హాస్టల్‌లో 78 మంది పిల్లలు?.. అక్కడ ఒక్కరుంటే ఒట్టు | ACB Attack On BC Boys Hostel In Nellore | Sakshi
Sakshi News home page

హాస్టల్‌లో 78 మంది పిల్లలు?.. అక్కడ ఒక్కరుంటే ఒట్టు

Sep 7 2019 8:56 AM | Updated on Sep 7 2019 8:58 AM

ACB Attack On BC Boys Hostel In Nellore - Sakshi

ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. జిల్లా వ్యాప్తంగా దాడులను ముమ్మరం చేశారు. ఈక్రమంలో బీసీ బాలుర హాస్టల్‌లో తనిఖీలు చేయగా విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

సాక్షి, ఆత్మకూరు(నెల్లూరు): చేజర్ల మండలంలోని మాముడూరు బీసీ బాలుర వసతిగృహంలో ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ దేవానంద్‌ శాంతో ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధికారుల కథనం మేరకు.. ఉదయం 6:30 గంటలకే వారు గ్రామంలోని హాస్టల్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది మాత్రమే ఉన్నారు. వార్డెన్‌ సురేష్‌బాబు అందుబాటులో లేరు. బుచ్చి మండలం అన్నారెడ్డిపాళెం హాస్టల్‌లో కూడా ఆయన డెప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారని తెలిసి అక్కడ విచారించారు. అయితే వార్డెన్‌ అక్కడ లేరని తెలుసుకున్నారు. కాగా హాస్టల్‌లో పరిశీలించగా ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా లేరు. అయితే హాజరుపట్టికలో మాత్రం 78 మంది ఉన్నట్లుగా నమోదై ఉంది. 

బియ్యం మాత్రమే ఉంది
అధికారులు స్టోర్‌ రూమ్‌లో వస్తువులు పరిశీలించగా కేవలం బియ్యం మాత్రమే ఉంది. ఏసీబీ తనిఖీలు ప్రారంభమైన తర్వాత గ్రామస్తుల సమాచారం తెలుసుకున్న సుమారు 20 మంది విద్యార్థులు హాస్టల్‌కు చేరుకున్నారు. వారిని అధికారులు విచారించగా హాస్టల్‌లో నీరు, మరుగుదొడ్ల వసతి లేకపోవడంతో ఇళ్లకు వెళుతున్నట్లు చెప్పారు. దీంతో అధికారులు మరుగుదొడ్లు పరిశీలించారు. అవి దుర్భరంగా ఉండగా, తలుపులు సైతం లేవు. అనంతరం ఏఎస్‌డబ్ల్యూఓ బి.శ్రీదేవిని హాస్టల్‌కు పిలిపించి ఆమె ద్వారా హాస్టల్‌ స్థితిగతుల గురించి వివరాలు నమోదు చేసుకున్నట్లు డీఎస్పీ శాంతో వివరించారు.

హాస్టల్‌ గదులు అపరిశుభ్రంగా ఉన్నాయని, శానిటేషన్‌ లేదని, కొన్ని గదులను పాత సామాన్లతో నింపి నిరుపయోగంగా ఉంచారని గుర్తించినట్లు ఆయన తెలిపారు. హాస్టల్‌లో స్థానిక విద్యార్థులతోపాటు నడిగడ్డ అగ్రహారం, బిల్లుపాడు గ్రామాలకు చెందినవారు ఉన్నట్లుగా రికార్డుల్లో నమోదై ఉన్నారు. వాస్తవానికి ఆ గ్రామాల విద్యార్థులు రాత్రి వేళల్లో ఉండటంలేదని తెలుసుకున్నారు. సమగ్ర నివేదికను రూపొందించి జిల్లా కలెక్టర్‌కు, సంబంధిత ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ బి.రమేష్‌బాబు, సిబ్బంది నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

నివేదిక ఇచ్చాం
ఏఎస్‌డబ్ల్యూఓ బి.శ్రీదేవి మాట్లాడుతూ తాను గత నెల 26 తేదీన హాస్టల్‌ను తనిఖీ చేసినట్లు చెప్పారు. సౌకర్యాలు, విద్యార్థుల హాజరు గురించి నమోదు చేసుకున్నట్లు చెప్పారు. వసతులు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు చెప్పుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement