తమిళనాడు సీఎం విజయ్ చేసిన పని ఇప్పుడు ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. టీవీకే పార్టీని స్థాపించి, సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్.. ప్రతీరోజూ ఏదొక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టాక మాజీ సీఎం స్టాలిన్‌ను కలవడం దగ్గర్నుంచీ ఆయన చేసిన ప్రతీ పని హైలైట్ అవుతూనే ఉంది. అయితే తాజాగా విజయ్ చేసిన పని మాత్రం విమర్శకుల నోళ్లకు పని చెప్పింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఎల్టీటీఈ వ్యవస్థాపకుడైన ప్రభాకరన్‌కు సీఎం విజయ్ నివాళులు అర్పించడమే. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి నిషేధించబడ్డ సంస్థ వ్యవస్థాపకుడికి ఎలా నివాళులర్పిస్తారని విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్‌ది కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆ గ్రూప్‌కు చెందిన సభ్యురాలే ఆత్మాహుతి బాంబు దాడితో రాజీవ్‌గాంధీ హత్యలో ప్రధాన పాత్ర పోషించింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ను హత్య చేశారు. ఆ నేపథ్యంలోనే ఎల్టీటీఈని బ్యాన్ చేసింది
విజయ్ నివాళులు.. కాంగ్రెస్ ఏం చెబుతుంది?
రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకరన్‌కు సీఎం స్థానంలో ఉన్న విజయ్ ఎలా నివాళులు అర్పిస్తారనేది బీజేపీ ప్రశ్న. దీనిపై కాంగ్రెస్, రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నిలదీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సీఎం కావడానికి కాంగ్రెస్‌తో పాటు పలు స్థానిక పార్టీలు సహకరించిన నేపథ్యంలో ఆ పార్టీలకు విజయ్ ఏం చెబుతారని బీజేపీ అడుగుతోంది.
ఇది కేవలం ప్రభాకరన్‌కు మాత్రమే నివాళి కాదు
ఈ అంశాన్ని టీవీకే సమర్థించుకునే పనిలో పడింది. తమ అధ్యక్షుడు, సీఎం విజయ్ అర్పించిన నివాళి కేవలం ప్రభాకరన్‌కు మాత్రమే కాదని, శ్రీలకంలో ఊచకోతకు గురైన వేలాది మంది తమిళులకు నివాళి అంటూ చెప్పుకొచ్చింది.

విజయ్‌కు సరికొత్త తలపోటు
సీఎం స్థానంలో ఉన్న విజయ్ తెలుసో, తెలియకో చేసిన ప్రభాకరన్ నివాళుల అంశం.. ఇప్పుడు టీవీకే పార్టీకి కొత్త చిక్కులు తెస్తుందా అనే చర్చ మొదలైంది. ఏదో బొటాబొటీ మ్యాజిక్ ఫిగర్‌తో అందులోనూ కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్‌ను ఇది కచ్చితంగా ఇరకాటంలో పడేస్తుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇప్పటికే మాజీ సీఎం స్టాలిన్.. విజయ్ ప్రభుత్వం విమర్శలు తీవ్రతరం చేశారు. విజయ్ ప్రభుత్వం ఎంతో కాలం సాగదనీ, తమిళనాడులో జరగబోయే రాజకీయ పరిణామాలకు డీఎంకే శ్రేణులంతా సిద్థంగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయ్ ప్రభుత్వం కూలుపోతుందని, ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చనే సంకేతాలిచ్చారు స్టాలిన్. ఈ తరుణంలోనే ఇది చోటు చేసుకోవడంతో టీవీకే శ్రేణుల్లో కలవరపాటుకు గురిచేస్తోంది.
முள்ளிவாய்க்கால் நினைவுகளை இதயத்தில் ஏந்துவோம்! கடல் கடந்து வாழும் நம் தமிழ்ச் சொந்தங்களின் உரிமைகளுக்காக எப்போதும் துணை நிற்போம்!
— TVK Vijay (@TVKVijayHQ) May 18, 2026


