కళ్లెదుటే కాటేసిన మృత్యువు | one died with power shock | Sakshi
Sakshi News home page

కళ్లెదుటే కాటేసిన మృత్యువు

Jan 18 2018 3:51 AM | Updated on Sep 18 2018 8:38 PM

కన్ను తెరిస్తే జననం.. కనుమూస్తే మరణం... రెప్పపాటే మనిషి జీవితం అన్న కవి మాటలు అక్షర సత్యాలని నిరూపితమయ్యాయి. బతుకు తెరువు కోసం వలస వచ్చిన ఓ కార్మికుడు అందరూ చూస్తుండగానే అకాల మృత్యువాత పడ్డాడు. అప్పటి వరకూ తమ మధ్య చలోక్తులు విసురుతూ నవ్వుతూ.. నవ్వి స్తూ పనిచేసిన అభాగ్యుడిని మృత్యుపాశం నుంచి కాపాడేందుకు సహ కార్మికులు చేసిన ప్రయత్నమేదీ ఫలించలేదు. విద్యుత్‌ షాక్‌ నుంచి తప్పించుకున్నా.. విధి విసిరిన పాచిక బలీయమై.. ఇనుప చువ్వ రూపంలో మృత్యువు కబళించింది. నెత్తురోడుతున్న విగత శరీరమే చివరకు మిగిలింది.  

గుంతకల్లు టౌన్‌:  ఉపాధి కోసం వచ్చిన యువకుడిని మృత్యువు కబళించింది. గుంతకల్లులో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం మొలకాల్మూరు తాలూకా పైకానమ్‌ గ్రామానికి చెందిన సిద్దయ్య కుమారుడు గవిసిద్ద (19) బళ్లారి భరత్‌ సప్లయర్స్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గుంతకల్లు పట్టణంలోని పరిటాల శ్రీరాములు కల్యాణ మండపం ఆవరణలో రెండు రోజుల క్రితం జరిగిన వివాహ వేడుకల్లో షామియానా వేసి, ఇతర డెకరేషన్లు చేసేందుకు తోటి కూలీలతో కలిసి వచ్చాడు.

 బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో కల్యాణ మండపం మెయిన్‌ గేట్‌ దిమ్మెపైకి ఎక్కి షామియానా పోల్‌(స్తంభాల)ను తొలగించే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో షామియానా పైన ఉన్న 11 కేవీ విద్యుత్‌ తీగ తగలడంతో పట్టుతప్పి నేరుగా గేట్‌  మీదకు పడ్డాడు. గేట్‌కు అమర్చిన ఇనుప చువ్వ ఛాతీభాగంలో గుచ్చుకుంది. రక్తస్రావంతో విలవిలలాడుతున్న గవిసిద్దను కాపాడటానికి తోటి కూలీలు శతవిధాలుగా ప్రయత్నించారు. బయటకు తీసేలోపే ఆ యువకుడు మరణించాడు. ఘటనా స్థలాన్ని అర్బన్‌ సీఐ రాజా, ఒన్‌టౌన్‌ ఎస్‌ఐ యు.వి.ప్రసాద్‌లు పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement