హైదరాబాద్ : నేటి తరం పిల్లలు మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లకు అతిగా అలవాటు పడుతున్నారని తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. సన్ సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన “గ్యాలివెంట్ సన్ సిటీ గేమింగ్ జోన్” ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలలో బిజీగా ఉండటం వల్ల పిల్లలతో సమయం గడపలేకపోతున్నారని తెలిపారు. దీంతో పిల్లలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లకు బానిసలవుతూ పలు మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

పిల్లలలో మానసిక వికాసం, శారీరక దృఢత్వం పెంపొందించేందుకు ఎడ్యుకేషన్ మరియు ఎంటర్టైన్మెంట్ కలగలిపిన గేమింగ్ జోన్లు ఎంతో అవసరమని అన్నారు. ఇలాంటి ఆధునిక గేమింగ్ కేంద్రాలు నగరంలో మరిన్ని ఏర్పడాలని ఆకాంక్షించారు. శారీరక క్రీడలు పిల్లలను ఉల్లాసంగా ఉంచడమే కాకుండా చదువుల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయని తెలిపారు.
గ్యాలివెంట్ సన్ సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, తమ కేంద్రంలో ఆర్కేడ్ గేమ్స్, బౌలింగ్, సిమ్యులేటర్ క్రికెట్, వర్చువల్ గేమ్స్‌తో పాటు 40కి పైగా వినోదాత్మక గేమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.


