పంట పీకి పందిరి! | Monkey Groups Destruction in Farm Fields in Telangana | Sakshi
Sakshi News home page

పంట పీకి పందిరి!

May 20 2026 1:48 AM | Updated on May 20 2026 1:48 AM

Monkey Groups Destruction in Farm Fields in Telangana

సిరిసిల్ల జిల్లా కనగర్తిలో ధాన్యాన్ని చిందరవందర చేస్తున్న కోతుల గుంపు

పొలాల్లో వానర గుంపుల విధ్వంసం 

గ్రామాల్లో విపరీతంగా పెరిగిపోతున్న కోతుల సంఖ్య

కూరగాయలు, సంప్రదాయ పంటలను ఆగం చేస్తున్న వైనం 

నష్టాల పాలవుతుండటంతో సాగు నుంచి వైదొలగుతున్న రైతాంగం 

రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోతున్న సాగు 

పదేళ్లలో సగానికి పైగా పడిపోయిన సాగు విస్తీర్ణం 

రాష్ట్ర అవసరాల్లో 16 శాతమే సమకూరుతున్న పరిస్థితి 

ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి

శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో గడిచిన పుష్కరకాలంగా పంటల సాగులో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. కూరగాయలు సహా సంప్రదాయ పంటలు తగ్గిపోతుంటే వాటి స్థానాన్ని వరి, పత్తి ఆక్రమించాయి. గతంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీరకాయ, బెండకాయ, వంకాయ, గోరుచిక్కుడు తదితర కాయగూరలను రైతులు విరివిగా సాగు చేసేవారు. వీటితో పాటు సంప్రదాయ పంటలైన సజ్జ, జొన్న, ఉలువలతో పాటు నూనెగింజల సాగు కూడా ఎక్కువగానే ఉండేది. అయితే రానురానూ ఆయా పంటల విస్తీర్ణం గణనీయంగా పడిపోతూ, వరి, పత్తి సాగు బాగా పెరుగుతోంది. ఒకింత విస్మయం కలిగించినా..ఇందుకు ప్రధాన కారణం.. కోతులు కావడం గమనార్హం. వానరాల బెడదతో రైతులు ఆయా పంటలు సాగు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఆహార కొరత కారణంగా అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్లలో తిష్ట వేస్తున్నాయి. పొలాలపై దాడులు చేస్తూ ఆహార పంటలను నాశనం చేస్తున్నాయి. అక్కడక్కడా రైతులపై దాడులు చేస్తున్న ఘటనలూ నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో కూరగాయలు, సజ్జ, జొన్న, మొక్కజొన్న వంటివి సాగు చేయాలంటేనే భయపడుతున్నారు. వేసిన పంటలు చేతికి రాక నష్టపోతున్న రైతులు కూరగాయల సాగు నుంచి క్రమంగా తప్పుకుంటున్నారు. ఇప్పుడు వరి ధాన్యాన్ని కూడా వానర గుంపులు ఆగమాగం చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వానరాల సమస్య ఎక్కువగా ఉంది. 

పంటంతా ఆగమాగం 
కోతుల గుంపులు కాయగూరలు, పండ్ల తోటలపై దాడులు చేస్తూ తిన్నంత తిని, మిగిలిన పంటను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు ఎక్కువగా వరి, పత్తి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా 2014–15లో రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం 2.53 లక్షల ఎకరాలు ఉండగా, 2023–24 నాటికి అది సగానికి పైగా తగ్గి 1.12 లక్షల ఎకరాలకు పడిపోయింది. గత దశాబ్దంలో కూరగాయల సాగు వృద్ధిరేటు మైనస్‌ 8.4 శాతంగా నమోదు కావడం గమనార్హం. ఎన్‌ఐఎన్‌¯Œ, ఐసీఎంఆర్‌ సిఫారసుల మేరకు రాష్ట్రానికి సంవత్సరానికి 81.49 లక్షల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు అవసరమవుతాయని అంచనా వేయగా, ప్రస్తుతం ఉత్పత్తి కేవలం 11.17 లక్షల మెట్రిక్‌ టన్నులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే రాష్ట్ర అవసరాల్లో సుమారు 16 శాతం మాత్రమే సొంతంగా సమకూరుతున్నాయన్న మాట. ముఖ్యంగా టమాటా, ఉల్లిపాయ, బెండ, పచ్చిమిర్చి, వంకాయ సాగు గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అన్ని రకాల కూరగాయలతో పాటు ఆలుగడ్డ, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, కొత్తిమీర వంటి పంటలను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 


ఒక జత.. పదేళ్లలో వంద! 
అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, సరిపడా ఆహారం దొరకకపోవడం వల్ల కోతుల గుంపులు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి, ఆపై ఊళ్లలో తిష్ట వేస్తున్నాయి. 25 ఏళ్ల వరకు జీవించే కోతులకు కాయగూరలు, పండ్లు, ఊళ్లలో ఆహార వ్యర్థాల రూపంలో మెరుగైన ఆహారం దొరుకుతుండటంతో పునరుత్పత్తి పెరగడంతో పాటు మరణాల రేటు తగ్గిపోయింది. సహజంగా ఒక వానరం మూడేళ్ల వయసు నుండి పునరుత్పత్తి ప్రారంభిస్తే.. ఒక జంట పిల్లలు, తిరిగి వాటి పిల్లలు, వాటి పిల్లలు ఇలా కలుపుతూ పోతే పదేళ్లలో 70 నుండి 100 కోతుల వరకు పెరిగే అవకాశం ఉందని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో అత్యధికంగా బానెట్‌ మకాక్‌ (జటి) రకం కోతులు పంటపొలాలు, ఊళ్లపై దాడి చేస్తున్నాయి. ఈ రకం కోతులు కొత్త పరిసరాలకు సులభంగా అలవాటు పడుతున్నాయి. 

నిర్మల్‌ ప్రయోగం ఫెయిల్‌..! 
పంటలతో పాటు జనావాసాలకు నష్టం చేస్తున్న కోతుల నియంత్రణ కోసం హిమాచల్‌ప్రదేశ్‌లో చేసిన ప్రయోగాన్ని తెలంగాణలో అమలు చేసినా సరైన ఫలితం కనిపించలేదని నిపుణులు చెబుతున్నారు. హిమాచల్‌ తరహాలో నిర్మల్‌–గండిరామన్న హరితవనంలో 2020లో ‘మంకీ రిహాబిలిటేషన్‌ సెంటర్‌’ను ప్రారంభించి, రోజూ 10–15 కోతులకు వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ కోతులను పట్టుకోవడం, నిర్మల్‌కు తరలించడం పంచాయతీలకు ఆర్థిక భారంగా మారడంతో కుటుంబ నియంత్రణ కార్యక్రమం పెద్దగా సక్సెస్‌ కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

సాగు పెరగాలంటే ఏం చేయాలి.. 
కోతుల నివారణకు ప్రతి జిల్లా కేంద్రంలో నిర్మల్‌ తరహా కుటుంబ నియంత్రణ కేంద్రం ప్రారంభించాలి. కోతులను పట్టేందుకు పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. కూరగాయలు, పండ్ల తోటలు, ఇతర ఉద్యాన పంటలకు పూర్తి సబ్సిడీతో సోలార్‌ ఫెన్సింగ్‌ పంపిణీ చేయాలి. 
⇒ క్లస్టర్‌ వారీగా ఏ ప్రాంతానికి ఏ కూరగాయలు అనుకూలమో గుర్తించి, వాటినే సాగు చేసేలా రైతులకు మార్గనిర్దేశం చేయాలి. పెట్టుబడి వ్యయం, కూలీల కొరత నివారణకు అవసరమైన యంత్ర సామగ్రిని అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు సబ్సిడీపై అందించాలి.  
⇒ పంజాబ్‌ తరహాలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేసే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. హిమాచల్‌ తరహాలో 75 శాతం సబ్సిడీపై సోలార్‌ ఫెన్సింగ్, కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో మార్కెట్‌ యార్డుల్లో కూరగాయలకు ప్రత్యేక స్థల కేటాయింపులు చేయాలి. 

సమగ్ర కార్యాచరణ అవసరం 
రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గిపోవడం ఆందోళనకరం. రాష్ట్రాన్ని కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సమగ్ర కార్యాచరణ అవసరం. ముఖ్యంగా కోతుల నియంత్రణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు మేము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. 
– డాక్టర్‌ రాజిరెడ్డి, వీసీ, హార్టికల్చర్‌ యూనివర్సిటీ 

కూరగాయల కనగర్తి.. ఇప్పుడొక చరిత్రే.. 
రాజన్న సిరిసిల్ల జిల్లా కనగర్తి ఒకప్పుడు కూరగాయలకు ఎంతో ప్రసిద్ధి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ‘కూరగాయల కనగర్తి’గా పేరొందింది. ఇరవైకి పైగా తీగజాతి కూరగాయలు, ఊరందరికీ పనులు, రైతులకు జేబునిండా డబ్బులు, కడుపునిండా పౌష్టికాహారం.. ఇలా కళకళలాడిన గ్రామంలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు 50 మంది రైతులు కూరగాయలు సాగు చేస్తే ఇప్పుడు కేవలం 10 మందే సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా అంతటికీ అన్ని రకాల కూరగాయలు అమ్మిన స్థితి నుండి ఇప్పుడు ఇదే ఊరిలో సిరిసిల్ల నుంచి వచ్చే కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. దీనంతటికీ కారణం.. కనగర్తి పంట పొలాలతో పాటు ఊరంతా వానరాలతో నిండిపోవడమే. 

కనగర్తి అంతా కోతుల గుంపులే 
కోతులతో ఊరంతా నిండిపోయింది. పంటలు, ఇళ్లు నాశనం అవుతున్నాయి. మా ఒక్క కనగర్తే కాదు.. అన్ని ఊళ్లలో ఇదే పరిస్థితి. అందుకే కోతుల నియంత్రణకు తక్షణ కార్యాచరణ ప్రారంభించాలి. మళ్లీ కూరగాయల సాగు పెరగాలంటే సోలార్‌ ఫెన్సింగ్‌తో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలి. 
– స్వామిదాస్, కనగర్తి సర్పంచ్‌  

Advertisement
 
Advertisement
Advertisement