‘ప్యాకేజీ అందింది’.. రీపోలింగ్‌ నుంచి తప్పుకున్న ‘పుష్ప’ | Jahangir Khan withdraw from Falta bypoll | Sakshi
Sakshi News home page

‘ప్యాకేజీ అందింది’.. రీపోలింగ్‌ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న ‘పుష్ప’

May 19 2026 8:07 PM | Updated on May 19 2026 8:31 PM

Jahangir Khan withdraw from Falta bypoll

కోల్‌కతా: సీఎం సువేందు అధికారి, సింగం ఐపీఎస్‌ అజయల్‌ పాల్‌ శర్మకు ‘పుప్ప’ భయపడ్డారా? అంటే అవుననే అంటున్నాయి పశ్చిమ బెంగాల్‌ రీపోలింగ్‌ ఎన్నికల్లో తాజా పరిణామాలు. ఈ నెల 21న జరగనున్న రీపోలింగ్‌ ఎన్నిక నుంచి తప్పుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి పుష్ప అలియాస్‌ జహంగీర్‌ ఖాన్‌ అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా జహంగీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ఫల్టాలో శాంతి, భద్రతలే నాకు ముఖ్యం. ఆ రెండు ఉంటేనే అభివృద్ధి జరుగుతోంది. సీఎం సువేందు అధికారి ఫల్టా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. నేను అనుకున్నది జరిగింది. అందుకే త్వరలో జరగనున్న ఫల్టా నియోజకవర్గ రీపోలింగ్‌ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. నా నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.

రీపోలింగ్‌ ఎన్నికల్లో పోటీ నుంచి నిష్క్రమించడం వెనుక పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హస్తం ఉందా? లేదంటే మీరే సీఎం సువేందుకు బయపడి వెనక్కి తగ్గుతున్నారా? అన్న మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ..మీరు అడుగుతున్న ప్రశ్నలకు నేను చెప్పే సమాధానం ఒకటే. ఫల్టా ప్రజల కోసం, ఫల్టాలో అభివృద్ధి కోసం, ఫల్టాలో శాంతిని కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు. జహంగీర్‌ఖాన్‌ నిర్ణయంపై టీఎంసీ అధికార ప్రతినిధి మీడియాతో అరూప్ చక్రవర్తి స్పందించారు. జహంగీర్‌ఖాన్‌ తన నిర్ణయంపై సమాచారం ఇచ్చారు. అయితే ఆ నిర్ణయానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని అన్నారు.

రీపోలింగ్‌ ఎన్నిక నుంచి తప్పుకున్నానంటూ జహంగీర్‌ఖాన్‌ ప్రకటనపై సీఎం సువేందుకు అధికారి విమర్శలు గుప్పించారు. ఫల్టా నియోజకవర్గంలో జరగనున్న రీపోలింగ్‌లో పోలింగ్ ఏజెంట్ దొరకడని అతను పారిపోయాడు’ అని ఎద్దేవా చేశారు. ఆయనో ప్రముఖ క్రిమినల్‌. ఆయన సంగతిని నాకు వదిలేయండి నేను చూసుకుంటానని అన్నారు.

ఇటీవల జరిగిన రెండో విడత పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఎన్నికల సంఘం 95మంది అధికారుల్ని నియమించింది. వారిలో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌ అజయ్‌పాల్ ఉన్నారు. ప్ర‌యాగ‌రాజ్‌లో అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (లా అండ్‌ ఆర్డర్‌)గా విధులు నిర్వహిస్తున్న అజయ్‌ శర్మ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు. 500కి పైగా ఎన్‌కౌంటర్లు చేసిన చరిత్ర ఉంది. ఈసీ ఆయనను సౌత్‌ 24 పరగణ జిల్లా పోలీస్ ఆబ్జర్వర్‌గా నియమించింది. 

తనిఖీలు నిర్వహించే సమయంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఇంటి వద్ద అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఆపై జహంగీర్‌ఖాన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. ఈ వరుస పరిణామాలపై జహంగీర్‌ ఖాన్‌ మీడియాతో మాట్లాడారు. పుష్ప సినిమాకు జహంగీర్‌ ఖాన్‌ బీభత్సమైన ఫ్యాన్‌. అయినప్పటికీ ఆయన సింగం అయితే, నేను పుష్పని ఫైర్‌ అనుకుంటున్నారా? వైల్డ్‌ ఫైర్‌ అంటూ మాస్‌ డైలాగులు వదిలారు. ఇప్పుడు ఫల్టా రీపోలింగ్‌ ఎన్నికల నుంచి తప్పుకోవడంపై సీఎం సువేందుకు, ఐపీఎస్‌ అజయ్‌ శర్మకు పుష్ప బయపడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎంపీ నియోజకవర్గమైన డైమండ్ హార్బర్ పరిధిలోకి ఫల్టా నియోజకవర్గం కావడం, చరిత్రలో తొలిసారిగా ఈసీ నియోజకవర్గం మొత్తం రీపోలింగ్‌ నిర్వహించడం చర్చాంశనీయంగా మారింది. రీపోలింగ్‌ ఉన్నా సరే మే 4నుంచి ఇప్పటి వరకు దీదీ,అభిషేక్‌తో పాటు ఇతర సీనియర్‌ నేతలెవరూ ప్రచారం జోలికి వెళ్లలేదు. 

ఫల్టా నియోజకవర్గంపై ఎన్నికల సంఘం అసాధారణ నిర్ణయం తీసుకుంది. రెండో విడుత ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు ఈసీకి ఫిర్యాదులు అందాయి. వరుస ఫిర్యాదులతో ఫల్టాలోని మొత్తం 285 కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అక్కడ 24వ తేదీన కౌంటింగ్‌ జరగనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement