగును ప్రోత్సహించేలా ఉన్నాయి.
► దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే నాలుగైదు రోజుల్లో వర్షాలు పడితే వేరుశనగ విత్తడం మరింత ముమ్మరం అవుతుందని రైతులు చెప్పారు. 
► విత్తనాలను ముందే పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన హన్మంతరెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఈసారి ఎక్కువ మంది ఉద్యాన పంటల వైపు కూడా దృష్టి సారించారు. ఖరీఫ్‌లో వరి సాగుకు అధిక వ్యయం అవుతుందన్న భావనలో పలువురు ఉన్నారు.
► ఖరీఫ్‌ సీజన్‌లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురవాల్సిన సగటు వర్షపాతం 556 మిల్లీమీటర్లు. ఇప్పటికే కురవాల్సింది 62 మిల్లీమీటర్లు కాగా బుధవారం సాయంత్రానికి 63 మిల్లీమీటర్లు కురిసింది. ఫలితంగా ఒక్క చిత్తూరు జిల్లా మినహా 12 జిల్లాలలో మామూలు వర్షపాతం నమోదైంది. 
► వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి, కంది, పెసర, మినుము, వేరుశనగ, నువ్వులు, ఉల్లి పంటల్ని ఇప్పటికే 20 నుంచి 24 శాతం లోపు విస్తీర్ణంలో విత్తారు.

రికార్డు దిగుబడే లక్ష్యం
► ఖరీఫ్‌ సాగుపై అధికారులు ఆశావహ దృక్పథంతో ఉన్నారు. గత ఏడాది కంటే మించి ఉత్పత్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది (2019–20) ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి 180.54 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఇందులో ఒక్క ఖరీఫ్‌ నుంచే 87.64 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది ఇంతకుమించి రావొచ్చునని అధికారులు అంచనా.
► సీజన్‌కు కావాల్సిన ఎరువులు, పురుగు మందులకు ఎటువంటి ఢోకా లేదని వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌ తెలిపారు. మరో వైపు కరోనా నేపథ్యంలో వ్యవసాయ కూలీల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
► అగ్రి దుకాణాల ద్వారా యంత్రాలను తక్కువ ధరకు అద్దెకు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. వరిని నాటడానికి బదులు వెదజల్లే పద్ధతిని పాటించాలని సూచిస్తున్నారు.
► కరోనా వైరస్‌ భయంతో పొరుగు ఊళ్ల నుంచి వ్యవసాయ కూలీలను అనుమతించనందున ఏ ఊరికి ఆ ఊరి వాళ్లే గ్రూపులుగా ఏర్పడి పనులు చేసుకోవాలని రైతు సంఘాలు సూచించాయి. మొత్తంగా ఖరీఫ్‌ పంటలకు అన్నీ సానుకూల అంశాలేనని రైతులు అభిప్రాయపడుతున్నారు. 

కౌలు రైతుల సమస్యకు త్వరలో పరిష్కారం 
ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల రాయితీలను కౌలు రైతులకు కూడా అందించాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం. కౌలు రైతులకు రుణాలు, రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానించాం. 11 నెలల కాలానికి సాగు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా సాయం అందిస్తాం. అర్హులైన వారందరికీ సాయం ఇస్తాం.     – మంత్రి కన్నబాబు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top