
30 ఏళ్లకే 235 కిలోల బరువు
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన రాగోలు నాగ శ్రీనివాసరావు (30) జన్యుపరమైన కారణాలతో 235 కేజీల బరువు ఉన్నాడు.
లబ్బీపేట : పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన రాగోలు నాగ శ్రీనివాసరావు (30) జన్యుపరమైన కారణాలతో 235 కేజీల బరువు ఉన్నాడు. చిరుద్యోగం చేస్తూ తల్లితో కలిసి వుంటున్నాడు. జన్యుపరమైన కారణంతో శరీరం బరువు విపరీతంగా పెరిగింది. ఆయాసం, గురక, నిద్రలేమి, కాళ్ల వాపులు, మోకాళ్ల నొప్పులు ఇతర శారీరక ఇబ్బందులు పడుతున్నాడు. మధుమేహం, రక్తపోటుతో బాధపడుతూ ఈ నెల 7న నగరంలోని ఎండోకేర్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గించవచ్చునని తెలిపారు.
నెలకు వచ్చే రూ. 5వేల జీతంతో కుటుంబ పోషణే కష్టంగా ఉన్న తమకు లక్షలు వేచ్చించి చికిత్స చేసుకునే ఆర్థిక స్థోమత లేదన్నారు. వైద్యులు మానవతా దృక్పధంతో శస్త్ర చికిత్సను ఉచితంగా చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే మందులు, ఇతర ఖర్చులకు దాతలు ముందుకు వచ్చి తమ కుమారుడికి పునర్జన్మను ప్రసాదించాలని బాధితుడి తల్లి వేడుకుంటోంది. దాతలు సెల్ : 80993 53535ను సంప్రదించాలని బాధితుడు కోరారు.
బేరియాట్రిక్‌తో బరువు తగ్గించవచ్చు : డాక్టర్ రవికాంత్
నాగ శ్రీనివాసరావుకు చికిత్స చేస్తున్న డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ బేరియాట్రిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గించవచ్చునని చెప్పారు. గతంలో ఇలాంటి వారికి విజయవంతంగా చికిత్స చేశామన్నారు. తమ వంతుగా ఉచితంగా చికిత్స చేస్తామని, మందులు, ఇతరత్రా ఖర్చులకు రూ.2 లక్షల వరకు అవుతాయని, దాతలు ముందుకు వస్తే, నాగశ్రీనివాసరావుకు పునర్జన్మ ప్రసాదించవచ్చని వివరించారు.