సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘బండి సంజయ్ డౌన్ డౌన్’.. ‘కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ ఇరువర్గాల పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు సమాచారం. రెండు పార్టీ నేతల నిరసనలతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.
వివరాల మేరకు.. సిరిసిల్లలోని నేతన్న చౌరస్తా వద్ద బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల పోటాపోటీ ధర్నాకు దిగాయి. ఈ క్రమంలో పరస్పర నినాదాలతో చౌరస్తా దద్దరిల్లింది. అనంతరం, బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణ కొట్టుకునే స్థాయికి చేరింది. ‘బండి సంజయ్ డౌన్ డౌన్’.. ‘కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ ఇరువర్గాల భారీ నినాదాలు చేశాయి. దీంతో, రంగంలోకి దిగి ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసుల లాఠీచార్జ్ చేశారు.
కాగా, ఉభయ పార్టీల నేతలు.. పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీంతో, జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిరిసిల్ల నేతన్న చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రెండు పార్టీ నేతలను అటువైపు రాకుండా అడ్డుకుంటున్నారు.


