పాకిస్తాన్‌ను చిత్తు చేసే దిశగా బంగ్లాదేశ్‌ అడుగులు | Bangladesh vs Pakistan Test Match | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ను చిత్తు చేసే దిశగా బంగ్లాదేశ్‌ అడుగులు

May 20 2026 7:36 AM | Updated on May 20 2026 7:36 AM

Bangladesh vs Pakistan Test Match

 సిల్హెట్‌: బ్యాటర్ల జోరుకు బౌలర్ల సహకారం తోడవడంతో... పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసేందుకు బంగ్లాదేశ్‌ సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో పరాజయం పాలైన పాకిస్తాన్‌... రెండో మ్యాచ్‌లో కాస్త పోరాడినా ప్రస్తుతం పరాజయం అంచునే ఉంది. 437 పరుగుల లక్ష్యఛేదనలో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌... మంగళవారం ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. సిరీస్‌ సమం చేయాలంటే... బుధవారం చివరి రోజు చేతిలో మూడు వికెట్లు ఉన్న పాకిస్తాన్‌ ఇంకా 121 పరుగులు చేయాల్సి ఉంది. 

సల్మాన్‌ ఆఘా (102 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్‌), వికెట్‌ కీపర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (134 బంతుల్లో 75 బ్యాటింగ్‌; 8 ఫోర్లు), కెపె్టన్‌ షాన్‌ మసూద్‌ (116 బంతుల్లో 71; 8 ఫోర్లు) అర్ధశతకాలతో మెరిశారు. ఓపెనర్లు అజాన్‌ అవైస్‌ (21), అబ్దుల్లా ఫజల్‌ (6) ఎక్కువసేపు నిలవలేకపోడంతో ఛేదనలో పాకిస్తాన్‌కు శుభారంభం దక్కలేదు. 41/2తో కష్టాల్లో పడ్డ జట్టును బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి షాన్‌ మసూద్‌ కాపాడే ప్రయత్నం చేశాడు. మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించిన అనంతరం బాబర్‌ అవుట్‌ కాగా... ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడ్డాయి. సౌద్‌ షకీల్‌ (6) విఫలమయ్యాడు. దీంతో ఒకదశలో 133/2తో పటిష్టంగా ఉన్న పాకిస్తాన్‌ కాసేపటికి 162/5తో కష్టాల్లో పడింది. ఇక పాక్‌ పని అయిపోయినట్లే అనుకుంటున్న దశలో సల్మాన్, రిజ్వాన్‌ చక్కటి పోరాటం కనబర్చారు.

 బంగ్లా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఈ జంట ఆరో వికెట్‌కు 134 పరుగులు జోడించింది. దీంతో కోలుకున్న పాకిస్తాన్‌ 296/5తో మ్యాచ్‌ను ముగించే స్థితికి చేరింది. అయితే పట్టు వదలకుండా ప్రయత్నించిన బంగ్లా బౌలర్‌ తైజుల్‌ ఇస్లాం చివర్లో సల్మాన్‌తో పాటు హసన్‌ అలీ (0)ని తన వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... రిజ్వాన్‌తో పాటు సాజిద్‌ ఖాన్‌ (8 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో ఎడమ చేతివాటం స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లాం 4, నహీద్‌ రాణా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులు చేయగా... పాకిస్తాన్‌ 232 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌... పాక్‌ ముందు రికార్డు లక్ష్యాన్ని నిలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement