టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత చాలా బాధాకరమైన దశను ఎదుర్కొన్నట్లు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న తనకు అప్పటి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోర్ కొండంత అండగా నిలిచారని గుర్తుచేసుకున్నాడు. మంగళవారం ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ మూడో ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో పాల్గొన్న కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘నేను కెప్టెన్సీ వదిలేసిన తర్వాతే, రాహుల్ భాయ్, విక్రమ్ రాథోర్లతో మనసు విప్పి మాట్లాడగలిగాను. చాలా విషయాలు పంచుకున్నాను. 2023లో టెస్ట్ క్రికెట్లో నేను అద్భుతంగా రాణించాను. నేను కెప్టెన్సీ వదిలేసి ఒంటరిగా బాధపడుతున్న సమయంలో వీరిద్దరు నాకు అండగా నిలిచారు.
నా కెరీర్ తిరిగి గాడిన పెట్టుకునేందుకు రాహుల్ భాయ్‌తో పాటు విక్రమ్ రాథోర్ ఎంతోగానో సహాయపడ్డారు. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. వారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. కష్టకాలంలో అండగా నిలిచారు’ అని కోహ్లీ తెలిపాడు.
రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న కోహ్లీ ఒత్తిడిని భరించలేక 2022లో ఆ బాధ్యతల నుంచి తప్పుకు న్నాడు. కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోహ్లీ ఆరు టెస్టుల్లో కేవలం ఒకే ఒక అర్ధశతకంతో, 26.5 సగటుతో 265 పరుగులు మాత్రమే చేశాడు.
అయితే 2021 నవంబర్‌లో టీమిండియా హెడ్ కోచ్‌గా వచ్చిన ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్‌తో కలిసి కోహ్లీని మళ్లీ బ్యాటింగ్‌లో ట్రక్ ఎక్కించడంలో విజయవంతమయ్యాడు. ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత 2023 ఏడాదిలో అద్భుతంగా రాణించిన కోహ్లీ 8 టెస్టుల్లో 671 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాప్ సెంచరీలున్నాయి.
ఇక ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ తరఫున కోహ్లీ తన బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. ఆడిన 13 మ్యాచ్‌ల్లో 542 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందు వరుసలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ప్లేఆఫ్ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది.
గతేడాది తొలిసారి చాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది కూడా టైటిల్‌పై కన్నేసింది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో వన్డేలకు మాత్రమే పరిమితమైన కోహ్లీ ఐపీఎల్ ముగిసిన తర్వాత అప్గానిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు.


