breaking news
Interview
-
మట్టి పాటలే మనసు దాకా...– భీమ్స్ సిసిరోలియో
‘‘అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ పాట టాప్‌లోనే ఉంటుంది. పోటీలో ఉన్నది పాట గానీ మనుషులు కాదని నా ఫీలింగ్. మ్యూజిక్ డైరెక్టర్‌గా నేను ఎప్పుడూ ఒక కూలీనే. సాధారణంగా ఓ రైతు ఎలా ఉంటాడో, సాధారణ కార్మికుడు ఎలా ఉంటాడో, కూలి పని చేసుకునే వాళ్లు ఎలా ఉంటారో నేను కూడా అంతే’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అన్నారు. నేడు అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమ్స్ ‘సాక్షి’తో ఎక్స్‌క్లూజివ్‌గా పంచుకున్న విశేషాలు...→ రోజూ సంగీత దినోత్సవమే...రోజూ నేను సంగీత ప్రపంచంలోనే ఉంటాను కాబట్టి దేవుడి పాదాల చెంత ఉన్నట్టే ఉంటుంది. రోజూ ఇలాంటి అనుభూతితోనే ముందుకు వెళ్తుంటాను. నేనెప్పుడూ సంగీతంతో సహవాసం చేస్తుంటాను కాబట్టి రోజూ సంగీత దినోత్సవమే. → 30 ఏళ్లు ముందుకి...ఓ పాటను మొదలు పెట్టినప్పుడు నా ఆలోచన ఎలా ఉంటుందంటే... ఆ పాటని ప్రపంచానికి పరిచయం చేసేటప్పుడు గర్వంగా ఉండాలి, విజయకేతనం ఎగరవేయాలి. మారుతున్న కాలానికి, మనుషుల ఆలోచనా విధానానికి తగ్గట్టుగా, శ్రోతలు వినే ఒరవడికి తగ్గట్టుగా ఆలోచిస్తాను. 20 ఏళ్ల తర్వాత అప్పటి యువత ఈ పాట వింటే ఎలా ఉంటుంది? 30 ఏళ్ల తర్వాత తిరిగి ఆ పాటను మనం వింటే ఎలా ఉంటుంది? అని ఆలోచిస్తాను. → జానపద గీతం అమ్మలాంటిది జానపద గీతం అమ్మ లాంటిది. జానపదం అంటే మట్టి నుంచి ఉద్భవించినటువంటి మొక్క. ఆ మట్టికి పచ్చదనంతో పాటు గాలిని, మంచి ఫలాలను ఇచ్చే గుణం కూడా ఉంటది. అలాంటి మట్టి పాటలు ఎప్పుడూ ప్రపంచానికి బోర్ కొట్టవు. అలాంటి పాటలు ఈరోజు సినిమాల్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ప్రధాన పాత్రను ఎందుకు పోషిస్తున్నాయంటే అది మట్టి భాష. మట్టి నుంచి వెలువడే పరిమళం మనకు ఎంత అద్భుతమైన అనుభూతిని ఇస్తదో, మట్టి నుంచి వెలువడిన పాటలు కూడా అలా మనసును హత్తుకుంటాయి. అందుకే ప్రపంచ వేదిక మీద కూడా ప్రధానంగా జానపద గీతాలే ఉంటాయని నా ప్రగాఢ నమ్మకం.→ ప్రజలు నిర్మించిన సౌధాన్ని!నేను ఎప్పుడూ మ్యూజిక్ డైరెక్టర్లతో పోటీ పడను. అంతేకాదు... మ్యూజిక్ డైరెక్టర్ల పోటీలో నేను లేను. ఎందుకంటే నేను ప్రజల నుంచి వచ్చిన వాడిని. భీమ్స్ అనేవాడు ఇక్కడ ఉంటే బాగుంటుంది. మన భాష పాటలు, మన మానసిక స్థితి, మన స్థితిగతులు తెలిసినవాడు ఇక్కడ ఉండాలని వాళ్లు తీసుకొచ్చి ఇండస్ట్రీలో కూర్చోబెట్టి పాటలు చేయించుకుంటున్నారు. నేను ప్రజల నుంచి ఉద్భవించిన పాటని. నేను కేవలం ప్రజలు నిర్మించిన సౌధాన్ని, వాళ్లు నియమించుకున్న ప్రతినిధిని మాత్రమే. వాళ్లు ఏం చెబితే అది చేస్తా.→ సొంత మనిషిలా చూసుకుంటారు! బయటికెళ్లినప్పుడు కొందరు నన్ను గుర్తుపట్టి.. ‘మీ పాటలు మాకు చాలా స్ఫూర్తిని ఇచ్చాయి. మేము దుఃఖాల్లో ఉన్నప్పుడు మాకు భరోసానిచ్చాయి... ఆశలు చిగురింపజేశాయి. మీ పాటలు, మీ మాటలు మమ్మల్ని ఉత్తేజపరిచాయి’ అని అంటుంటారు. అయితే ఇవన్నీ ప్రజలే నాకు ఇచ్చిన ఆస్తి. నేను వాళ్ల దగ్గర నుంచి తీసుకున్నది ధనమో లేదంటే బంగారమో కాదు. వారి దగ్గర నుంచి బుద్ధి, మంచి జ్ఞానం నేర్చుకున్నా. వాళ్ల ప్రేమ, ఆత్మీయత ఎలా ఉంటా యంటే సొంత మనిషిలాగా చూసుకుంటారు.→ వ్యవసాయం చేస్తున్నానుప్రస్తుతం సంగీత దర్శకునిగా కొన్ని సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. అయితే ఇప్పుడు కొంచెం వ్యవసాయ రంగం మీద ఫోకస్ చేశా. మా నాన్న అంగోతు మంగ్యాగారు చెప్పడంతో ఊరిలో పొలం పనులు చేస్తున్నాను. మా నాన్న, నేను కలిసి వరి, పత్తి, పెసర్లు, వేరుశనగ పంటలు పండిస్తున్నాం. నేను రైతు బిడ్డనే కదా... రైతు బతుకే నాకు ఇష్టం. ఎంత మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ.. రైతు బిడ్డ రైతు అయితే అంతకంటే ఆనందం ఏముంది. – డేరంగుల జగన్ మోహన్ -
ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఇరాన్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో పట్టుమని ఒక్క గంట కూడా శాంతి పరిస్థితులు నెలకొనలేదు. ఇరాన్, అమెరికాలు యుద్ధ విరమణ, శాంతి చర్చలకు ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ.. హెజ్బొల్లా పేరు చెప్పి లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. కేవలం 10 నిమిషాల్లో 100 బాంబులు ప్రయోగించి భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు కలగజేసింది. లెబనాన్‌పై దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమర్థించుకున్నారు. రెండు వారాల కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదని.. అది జలసంధిలో భాగం కాదని.. హెజ్బోల్లాపై దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి చర్చలు అసంబద్ధం అని పేర్కొంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి చర్చల ప్రతినిధి మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నంతవరకు అమెరికాతో శాంతి చర్చలు జరపడం అసాధ్యమని, ఈ చర్చలే అసంబద్ధమని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్(పాకిస్తాన్) వేదికగా శాంతి చర్చలు జరగనున్నాయి. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఈ చర్చలను ముందుకు నడిపించనుంది.ఇజ్రాయెల్ లెబనాన్‌పై ఇప్పటివరకు జరిగిన అత్యంత భారీ వైమానిక దాడులు జరపగా.. 254 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క బీరుట్‌లోనే 91 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. ప్రతికారంగా.. హెజ్బోల్లా కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇజ్రాయెల్–లెబనాన్ ఘర్షణలు మధ్యప్రాచ్యంలో(Middle East) శాంతి ప్రయత్నాలను మరింత క్లిష్టం చేస్తున్నాయని పలువురు ప్రపంచ అధినేతలు అభిప్రాయపడుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ లెబనాన్‌పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. యూరప్, జపాన్, కెనడా నాయకులు సంయుక్త ప్రకటనలో శాంతి కోసం పిలుపునిచ్చారు. -
స్టాక్ మార్కెట్లే ఇప్పుడు దిక్కు
అమెరికా నుంచి ప్రతికూలతలు ఎదురవుతున్నా... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నా... భారత మార్కెట్లు అంతకంతకూ పెరుగుతుండటానికి కారణం దేశీ ఇన్వెస్టర్లకు మార్కెట్లపై ఉన్న నమ్మకమేనని, కొన్నేళ్లుగా వారు కళ్లజూస్తున్న లాభాలే వారిని ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రేరేపిస్తున్నాయని ఎడిల్వీజ్ ఏఎంసీ ఎండీ– సీఈఓ రాధికా గుప్తా అభిప్రాయపడ్డారు. వినూత్న ఉత్పత్తులతో ఎడిల్వీజ్ను దేశవ్యాప్తంగా విస్తరించి... దేశంలోని అగ్రశ్రేణి మ్యూచువల్ఫండ్ కంపెనీల్లో ఒకటిగా మార్చిన రాధికా గుప్తా... నిరంజన్ అవస్థితో కలిసి ‘మ్యాంగో మిలియనీర్’ అనే పర్సనల్ ఫైనాన్స్ పుస్తకాన్ని రాశారు. దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటూ ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో ఎంఎఫ్ పరిశ్రమ 200 లక్షల కోట్లకు చేరుతుందంటున్న రాధికాతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ ఇది...(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) → అంతర్జాతీయంగా ఇబ్బందులెదురవుతున్నా భారత మార్కెట్లు కొత్త శిఖరాలను చేరుకోవటానికి కారణం? యువత ఆకాంక్షలు పెరుగుతున్నాయి. మరోవంక ఇన్వెస్ట్‌మెంట్‌కు మరీ ఎక్కువ ప్రత్యామ్నాయాలేవీ లేవు. ఎందుకంటే బ్యాంకు డిపాజిట్లు చేశారనుకుందాం. పన్నులు పోతే మిగిలేది తక్కువే. పెరుగుతున్న జీవన ప్రమాణాలకిది సరిపోదు. అందుకని సహజంగానే జనం ఈక్విటీ మార్కెట్ల వైపు చూస్తున్నారు. నేను ఎంఎఫ్ పరిశ్రమలో అడుగుపెట్టినపుడు ‘సిప్’ ద్వారా వచ్చే మొత్తం 4 వేల కోట్లుగా ఉండేది. ఇపుడది 28వేల కోట్లకు చేరింది. ఇందులో అత్యధిక భాగం దీర్ఘకాలికం. అదే ఇక్కడ కీలకం. ప్రత్యేకించి గడిచిన రెండేళ్లుగా మార్కెట్లోకి వస్తున్న కొత్త ఇన్వెస్టర్లకు మంచి లాభాలొస్తున్నాయి. → అయితే ఈ ర్యాలీ చల్లారిపోయేది కాదని, బుడగలేవీ లేవని అంటున్నారా? స్మాల్‌క్యాప్ కంపెనీలు... కొన్ని థీమ్స్..., కొన్ని కంపెనీల రూపంలో ఈ బబుల్స్ ఉండొచ్చు. పాలపై నురుగు ఓ 20 శాతం తప్పదు. ఏ బుల్ ర్యాలీకైనా ఇది వర్తిస్తుంది. దానర్థం మొత్తం మార్కెట్ ఇలానే ఉందని కాదుకదా? పునాదులు గట్టిగా ఉన్నాయన్నదే నా పాయింట్. → మరి ఇలాంటి సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లకు మీరేం చెబుతారు? అన్నిటికన్నా ముఖ్యం... అతిగా ఆశించకపోవటం. నా పుస్తకంలో కూడా అదే చెప్పాను. చాలామంది ఇన్వెస్టర్లు గత సంవత్సరాన్ని బేరీజు వేసుకుంటూ 30–40 శాతం రాబడి వస్తుందనే అంచనాలతో ఉన్నారు. అది సరికాదు. రెండోది... హైబ్రిడ్ ఫండ్లు, మల్టీ అసెట్ ఫండ్లు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ల వంటి మధ్యస్త ఆదాయాన్నిచ్చే ఉత్పత్తులను ఎంచుకోండి. ఇవి మరీ సంప్రదాయకంగా కాకుండా... మరీ దూకుడుగా కాకుండా మధ్యస్తంగా ఇన్వెస్ట్‌చేస్తాయి. స్థిరంగా నిలకడైన రాబడులనిస్తాయి. సంపద సృష్టించాలంటే అలానే సాధ్యం. → డిఫెన్స్ థీమ్, ప్రభుత్వ బ్యాంకుల థీమ్ అంటూ రకరకాల స్టోరీలను ఈ మధ్య చూస్తున్నాం. చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు వీటిని నమ్ముతున్నారు కదా? నిజమే!. రిటైలర్లు ఇలాంటి స్టోరీల వెంటనే పరిగెడతారు. చివరకు దురదృష్టకరంగా ఎగ్జిట్ అవుతారు. నేనైతే ఈ థీమ్‌లను నమ్మను. ఏ ఒక్క రంగం వల్లనో దేశం ముందుకెళ్లదు. హోటల్స్, హాస్పిటల్స్, డేటా సెంటర్స్, క్యాపిటల్ మార్కెట్స్, టెక్నాలజీ.. ఇలాంటి రంగాలన్నీ దేశాభివృద్ధితో ముడిపడి ముందుకెళతాయి. → మార్కెట్లో ఏ ఒక్క రంగమైనా మరీ అతిగా పెరిగినట్లు భావిస్తున్నారా? అలాగని చెప్పలేం. అయితే కొన్ని అన్‌లిస్టెడ్ కంపెనీలు, ఎస్ఎంఈ ఐపీవోల విషయంలో మాత్రం ఆందోళన ఉంది. లిస్టింగ్‌లోనే లాభాలొస్తాయి కదా అని చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ పూర్వాపరాలేవీ పట్టించుకోకుండా అన్‌లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పేరు చెప్పలేను కానీ... ఈ మధ్య ఒక ఐపీవోలో దెబ్బతిన్నారు. కొన్ని ఎస్ఎంఈ కంపెనీలూ అంతే. వీటిలో పెద్ద లిక్విడిటీ ఉండదు. పరిస్థితులు అనుకూలించకపోతే ఇరుక్కుపోయే ప్రమాదమే ఎక్కువ. అందుకే నేనెప్పుడూ రిటైల్ ఇన్వెస్టర్లను ఇండెక్స్ ఫండ్లలో గానీ, ఏవైనా ఇతర మ్యూచువల్ ఫండ్లలో గానీ పెట్టుబడి పెట్టమని చెబుతాను. → కానీ కొన్ని కంపెనీలు ఏడాదిలో 50 శాతం... రెండుమూడు రెట్లు పెరగటం చూస్తున్నారు కదా? ఇవి రిటైలర్లను ఆకర్షిస్తాయి కదా? ఇలా పెరిగిన రెండుమూడు గురించే అంతా చెబుతారు. కానీ కుదేలైన షేర్ల గురించి చెప్పరు. స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించిన వారిని తప్ప నష్టపోయిన వారి స్టోరీలు బయటకు రావు. ఇలా ఒక షేర్లో పెట్టి లాభపడ్డ వారు కూడా మిగిలిన షేర్లలో రాబడి గురించి చెప్పరు. ఆ షేర్‌ను ఎంచుకోవటం వెనక వారి శ్రమ, సమయం కూడా ఉంటాయి కదా? ఏడాదికి 10–12 శాతం రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్లు బోరింగ్‌గా అనిపించవచ్చు. కానీ ఆ రాబడి స్థిరంగా ఉంటుంది. సురక్షితం కూడా. → చిన్న పట్టణాల్లో ఇన్వెస్ట్మెంట్ సంస్కృతి పెరుగుతోందా? చాలా. ఎడిల్వీజ్ను 5 నగరాల్లో ఆరంభించాం. ఇపుడు 60 పట్టణాల్లో ఉన్నాం. త్వరలో 200 పట్టణాలకు విస్తరిస్తాం. స్థానిక భాషల్లో ఆర్థిక పాఠాల లభ్యత.. వారికి సలహాదారులు, డిస్ట్రిబ్యూటర్లు అందుబాటులో ఉండటమన్నదే ప్రధానం. → పాసివ్ (ఇండెక్స్) ఫండ్లకు ఆదరణ పెరుగుతోంది కదా.. మరి యాక్టివ్ ఫండ్లకు వీటితో పోటీ ఉంటుందా? అలాంటిదేమీ లేదు. చాలామంది ఇన్వెస్టర్లు రెండింట్లోనూ పెట్టుబడి పెడుతున్నారు. బాగా రాబడులనిచి్చన యాక్టివ్ ఫండ్లలోకి పెట్టుబడులొస్తాయి. లేదంటే పాసివ్ ఫండ్లలోకి వెళతాయి. రెండూ పెరుగుతున్నాయనేది మనం గమనించాలి. → ఇపుడు చాలామంది ఇన్వెస్టర్లు అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఎడిల్వీజ్ ప్రణాళికలేంటి? టెక్నాలజీ, చైనా సహా కొన్ని గ్లోబల్ ఫండ్లను మేం నడిపిస్తున్నాం. కాకుంటే వీటికి ఆర్బీఐ పరిమితులున్నాయి. వీటిని గిఫ్ట్ సిటీ ద్వారా అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే గిఫ్ట్సిటీలో కార్యాలయాన్ని ఆరంభించాం. → ఐదు పదేళ్లలో ఎంఎఫ్ పరిశ్రమ ఎలా ఉండొచ్చు? 2030 నాటికి ఇది 200 లక్షల కోట్లకు చేరుతుందన్నది నా అంచనా. దీన్లో 130–140 లక్షల కోట్లు ఈక్విటీలోనే ఉంటాయి. సిప్ పెట్టుబడులు నెలకు రూ. లక్ష కోట్లను చేరుతాయి. దేశంలో 30–40 శాతం మంది మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయటమే వికసిత భారత్‌కు అర్థమన్నది నా భావన.→ యువత చాలామంది ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేస్తున్నారు. మీరేమంటారు? అదో దుర్మార్గం. ఎఫ్ అండ్ ఓ అనేది సంస్థలు రిస్‌్కను తగ్గించుకోవటానికి ఉపయోగించుకోవాల్సిన సాధనం. అంతేతప్ప అప్పులు తెచ్చి ట్రేడింగ్ చేసే యువత కోసం కాదు. విద్యార్థులు, చిన్నచిన్న వర్కర్లు, డ్రైవర్లు రుణాలు తీసుకుని ట్రేడింగ్ చేస్తున్న వ్యవహారాన్ని నేనూ విన్నా. ఇది గ్యాంబ్లింగ్. ప్రమాదకరం. రిటైల్ ఇన్వెస్టర్లు సిప్, మ్యూచువల్ ఫండ్ల ద్వారా తేలిగ్గా సంపద సృష్టించుకోవచ్చు. గ్యాంబ్లింగ్ అవసరం లేదు. → భారత్ బాండ్ ఫండ్ మాదిరి ఎడిల్వీజ్ నుంచి కొత్త ఉత్పత్తులేమైనా వస్తున్నాయా? అక్టోబర్ 1న మేం దేశంలో మొట్టమొదటి హైబ్రిడ్ స్పెషల్ ఇన్వెస్ట్మెండ్ ఫండ్‌ను (ఎస్ఐఎఫ్) ఆరంభించబోతున్నాం. సెబీ ఇటీవలే దీనికి అనుమతిచి్చంది. దీన్లో కనీస పెట్టుబడి సైజు రూ.10 లక్షలు. దీన్లో రిస్క్ తక్కువ ఉంటుంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి ఈ ఫండ్ ఉపయోగపడుతుంది. -
గెలుపు ఎర వేస్తారు.. తర్వాత ఓడిస్తారు: వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ‘బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎక్కువగా యువత పైనే ఉంటోంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేకమంది వీటికి బలవుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఈ వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లకు భిన్నంగా ఈ బెట్టింగ్ యాప్స్ యువతనే టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటివాళ్లు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. ఒకటీ రెండుసార్లు డబ్బు వచ్చినా అది కేవలం దోచుకోవడానికి ఎర అనే విషయం తెలుసుకోవాలి..’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో సజ్జనార్ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రాన్నీ కదిలించింది. తెలంగాణ సర్కారు వీటిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. గతంలో మల్టీ లెవల్ మార్కెటింగ్ దందాల పైనా ఇలానే పోరు కొనసాగించిన సజ్జనార్.. వాటికి సంబంధించి ప్రత్యేక చట్టం రావడానికి కారణమయ్యారు. తాజాగా బెట్టింగ్ యాప్స్‌పై యుద్ధం ప్రకటించిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అవగాహన పెంచేందుకే ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ యువత ప్రాణాలు తీసుకోవడం కదిలించింది. బెట్టింగ్ యాప్‌ల బారినపడ కుండా వారిని కాపాడటం కోసం, వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రారంభమైంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది సెర్చ్ చేశారు. క్యాంపెయినింగ్ మొదలైన తర్వాత ‘ఎక్స్’ను 1.2 కోట్లు మంది, ఇన్‌స్ట్రాగామ్‌ను 85 లక్షలు మంది వీక్షించారు. ప్రస్తుతం అనేక మంది సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు ప్రముఖులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్లు ఆయా ప్రకటనలు చేసేప్పుడు తదనంతర పరిణామాలను ఊహించలేదు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సైబర్ టెర్రరిజం కిందికే వస్తుంది. మన పోలీసులు ఆది నుంచీ ముందున్నారు సమాజంలో జరుగుతున్న వివిధ రకాలైన ఆర్థిక దోపిడీలను అడ్డుకోవడంలో మన పోలీసులు ఎప్పుడూ ముందుంటున్నారు. ఒకప్పుడు ఎంఎల్ఎం స్కామ్స్, ఆపై మైక్రో ఫైనాన్స్ దుర్వినియోగాలను పకడ్బందీగా కట్టడి చేశారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వంతు వచ్చింది. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి కేవలం పాత్రధారులనే కాదు సూత్రధారులకూ చెక్ చెప్పే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చట్టాన్ని కూడా కఠినంగా అమలు చేయాలి. అన్నివర్గాల్లో అవగాహన కల్పించాలి. బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేయడం, ప్రమోటర్లతో పాటు నిర్వాహకుల పైనా చర్యలు తీసుకోవడం అవసరం. ఈ బెట్టింగ్ ప్రకటనలను అనుమతించిన మీడియా ప్లాట్‌ఫామ్‌లూ బాధ్యత వహించేలా చేయాలి. లావాదేవీలను సులభతరం చేసే చెల్లింపు గేట్‌వేల లైసెన్స్‌లు రద్దు చేయాలి. అడ్డుకట్ట వేయకపోతే ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సిందే.. బెట్టింగ్ నెట్‌వర్క్‌లు విదేశాల నుండి పనిచేస్తుంటాయి. అందువల్ల వీరిని కనిపెట్టి, కట్టడి చేయడం కష్టసాధ్యమైన అంశం. అందువల్ల అంతా ముందుకు వచ్చి అందరిలోనూ అవగాహన కల్పించడం ద్వారా ఈ ఉచ్చు నుంచి యువతను తప్పించాలి. పోలీసులు సైతం ఎప్పటికప్పుడు బెట్టింగ్ దందాలపై అవరసమైన చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లు అనేక కుటుంబాలు కుప్పకూలడానికి కారణం అవుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక ఉగ్రవాదంతో సమానం. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయకపోతే దానికి ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఈ తరుణంలో అందరం కలిసి ముందుకు వెళితేనే మన సమాజాన్ని కబళిస్తున్న బెట్టింగ్ భూతానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టగలం. యువతరాన్ని రక్షించుకోగలం. తల్లిదండ్రుల అప్రమత్తతా కీలకం బెట్టింగ్ యాప్‌ల విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. ఈ భూతాన్ని పూర్తిగా పారద్రోలాలంటే తల్లిదండ్రుల సహకారం అనివార్యం. ప్రతి ఒక్కరూ తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సోషల్‌మీడియా వినియోగదారుల్లో 16–30 ఏళ్ల మధ్య వయసు్కలే ఈ యాప్‌ల టార్గెట్‌గా ఉంటున్నారు. ఇక తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ఎందరో విద్యార్థులు తమ చదువుకు ఉద్దేశించిన డబ్బును బెట్టింగ్‌లో పోగొట్టుకుని విద్యకు దూరమైన ఉదంతాలు ఉన్నాయి. యువత అనేకమంది అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఇవి ఆత్మహత్యలు కాదు.. బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేసే వాళ్లు చేసిన హత్యలు. -
జన్మతః పౌరసత్వం రద్దుపై సుప్రీం కోర్టుకు ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ఫెడరల్ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) సవాల్ చేశారు. అత్యవసర పిటిషన్‌గా విచారణ చేట్టాలన్న అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే(జనవరి 20వ తేదీన) విదేశీయులకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలుయ్యాయి. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. ఆ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశాయి మసాచుసెట్స్, మేరీలాండ్, వాషింగ్టన్ కోర్టులు. అయితే కింది కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా.. దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను నిలుపుదల చేయడం సరికాదని ట్రంప్ సర్కార్ తరఫున తాత్కాలిక సాలిసిటర్ జనరల్ సారా హారిస్ వాదనలు వినిపించారు. కాబట్టి అది అమలు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అనంతరం విచారణ వాయిదా పడింది. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కు (Birthright citizenship)ను ట్రంప్ రద్దు చేశారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. పలువురు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించారు. పౌరసత్వ రద్దుకు సంబంధించి 22 రాష్ట్రాలు, పలు పౌరసంఘాలు మూకుమ్మడిగా కోర్టుల్లో పలు దావాలు వేశాయి. కోర్టు జోక్యంతో ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు నిలిచిపోయాయి.14వ సవరణ ఎందుకు వచ్చిందంటే..అమెరికాలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య బానిసత్వం, హక్కుల సాధనగా మొదలైన అంతర్యుద్ధం 1861-65 మధ్య కొనసాగింది. ఈ యుద్ధంలో దాదాపు 6,20,000 మంది మరణించారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ చిన్నారికి అక్కడి పౌరసత్వం లభిస్తోంది. -
ఆరోగ్య రంగంలో ‘ఏఐ’ విప్లవాత్మక పాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య ఆరోగ్య రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవాత్మక పాత్ర పోషిస్తోందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)– ఢిల్లీ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. పెరుగుతున్న దేశ జనాభా దృష్ట్యా ముందస్తు రోగ నిర్ధారణ, వేగవంతమైన చికిత్సల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మహమ్మారి వ్యాధుల నిర్ధారణ, తీవ్రత అంచనా, వ్యాధి విశ్లేషణలకు ఏఐ పరిపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. ఎయిమ్స్–ఢిల్లీలోని చాలా విభాగాలు ఇప్పటికే రోగనిర్ధారణ, రోగి–కేంద్రీకృత సేవల్లో ఏఐని వినియోగిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో ఏఐ వినియోగంలో ఎయిమ్స్ ఢిల్లీని అత్యుత్తమ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించిందని, ప్రాథమిక స్థాయిలోనే ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో గత మూడేళ్లుగా డెర్మటాలజీ, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ వంటి విభాగాల్లో పరిష్కారాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడం, అమలు చేయడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి ఎయిమ్స్ అవిశ్రాంతంగా పని చేస్తోందన్నారు. ఏఐ ఆధారిత సీసీటీవీ కెమరాలతో అధీకృత సిబ్బంది డేటాబేస్‌తో ముఖాలను పోల్చడానికి, ముఖాలను గుర్తించడానికి ఉపయోగిస్తున్నామని, అంతేగాక వీటితో అనధికార ఎంట్రీలను నిరోధించడం ద్వారా భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురష్కరించుకొని ఎయిమ్స్‌లో నిర్వహించిన సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎయిమ్స్ పరిధిలో పాలనా పరంగా తీసుకొచి్చన సంస్కరణలు, రోగులకు అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాలను ఆయన వివరించారు. ఇటీవలే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఏఐ వినియోగం కోసం ఎయిమ్స్ ఢిల్లీని ప్రధాన సంస్థగా నియమించారని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 20 సంస్థల కన్సారి్టయంకు ఎయిమ్స్ ఢిల్లీ నాయకత్వం వహిస్తోందని తెలిపారు. మిగతా వివరాలు ఆయన మాటల్లోనే.. 4 వేలకు చేరువలో బెడ్లు..: ప్రస్తుతం ఎయిమ్స్‌కి ప్రతి రోజూ సగటున 15వేలకు పైగా రోగులు ఓపీడీ సేవలకై వస్తున్నారు. కోవిడ్ తర్వాత ఓపీడీ కేసుల సంఖ్య 20–30 శాతం పెరిగింది. వీరికి కనీసంగా 15వేల మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ఇక రోగులకై కోవిడ్ వరకు 2,600 వరకు బెడ్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 3,600లకు పెంచాం. ఇందులో మాతా, శిశు బ్లాక్‌లోనే ఏకంగా 425 బెడ్లను పెంచగా, సర్జికల్ బ్లాక్‌లో 200ల బెడ్లు అదనంగా ఏర్పాటు చేశారు. రోగులకు మందుల అందుబాటులో ఉంచేందుకు ఇటీవలి కాలంలో 4 అమృత్ ఫార్మసీలను అందుబాటులోకి తెచ్చాం. ఇక ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా 30 వేల మంది రోగులకు చికిత్స అందించాం. దేశం నలుమూలల నుంచి వివిధ వ్యాధులతో వచ్చి వారిని ఒక్కరినీ తిరిగి పంపడం లేదని, ప్రతి ఒక్కరికీ వైద్యం అందిస్తున్నాం. వివిధ రాష్ట్రాల్లోని ఎయిమ్స్ ఆస్పత్రుల్లోని రోగులకు సైతం రిఫరెన్స్‌ల ఆధారంగా టెలీకన్సల్టేషన్ విధానంలో ఆరోగ్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. రోగుల సహాయకులకు 1,516 బెడ్లు.. ఇక రోగులకు సహాయకులుగా వచ్చే వారికి ఎలాంటి ఇక్కట్లు లేకుండా 5 విశ్రాంతి సదన్లను ఏర్పాటు చేయగా, అందులో 1516 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటే ఓపీడీ సహా ప్రతి కేంద్రం వద్ద వెయిటింగ్ ఏరియాలను ఏర్పాటు చేశాము. ఆస్పత్రి పరిధిలో పర్యావరణహిత ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ఎల క్ట్రిక్ షటిల్బస్ సరీ్వసులు నడుపుతున్నాం. రోగు ల నుంచి ఎలాంటి ఫిర్యాదులైనా స్వీకరించి వాటి ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సంతుష్ట్ పోర్టల్‌ను ఏర్పాటు చేశాం, దీనిద్వారా రోగులకు మరింత మెరుగైన సేవలను అందించే వీలు కలుగుతోంది. ఆస్పత్రిలో రోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని సీఎస్ఆర్ నిధులను సమకూర్చుకున్నాం. ఇప్పటికే 15కి పైగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు రూ.150 కోట్లకు పైగా నిధులను సమకూర్చాయి. ఇందులో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఏకంగా రూ.108 కోట్లు అందించింది. డిజిటల్ పాలన.. ఎయిమ్స్‌లో పారదర్శకతను పెంచేందుకు వీలుగా పూర్తిగా డిజిటల్ పాలనను అందుబాటులోకి తెచ్చాం. పేపర్‌లెస్‌గా మార్చాలని నిర్ణయించి, ఇప్పటికే ఈ–హాస్పిటల్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నాం. 100 శాతం ఈ–ఆఫీస్ ప్రక్రియతో నడుస్తున్న దేశంలోని మొదటి ఆస్పత్రి ఎయిమ్స్ ఒక్కటే. ఎయిమ్స్‌లో ప్రస్తుతం ఫిజికల్ ఫైల్స్ వినియోగం లేదు. 6 నెలల్లో 17,000 ఈ–ఫైళ్లు, 1.11 లక్షల రసీదులు జారీ చేశాం. డిజిటల్ ప్రొక్యూర్మెంట్ రీఫారŠమ్స్‌లో భాగంగా స్టోర్లలో ఆటోమేషన్, డిజిటల్ ప్రొక్యూర్మెంట్ లైబ్రరీ ఉన్నాయి. ఈ కొనుగోలు విధానంతో సగటు కొనుగోలు ధర 10 శాతం నుంచి 200 శాతం తగ్గింది. దీంతో వార్షిక పొదుపు రూ. 100 కోట్లుగా ఉంది. ఇక నియామకాల్లోనూ పూర్తిగా ఆన్‌లైన విధానమే కొనసాగుతోంది. నోటిఫికేషన్ మొదలు పరీక్ష, నియామకపత్రాల జారీ, అపాయింట్మెంట్ ఆర్డర్ల వరకు పూర్తిగా ఆన్లైన్ విధానంలో పూర్తి పారదర్శకతను తెచ్చాం. -
