ఖరీఫ్‌కు ముందే ‘యూరియా’ సెగ
తొలి రెండు నెలల్లోనే భారీ కోతలు.. రైతుల్లో ఆందోళన
రామగుండం యూరియాలో 90% రాష్ట్రానికే ఇవ్వాలని తుమ్మల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: వానాకాలం (ఖరీఫ్–2026) సీజన్ ప్రారంభానికి ముందే రాష్ట్ర రైతాంగాన్ని యూరియా భయం వెంటాడుతోంది. ఒకవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ ఎరువుల మార్కెట్‌పై అనిశ్చితి నెలకొనగా, మరోవైపు ఎరువుల వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని వ్యాఖ్యలు, కేంద్రం కేటాయింపుల్లో కోతలు రాష్ట్రంలో ఆందోళన పెంచుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని నివేదిస్తే, కేంద్రం కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం చేసింది.
అంతేకాదు.. కేటాయించిన షెడ్యూల్ ప్రకారం కూడా సరఫరా చేయకపోవడంతో జూన్, జూలై నెలల్లో తీవ్ర కొరత తప్పదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిపై ఆందోళన చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా సరఫరాలో కేంద్రం వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రైతులకు ఇబ్బందులు తలెత్తితే సహించబోమని హెచ్చరించారు.
ప్రారంభంలోనే కోత..
రాష్ట్రంలో సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని ఖరీఫ్ మొత్తం అవసరానికి 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని వ్యవసాయ శాఖ కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం 10 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం చేసింది. దీంతో ప్రారంభ దశలోనే 1.50 లక్షల మెట్రిక్ టన్నుల కోత పడింది. ఈ 10 లక్షల టన్నులను కూడా విడతల వారీగా ప్రతి నెలా సరఫరా చేసేలా కేంద్రం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నెలకు 2 లక్షల టన్నులు, జూలై, ఆగస్టులో నెలకు 1.50 లక్షల టన్నులు, సెప్టెంబర్‌లో లక్ష టన్ను ఇవ్వాల్సి ఉంది. కానీ తొలి నెల నుంచే కోతలు మొదలయ్యాయి.
తొలి రెండు నెలల్లోనే భారీ కోత
ఏప్రిల్‌లో 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 1.53 లక్షల టన్నుల యూరియా మాత్రమే అందింది. మే నెలలో ఇప్పటివరకు 2 లక్షల టన్నుల కోటాకు గాను కేవలం 48,985 టన్నులే రాష్ట్రానికి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ మాత్రమే ఉంది. నైరుతి రుతుపవనాల రాకతో జూన్ మొదటి వారం నుంచే సాగు వేగం పుంజుకునే పరిస్థితిలో, అప్పటికి కనీసం 3.50 లక్షల టన్నుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుత సరఫరా వేగం చూస్తుంటే ఆ లక్ష్యం చేరుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దేశానికి దిక్సూచిగా తెలంగాణ ‘ఫెర్టిలైజర్ యాప్’
యూరియా కొరత సమయంలో బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గత సీజన్‌లో అమలు చేసిన ‘ఫెర్టిలైజర్ యాప్’ఆశించిన ఫలితాన్నే ఇచ్చింది. ఈ యాప్ విజయాన్ని గుర్తించిన కేంద్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త యూరియా యాప్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మే 21 నుంచి అన్ని రాష్ట్రాల్లో రెండు జిల్లాల చొప్పున పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించనుండగా, తెలంగాణలో వికారాబాద్, మేడ్చల్ జిల్లాలను ఎంపిక చేసింది.
రామగుండం యూరియా ఎటు?
రాష్ట్ర పరిధిలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)లో తయారయ్యే యూరియా కూడా తెలంగాణ రైతులకు పూర్తిస్థాయిలో అందకపోవడంపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కర్మాగార వార్షిక ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 12.7 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. ఈ లెక్కన ప్రతి ఏటా సుమారు 6.35 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రైతులకు అందుతోంది. తెలంగాణ గ్యాస్, వనరులను వినియోగించి ఉత్పత్తి చేస్తున్న యూరియాలో కనీసం 90 శాతం రాష్ట్ర అవసరాలకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నా, ఏమాత్రం స్పందన లేదు. ఈ మేరకు ఆర్‌ఎఫ్‌సీఎల్ ఎండీకి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు.


