నిమ్స్‌లాగే టిమ్స్‌! | TIMS hospital management charges are nominal | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లాగే టిమ్స్‌!

May 20 2026 4:16 AM | Updated on May 20 2026 4:16 AM

TIMS hospital management charges are nominal

ఆస్పత్రి నిర్వహణకు నామమాత్రపు చార్జీలు తప్పవంటున్న వైద్యులు 

కొన్ని సేవలు ఉచితం.. మరికొన్నిటికి వసూలు

ఏ సేవకు ఎంత అన్నది ఇంకా ప్రభుత్వం నిర్ణయించలేదంటున్న అధికారులు

సాక్షి, హైదరాబాద్‌:  నిమ్స్‌ తరహాలో తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్‌) ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలకు డబ్బులు వసూలు చేయబోతున్నారు. సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభోత్సవం సమీపిస్తున్న క్రమంలో పరిపాలనాపరమైన అంశాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. టిమ్స్‌ ఆస్పత్రులు స్వయంప్రతిపత్తి గలిగినవి అని, వాటికి నిర్వహణ ఖర్చులు ఉంటాయని, దాన్ని రాబట్టుకోవడం ఎలా అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. నగరంలో సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బీనగర్‌ టిమ్స్‌ ఆస్పత్రుల్లో 70 శాతం పడకలు ఉచిత వైద్య సేవలకు, 30 శాతం బెడ్స్‌ చెల్లింపుల కేటగిరీలో కేటాయించనున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. 

3 నుంచి 5 అంతస్తుల్లో పెయిడ్‌ సర్వీసెస్‌
సనత్‌నగర్‌ టిమ్స్‌ను ఐదు అంతస్తుల్లో నిర్మించారు. వెయ్యి పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 700 పడకలు ఉచిత సేవలకు కేటాయించగా, మరో 300 బెడ్స్‌కు పేషెంట్‌లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆస్పత్రికి వచ్చే సాధారణ ఓపీ, ప్రాథమిక వైద్య సేవలు, స్క్రీనింగ్‌ టెస్టులు, కొన్ని రకాల స్కానింగ్‌లు ఉచితంగానే లభించనున్నాయి. రెండో అంతస్తు వరకు ఉచిత సేవలు పొందే వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. 

మూడు, నాలుగు, ఐదు అంతస్తుల్లో 300 పడకల ఉంటాయి. అత్యాధునిక శస్త్ర చికిత్సలు, స్పెషల్‌ గదులు, షేరింగ్‌ రూం, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉండాలనుకునే రోగులు బెడ్స్‌కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. పెయిడ్‌ పేషెంట్లకు అందించే సేవలు కార్పొరేట్‌తో సమానంగా ఉండబోతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

అంతర్జాతీయ పేషెంట్లకు 300 పడకలు
సనత్‌నగర్‌ టిమ్స్‌లో గుండె, ఎల్‌బీనగర్‌లో గ్యాస్ట్రో, అల్వాల్‌లో న్యూరో, ట్రామా విభాగాల సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లుగా పనిచేయనున్నాయి. దీంతో ఆయా ఆస్పత్రుల్లో స్థానిక రోగులతోపాటు అంతర్జాతీయ రోగులకు చికిత్సలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు ఆస్పత్రుల్లో 3 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో ఆస్పత్రిలో పేమెంట్‌ కోటాలో ఉన్న 30 శాతం పడకల్లో 5 నుంచి 10 శాతం బెడ్స్‌ అంతర్జాతీయ రోగులకు కేటాయించనున్నారు. మిగతా బెడ్స్‌ స్థానిక రోగులకు కేటాయిస్తారు.

నామమాత్రపు రుసుము ఉంటుంది 
టిమ్స్‌ ఆస్పత్రులు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తాయి. ప్రాథమిక వైద్య సేవలు ఉచితంగానే అందిస్తాం. అన్ని ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. ఆస్పత్రి నిర్వహణ ఖర్చులు ఉంటాయి. దానికోసం కొన్ని రకాల అత్యాధునిక శస్త్ర చికిత్సలు, ప్రైమ్‌ సర్వీసెస్‌ కోసం కొంత నామమాత్రపు రుసుము వసూలు చేస్తాం. నిమ్స్‌ తరహాలోనే ఉంటాయి. ఏ సేవకు ఎంత చెల్లించాలనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయించలేదు. – మహబూబ్‌ఖాన్, సనత్‌నగర్‌ టిమ్స్‌ నోడల్‌ అధికారి 

Advertisement
 
Advertisement
Advertisement