అమరావతి పేరుతో మళ్లీ అదే తప్పు
కడప సెవెన్‌రోడ్స్: ‘నవ్యాంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో తెలంగాణ విడిపోయినప్పుడు రాజధానిని కోల్పోవాల్సి వచి్చంది. ఆ తర్వాత అమరావతిలోనే రాజధాని ఉండాలనే ఆ ప్రాంత వాసుల ఆకాంక్షల మేరకే చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేశారు. అయితే అమరావతిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడమంటే తెలంగాణ విషయంలో చేసిన తప్పే మళ్లీ చేయడం. అభివృద్ధి అంతా ఒకేచోట పోగు వేయడం సరైంది కాదు. అభివృద్ధి కేంద్రీకరణ విషయంలో గతంలో ఉన్న న్యాయ భావన ఇప్పుడు లేదు. నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక ఆ భావనకు తావు లేకుండాపోయింది. ఇప్పుడు అంతా సంపద సృష్టే తప్ప ప్రజలను పట్టించుకునే పరిస్థితులు లేవు’ అని ప్రొఫెసర్ జి.హరగోపాల్ కుండబద్దలు కొట్టారు. పౌరహక్కుల ఉద్యమ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రొఫెసర్ హరగోపాల్ ఓ సదస్సులో పాల్గొనేందుకు వైఎస్సార్ జిల్లా కడపకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వెనుకబడ్డ రాయలసీమ సమగ్రాభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం కూడా బాగా వెనుకబడి ఉంటుందని, ఆ ప్రాంత అభివృద్ధి కోసం బడ్జెట్ అనుమతులు, నిర్వహణ వంటివి గవర్నరే చేపడతారని చెప్పారు. రాయలసీమకు కూడా అలాంటి పరిపాలనా ఏర్పాటు జరగాలన్నారు. ఒకప్పుడు తెలంగాణ అభివృద్ధి బోర్డు ఉండేదని, ఆ తర్వాత దాన్ని రద్దు చేశారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ డిమాండుకు ఇది కూడా ఓ కారణమైందని చెప్పారు. అలాంటివి పునరావృతం కాకుండా రాయలసీమ సమగ్రాభివృద్ధికి నీటి పారుదల, పరిశ్రమలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలు తెలియజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి అవసరం ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి లేకుండా, సామాజిక న్యాయం జరగకుండా భాష ఒక్కటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేదన్న విషయం తెలంగాణ అనుభవం రుజువు చేసింది. అమరావతిలోనే అభివృద్ధి మొత్తం కేంద్రీకరించడం ద్వారా తెలంగాణ విషయంలో చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీలో వెనుకబడిన రాయలసీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ దిశగా కొంతమేరకు కృషి చేశారు. విదర్భ తరహాలో ఈ ప్రాంతానికి బడ్జెట్ కేటాయింపు కోసం ఒక పరిపాలనా ఏర్పాటు జరగాలి. అభివృద్ధినంతా ఒకే చోట పోగేయడం సరికాదు. ఒకసారి రాష్ట్ర విభజన జరిగినా, ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకోకుండా మళ్లీ అదే తప్పు చేయడం సమంజసం కాదు. ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అసమానతలు ఉన్నప్పుడు భావ సమైక్యత ఎలా ఉంటుంది? సామాజిక న్యాయం జరగకుండా భాష ఒక్కటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేదు. అందువల్లే ప్రాంతీయ అసమానతలు ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ కరువు పీడిత ప్రాంతం. ఉత్తరాంధ్రలో నీళ్లు ఉన్నా వెనుకబడి ఉంది. కోస్తాలో కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నా ఒకప్పుడు అది కరువు ప్రాంతంగా ఉండేది. కరువును పారదోలడం, వరదల ముప్పు తప్పించడం కోసం 1852లో సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టలు నిర్మించడంతో ఆ ప్రాంతం సస్యశ్యామలమైంది.అక్కడి రైతులు వ్యవసాయంలో వచ్చిన అదనపు ఉత్పత్తిని మద్రాసులోని సినిమా రంగం, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టారు. అలా సంపద పెరుగుతూ ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. నదీ జలాల్లో వెనుకబడ్డ ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ అలా జరగకపోవడం ప్రాంతీయ అసమానతలను పెంచింది. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు ఉన్న రాజకీయ ప్రాబల్యం వెనుకబడ్డ ప్రాంతాలకు ఉండదు. అందుకే రాయలసీమకు చెందిన వారు ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ కోస్తాంధ్రుల ప్రాబల్యం వల్ల ఆ ప్రాంతానికే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. విభజన అనుభవాలు మరువకముందే.. రాజకీయ ప్రాబల్యాన్ని అనుసరించే అభివృద్ధి నమూనా ఉంటోంది. రాష్ట్ర విభజన అనుభవాలు ఇంకా మరిచిపోకమునుపే మళ్లీ అవే తప్పులు మళ్లీ చేస్తున్నారు. ఇక్కడి నాయకులు కూడా ఈ ప్రాంత సమస్యలు పట్టించుకోవడం లేదు. వివిధ చారిత్రక, రాజకీయ కారణాలతో రాయలసీమలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.గతంతో పోలిస్తే ఫ్యాక్షన్ ప్రభావం చాలా మేరకు తగ్గినప్పటికీ రక్షణ ఉండదని భావిస్తున్న ప్రజలు నేటికీ ఏదో ఒక నాయకుడి ప్రాబల్యం కింద ఉన్నారు. వీటి నుంచి బయట పడాల్సిన అవసరం ఉంది. చైతన్యవంతమైన ప్రజా ఉద్యమం ద్వారానే రాయలసీమకు న్యాయం జరుగుతుంది. సీమకు నదీ జలాల విషయంలో వైఎస్సార్ శ్రద్ధ రాయలసీమకు నదీ జలాలను మళ్లించే విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కొంతమేర కృషి చేయగలిగారనేదానిని కాదనలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పు పనులు చేపట్టడంతో పాటు సీమ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. అయితే ఆయనపై కూడా అనేక ఒత్తిళ్లు వచ్చాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 290 కిలోమీటర్ల పరివాహక ప్రాంతమున్న కృష్ణా నీటిలో మా తెలంగాణ వాటా ఏమిటని మేము కూడా అడిగాం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా జరుగుతున్న సందర్భంలో కృష్ణా జలాలు పునః పంపిణీ చేయాలని కోరారు. పునః పంపిణీకి కోస్తాంధ్ర వాళ్లు ససేమిరా ఒప్పుకోరన్న విషయం రాజకీయ పరిణితి చెందిన వైఎస్‌కు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల పంపిణీ అయిపోయిందని ఆయన మాతో అన్నారు. ఏది ఎలా ఉన్నా సీమకు నదీ జలాలు ఇచ్చే విషయంలో ఆయన శ్రద్ధ తీసుకున్నారు. కొన్ని త్యాగాలు తప్పవు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉన్నాయి. వీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతైనా సముచితం. అన్ని ప్రాంతాలు కలిసి ఉండాలనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు. కోస్తాంధ్రులు తమ నీటి వినియోగాన్ని కొంతమేర తగ్గించుకోవడానికి ఇష్టపడరు. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న విజన్ ఇప్పుడు ఎవరికి ఉంది? ఒక ప్రాంతం వెనుకబడి ఉండటానికి చారిత్రక, రాజకీయ కారణాలు ఉంటాయి. విధాన పరంగా, ఒత్తిడి లేకుండా ఒక ప్రాంత అభివృద్ధిని పట్టించుకునే పరిస్థితులు లేవు. -
Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని కావాలన్న ఆశ తనకు అస్సలు లేదని ఆప్ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే ఇండియా కూటమి గెలిస్తే న్యాయ వ్యవస్థను ఒత్తిళ్ల నుంచి విముక్తం చేస్తామన్నారు. తన భార్య సునీతకు రాజకీయాలు నచ్చవని వెల్లడించారు. బెయిల్‌పై విడుదలయ్యాక బుధవారం ఆయన తొలిసారి పీటీఐ వీడియోస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సొంత రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌పై తన ఇంట్లోనే పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన ఉదంతంపై కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే... నియంతృత్వాన్ని నిలువరిస్తాం ‘‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే విపక్ష నేతలందర్నీ కట్టగట్టి జైలుకు పంపుతుంది. ఎన్నికలను హైజాక్ చేస్తుంది. రష్యా మాదిరే ఏకపక్ష ఎన్నికలుంటాయి. అక్కడ పుతిన్ విపక్ష నేతల్ని జైలుకు, కొందర్ని పైకి పంపారు. అందుకే తాజా ఎన్నికల్లో 87 శాతం ఓట్లు సాధించారు. పాకిస్థాన్‌లోనూ అంతే. ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపారు. సొంత పార్టీ గుర్తును కూడా ఎన్నికల్లో వాడుకోనివ్వలేదు. బీజేపీ మళ్లీ గెలిస్తే ఎవ్వరినీ వదలదు. కానీ మోదీ నియంతృత్వ పాలనను నిలువరిస్తాం. ఇండియా కూటమి 300 మార్కు దాటుతుంది. చక్కటి, సుస్థిర ప్రజాపాలన సాగిస్తాం. నాకు ప్రధాని కావాలనే ఆలోచనే లేదు. మాది (ఆప్) చాలా చిన్న పార్టీ. కేవలం 22 చోట్ల పోటీ చేస్తున్నాం. ప్రధానిగా రాహుల్‌ను నేను అంగీకరిస్తానా అన్నది ఊహాజనిత ప్రశ్న. అలాంటి అంశాలు చర్చకే గెలిచాక అందరం కలిసి కూర్చొని దీనిపై చర్చిస్తాం. సానుకూల పవనాలు ఊహించిందే ఆప్ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు, 2020లో 62 సీట్లు సాధించింది. ఈసారి ఆప్–ఇండియా కూటమికి సానుకూల పవనాలు వీయడంలో ఆశ్చర్యమేమీ లేదు. నన్ను అరెస్టు చేయడంతో ఢిల్లీ ఓటర్లు భావోద్వేగానికి గురయ్యారు. ఆ ప్రజాగ్రహం బీజేపీ ఓటమికి కారణం కాబోతోంది. నాకు బెయిల్ దొరకడం నిజంగా దేవుడి మాయ. నన్ను జైలుకు పంపితే ఆప్ ముక్కలుచెక్కలవుతుందన్న బీజేపీ కల కలగానే మిగిలిపోయింది. మలివాల్ ఉదంతంలో బాధితులకు న్యాయం జరగాలి మలివాల్‌పై దాడి కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాలి. రెండు వైపుల వాదనలను ఆలకించి పోలీసులు సరైన మార్గంలో దర్యాప్తు జరపాలి. నిజమైన బాధితులకు న్యాయం జరగా>లి. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడలేను. న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లుండవ్ఇండియా కూటమి అధికార పగ్గాలు చేపడితే న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేస్తాం. ఆ వ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తుంది. అప్పుడు నాపై మోపిన కేసులన్నీ బోగస్ అని తేలుతాయి. అందుకే జూన్ 4 ఫలితాల తర్వాత విపక్షాల కూటమి గెలిచాక కేసుల నుంచి విముక్తుడినవుతా. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి బీజేపీ, ఈడీ ఆరోపించినట్లు నగదు అక్రమ బదిలీ జరగలేదు. ఈ కేసులో వాళ్లింతవరకు ఒక్క పైసా కూడా కనుక్కోలేకపోయారు. అవినీతి జరిగి ఉంటే ఆ నగదు అంతా ఎటు పోయినట్లు?సునీతది ధర్మాగ్రహం 2000 దశకంలో ఢిల్లీ మురికివాడల పరిధిలో ఐటీ కమిషనర్‌గా పని చేశా. పదవీ విరమణ చేసి ప్రజా జీవితంలోకి వచ్చా. సొంతంగా పార్టీ పెడతానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఏకంగా సీఎం అవుతానని అస్సలు ఊహించలేదు. నా భార్య సునీతకు రాజకీయాలపై ఆసక్తి లేదు. భవిష్యత్తులోనూ క్రియాశీల రాజకీయాల్లోకి రాదు. నన్ను అక్రమంగా అరెస్టు చేసినందుకే తను ఇల్లు దాటి బయటికొచ్చి ధర్మాగ్రహం చూపింది. సునీత భార్య కావడం నా అదృష్టం. జీవితంలో ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచింది. నేను జైల్లో ఉండగా నాకు, ఢిల్లీ ప్రజలకు వారధిగా నిలిచింది. కస్టడీ ముగిసి నేను జైలుకెళ్తే సీఎంగా బాధ్యతల నిర్వహణకు తగిన వసతులు కలి్పంచాలని కోర్టును కోరతా. -
Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
అమేథీలో కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందంటూ బీజేపీ వ్యాఖ్యానించడం ఆ పార్టీ దురహంకారానికి ప్రతీక అని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ వ్యాఖ్యానించారు. గురువారం పీటీఐతో ప్రత్యేక ముఖాముఖి సందర్భంగా ఆయన ప్రస్తావించిన అంశాలు, వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..నేను సైతం సతీశ్ శర్మలా‘‘ 1990 దశకంలో గాంధీల సన్నిహితుడు, కాంగ్రెస్ నేత సతీశ్ శర్మ ఇదే అమేథీలో ఎంపీగా గెలిచారు. గాంధీల విజయపరంపరను కొనసాగించారు. తర్వాత తప్పుకుని సోనియాగాంధీ పోటీకి మార్గం సుగమం చేశారు. నేను భవిష్యత్తులో అలాగే చేస్తా. ఇక్కడ గెలిచి పార్టీ తరఫున ప్రాతినిథ్య బాధ్యతలు స్వీకరిస్తా. భవిష్యత్తులో గాంధీలు ఇక్కడి నుంచి పోటీ చేయాల్సి వస్తే అప్పుడు ఇవే ప్రాతినిథ్య బాధ్యతలను వారికి అప్పగిస్తా. అమేథీ నుంచి పోటీచేయకుండా రాహుల్ పారిపోయారని బీజేపీ వ్యాఖ్యానించడం చూస్తుంటే ఆ పార్టీకి గాంధీల చరిత్ర తెలియదని అర్థమవుతోంది. బ్రిటిషర్ల కాలం నుంచీ నెహ్రూ–గాంధీల కుటుంబం బ్రిటిషర్లను ఎదిరించిందేగానీ ఎక్కడికీ పారి పోలేదు. ఇప్పుడూ అంతే. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా యాత్రచేశారు. బీజేపీని తరి మేయడమే ఆయన ధ్యేయం’’ అని అన్నారు.ఫ్యూన్, క్లర్క్ వ్యాఖ్యలపై..‘‘గాంధీల కుటుంబానికి ఫ్యూన్, ప్రియాంక గాంధీకి క్లర్క్ అంటూ నాపై బీజేపీ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు వింటూనే ఉన్నా. బీజేపీ నాయకులకు వారి కుటుంబం నేర్పిన విలువలే అబ్బుతాయి. మా నాన్న నిరక్షరాస్యుడు. అయినా నాకు చక్కటి విద్యాబుద్దులు, నడవడిక, విలువలు నేర్పించారు. కుటుంబం ఏం నేర్పిస్తే అవే ఆ కుటుంబసభ్యులకు వస్తాయి. నాపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నా స్పందన, సమాధానం పొందే స్థాయి, అర్హత వారికి లేవు’’ అని వ్యాఖ్యానించారు.నమ్మకాన్ని నిలబెడతా..‘ నాపై నమ్మకంతో అమేథీ బాధ్యతలను గాంధీలు నాకు అప్పగించారు. అమేథీపై గాంధీల చెరగని ముద్ర ఉంది. ఆ ముద్ర చెరిగిపోకుండా, శాశ్వతంగా ఉండేందుకు ఇకమీదటా కృషిచేస్తా. 41 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం బాధ్యతల్ని చూసుకుంటున్నా. గెలిచి గాంధీల నమ్మకాన్ని నిలబెడతా’’ అని అన్నారు.కొన్ని పొరపాట్లతో ఓడారు‘‘కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో యోగి ప్రభుత్వాలు అమేథీలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశాయి. ప్రభుత్వ అధికారులు, పాలనాయంత్రాంగాన్ని ఈ నియోజకవర్గంలో దుర్వినియోగం చేశాయి. కాంగ్రెస్ సైతం కొన్ని పొరపాట్లు చేసింది. అందుకే గత ఎన్నికల్లో రాహుల్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వాస్తవానికి గత ఎన్నికల్లో ప్రజలు రాహుల్‌ను ఓడించలేదు. ఓడించాలనుకుంటే 3 లక్షల ఓట్ల తేడాతో ఓడించాలి. కానీ రాహుల్‌కు నాలుగు లక్షలకుపైగా ఓట్లు పడ్డాయి. గెలుపునకు కొంత దూరంలో ఆగిపోయారు. ఆయన ఓడిపోయారని అమేథీ ప్రజలపై నేను నిందారోపణలు మోపట్లేను’’ అని అన్నారు.స్మృతి హామీలు తీర్చారా?‘‘ ఐదేళ్ల క్రితం స్మృతి ఇరానీ అమేథీ ఓటర్లకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా? నిరుద్యోగం, ధరలు, వీధి ఆవుల మాటేంటి? సమస్యలు అలాగే ఉన్నాయి కదా? ఎవరు గెలుస్తారని చెప్పట్లేను. ఎవరు గెలవాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. నేను గెలిస్తే ఈ విజయం నిస్సందేహంగా గాంధీలదే’’ అని అన్నారు. – అమేథీ -
Shashi Tharoor: 400.. జోక్, 300.. అసాధ్యం, 200.. ఒక సవాలే
న్యూఢిల్లీ: ఈసారి 400 సీట్లు సాధిస్తామంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేత, తిరువనంతపురం అభ్యర్థి శశిథరూర్ జోక్‌గా అభివరి్ణంచారు. పీటీఐతో ఇంటర్వ్యూ సందర్భంగా పలు అంశాలపై ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. కేరళలో బీజేపీ బోణీపై.. ‘‘ దేశవ్యాప్తంగా 400 చోట్ల గెలుస్తానని బీజేపీ నిజంగా జోక్ చేస్తోంది. 300 సీట్లు అసాధ్యమనుకోండి. కనీసం 200 నియోజకవర్గాలను గెల్చుకోవడం కూడా ఆ పారీ్టకి పెద్ద సవాలే. దిగువసభలో అధికారపార్టీ మెజారిటీ కోల్పోతుందనేది దాదాపు ఖరారైంది. కేరళలో ఈసారి కూడా బీజేపీ బోణీ కొట్టబోదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే సీన్ రిపీట్ అవుద్ది. 2019నాటితో పోలిస్తే ఈసారి దక్షిణాదిన కమలం కమిలిపోవడం ఖాయం’’ కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమిపై.. ‘‘రెండు దశల్లో పోలింగ్ ముగిసిన 190 స్థానాల్లో విపక్షాల ‘ఇండియా’ కూటమికి అద్భుతమైన స్పందన వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటర్లు చూపిన ఎమోషన్స్, ఉత్సాహం ఈ సారి ఎన్నికల్లో కనిపించకపోవచ్చు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు సానుకూల పవనాలను బాగా నమ్ముతున్నారు. ఈసారి ఊహించిన దానికంటే ఎంతో ముందున్నాం’’ విపక్షాల విక్టరీ స్థానాలపై.. ఈసారి విపక్షాల కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుందన్న ప్రశ్నకు ఆయన సరదాగా ‘‘ క్రికెట్‌కు వీరాభిమానిని అయినాసరే ఎంత స్కోర్ కొడతారనేది ఊహించలేను. కానీ గెలుపును ఊహిస్తా. బీజేపీ–ఎన్డీఏ ప్రభుత్వం మెజారిటీని కోల్పోతుంది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగొచ్చు. ఇంకొన్ని రాష్ట్రాల్లో మా కూటమి సత్తా చాటొచ్చు. హరియాణాలో గతంలో కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెలవలేదు. కానీ ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఈసారి మాకు అక్కడ 5–7 సీట్లు రావచ్చు. కర్ణాటకలో ఒక్కటే గెలిచాం. ఈసారి 10–17 గెలుస్తామంటున్నారు. కొందరైతే 20 మావే అంటున్నారు’’ తెలంగాణలో బీజేపీ గెలుపుపై.. ‘ తెలంగాణలో ఈసారి బీజేపీ గెలవడం కష్టమే. బీజేపీ, కాంగ్రెస్ వీళ్లలో ఎవరు జనాన్ని ఆకట్టుకున్నారనేది తేలాల్సి ఉంది. ఇంకా 353 స్థానాల్లో పోలింగ్ మిగిలే ఉంది. ఈ లెక్కన ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముందుంది. నాదో ప్రశ్న. ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో ఒక యువకుడు 2014లో బీజేపీకి ఓటేశాడు. అదే యువకుడు పదేళ్ల తర్వాత కూడా అదే బీజేపీకి ఎందుకు ఓటేయాలి? 2014లో బీజేపీ ఆర్థికవ్యవస్థను చక్కబెట్టేందుకు కృషిచేశామని చెప్పింది. అయినా ఎకానమీలో మార్పు తేలేకపోయింది. 2019లో పుల్వామా దాడులు బాలాకోట్ ఘటనతో దేశ జాతీయభద్రత ప్రశ్నార్థకమైంది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం బీజేపీకి చేతకాదు. ప్రజలకు ఉద్యోగాలు దక్కలేదు. అధిక ధరల వల్ల నచ్చినవి కొనలేకపోయారు. చైనాతో సరిహద్దు విషయంలోనూ బీజేపీ విఫలమైంది. సరిహద్దుల వెంట 65 పెట్రోలింగ్(గస్తీ) పాయింట్లలో 26 పాయింట్లను భారత్ కోల్పోయింది. ఛాతి విరిచి చెప్పుకునేంతగా మోదీ ఏం చేశారు?’’ -
Rakesh Tikait: చీలికకు కేంద్రమే కారణం
న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరే కంగా నెలల తరబడి పోరాడి మోదీ మెడలు వంచిన రైతు ఉద్యమంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రధానభూమిక పోషించించింది. అలాంటి ఎస్కేఎంలో తాజా చీలిక కుట్ర వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఆరోపించారు. బీజేపీ కుట్రలు ఫలించడం వల్లే సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర)పేరిట మరో రైతు సంఘం పురుడుపోసుకుందని ఆయన వెల్లడించారు. ఎస్‌కేఎంకు ఎస్కేఎం(రాజకీయేతర)కు సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో తికాయత్ ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్ఎస్ఎస్ నేతలే రైతులుగా.. ‘‘ ఒక్కటిగా ఉంటే మమ్మల్ని ఎదుర్కోలేమని గ్రహించే 41 రైతుల సంఘాల కూటమి అయిన ఎస్కేఎంలో సర్కార్ చీలిక తెచ్చింది. కొత్త సంఘం ఎస్కేఎం(రాజకీయేతర) ఢిల్లీ ఛలో అని పంజాబ్ నుంచి రైతులను తీసుకొచ్చి హరియాణాలోని శంభూ సరిహద్దు వద్ద ఉద్యమం చేస్తోంది. అసలు ఈ కార్యక్రమంపై మాతో వాళ్లు మాటవరసకైనా చెప్పలేదు. రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్ నేతలే రైతులుగా నటిస్తూ పంజాబ్ నుంచి వచ్చిన రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ జిల్లాకు 40 దొంగ సంఘాలు ‘‘ఒక్క నోయిడాలోనే భారతీయ కిసాన్ యూనియన్ పేరిట 37 రైతు సంఘాలను తెరిపించారు. వీటికి ఎమ్మెల్యేలే నడిపిస్తున్నారు. పంటలు, ఆ పంటల్ని పండించే కులాలవారీగా సంఘాలు తెరిచారు. జిల్లాకు 30–40 దొంగ సంఘాలు తెరచి రైతులందరినీ గందరగోళపరిచి, విభజించడమే మోదీ సర్కార్ లక్ష్యం’’ ఎర్రకోట ఘటన పోలీసు కుట్ర ‘‘ 2021 జనవరి 26 సంబంధ ఘటనల్లో పోలీసుల పాత్ర ఉంది. ఢిల్లీ ఐటీఓ ప్రాంతంలో నిలిపిఉంచిన ట్రాక్టర్లను పోలీసులే ఎర్రకోట వైపు నడిపేలా ఉసిగొల్పారు. నాడు ఉద్యమకారులను పోలీసులే తప్పుదోవ పట్టించారు. సిఫార్సులపై మరోమారు నమ్మం స్వామినాథన్ సిఫార్సులు అమలుచేస్తామని బీజేపీ 2014 మేనిఫెస్టోలో చెప్పింది. పదేళ్లయినా అమలుచేయలేదు. అందుకే 2024 బీజేపీ అజెండాను రైతులు నమ్మట్లేరు. విత్తనాలు, పురుగుమందులు, కూలీ ఖర్చులు, లీజు ఒప్పందం, ఇంథనం, సాగు ఖర్చులకు రైతు కుటుంబం ఉమ్మడి శ్రమ(ఏ2+ఎఫ్ఎల్)కు వెలకట్టి స్వామినాథన్ సిఫార్సుల్నే అమలుచేశామని కేంద్రం అబద్ధం చెబుతోంది. మేం సాగు ఖర్చుకు 50 శాతం విలువ జోడింపు అంటే సీ2+ 50 శాతం ఫార్ములా(స్వామినాథన్ సిఫార్సు) అమలుచేయాలని డిమాండ్‌చేస్తున్నాం’’ -
యుద్ధంలో ఉన్నాం.. కలసి పోరాడాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడు యుద్ధంలో ఉన్నామని.. క్రమశిక్షణ కలిగిన సైనికులుగా అంతా కలసి పోరాడాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. జాతీయ పార్టీ ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తూ.. వచ్చే ఎన్నికల్లో విజయసాధనే లక్ష్యంగా ముందుకు వెళతామని పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీలో పూర్తిస్థాయిలో సమన్వయం సాధిస్తామని.. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటామని చెప్పారు. పార్టీని ఎవరూ వీడబోరని.. పార్టీలోకి చేరికలు, అభ్యర్థుల ఎంపికపై త్వరలో కసరత్తు చేపడతామని వెల్లడించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యాక కిషన్‌రెడ్డి ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ప్రత్యామ్నాయం బీజేపీనే.. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో గట్టిగా పోరాడుతాం. అధికార బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే నమ్మకం ప్రజల్లో కలిగించేలా కచ్చితమైన కార్యాచరణతో ముందుకెళతాం. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఎన్నికల మోడ్‌లోకి వెళతాం ఈ నెల 10న ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం ఉంది. ప్రధాని మోదీని కలుస్తాను. రాష్ట్ర పార్టీలోని నేతలందరితో సమావేశమై ఎన్నికల మోడ్‌లోకి వెళతాం. ఇక్కడి నాయకులతో భేటీలు నిర్వహించి, అన్ని అంశాలపై సమన్వయం చేసుకుని ముందుకెళతాం. ఆషాఢ మాసం కాబట్టి ఇప్పుడే అధ్యక్ష స్ధానంలో కూర్చోను. అయితే అధ్యక్ష బాధ్యతలన్నీ చూసుకుంటాను. ఒక్కరోజులోనే పరిస్థితులు మారిపోవచ్చు! అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటం సమస్య అని నేను అనుకోవడం లేదు. వేగంగా మారుతున్న సమాజ అభిప్రాయాలు, అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన సందర్భంలో ఒక్క రోజులోనే పరిస్థితులు మారిపోతాయి. ఒక్కరోజులోనే అనుకూల వాతావరణం ఏర్పడవచ్చు. కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిదేళ్లకుపైగా నిరంకుశ పాలనను చవిచూసిన ప్రజలు ఈసారి ఆయనను తిరస్కరించడం ఖాయం. జాతీయ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌పై విశ్వాసం, నమ్మకం కుదిరే పరిస్థితులు లేవు, రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదు. బీజేపీలోకి చేరికలను వేగవంతం చేస్తాం ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికల ప్రక్రియను ఇకపై వేగవంతం చేస్తాం. ఎన్నికల్లో పోటీకి అర్హులైన అభ్యర్థులను తేల్చే కసరత్తును వెంటనే మొదలుపెడతాం. ఏ నియోజకవర్గంలో పార్టీలో ఉన్న వారిలో ఎవరెవరు మంచి అభ్యర్థి అవుతారనేది పరిశీలిస్తాం. ఆ దిశగా ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తాం. కేసీఆర్ తీరును ఎండగడుతూనే ఉన్నాం.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవలి సభలో బీఆర్ఎస్ను రాక్షస సమితి అని, కేసీఆర్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ గెలిస్తే ఆయన కుమార్తెకే మేలు జరుగుతుందని ప్రధాని మోదీ విమర్శించారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్నారు. అమిత్‌షా రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా కేసీఆర్ సర్కార్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనను ఎండగడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును, కేసీఆర్ వ్యవహారశైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అనడానికి ఇంతకంటే ఏం కావాలి? ప్రజల్లోనే ఉంటూ పోరాడుతాం కేసీఆర్ సర్కారు పూర్తిగా అవినీతిమయమైంది. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాజీలేని పోరాటం చేస్తాం. పార్టీ కార్యకర్తలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది. నేతలంతా ప్రజలు, కార్యకర్తల మధ్యే ఉంటూ విశ్వాసం కలిగించేలా చూస్తాం. పార్టీని విజయపథంలోకి నడిపించడంలో కార్యకర్తలు కీలకపాత్ర పోషించబోతున్నారు..’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. పార్టీని ఎవరూ వీడరు.. సమన్వయం సాధిస్తాం.. ఏ నాయకుడు కూడా బీజేపీని విడిచి వెళతారని భావించడం లేదు. అందరినీ కలుపుకొని పోతాం. పార్టీలో అసంతృప్తి అనే మాటే లేకుండా, సర్దుకునిపోయేలా సమన్వయం చేయడంపై ప్రధానంగా దృష్టి పెడతాం. కొత్త, పాత నేతలు, జూనియర్, సీనియర్ అనే తారతమ్యాలు లేకుండా నాయకుల మధ్య ఐక్యతను సాధిస్తాం. టీమ్ వర్క్‌తో అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కచ్చితమైన కార్యాచరణ ప్రణాళిక, ఎన్నికల వ్యూహాలను సమష్టిగా రూపొందించుకుంటాం.


