విజయ్‌ శైలి.. శ్రుతి మించుతోందా? | Vijay Cinematic Governance: Democratic Renewal or Excessive Promotion | Sakshi
Sakshi News home page

విజయ్‌ శైలి.. శ్రుతి మించుతోందా?

May 20 2026 9:22 AM | Updated on May 20 2026 9:27 AM

Vijay Cinematic Governance: Democratic Renewal or Excessive Promotion

మార్పు నినాదంతో ఘన విజయం సాధించిన విజయ్‌ అధికార పీఠం అధిరోహించడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని అంతా భావించారు. సినీ స్టార్‌గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన.. పార్టీ పెట్టడం దగ్గరి నుంచి సీఎంగా ప్రమాణం చేసే వరకు ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేశారు. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. కానీ విజయ్‌ పాలనలో కనిపిస్తున్న శైలి ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది..

తమిళనాడు అసెంబ్లీ  ఎన్నికల్లో విజయ్‌ పార్టీ అఖండ విజయం, సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు చర్చనీయాంశంగా మారాయి. ఈ దెబ్బకు ఆయన క్రేజ్‌ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. అంతెందుకు ఒకప్పుడు ఆయన్ని విపరీతంగా ట్రోల్‌ చేసిన తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఇప్పుడు ఆయన పట్ల పాజిటివిటీ కనిపిస్తోంది. అందుకు ఇక్కడి ఓ స్టార్‌ కమ్‌ లీడర్‌తో కంపేరిజన్‌ కూడా ఓ కారణం కావొచ్చు. అయితే ఇదంతా సోషల్‌ మీడియా వల్లే. అదే సమయంలో..  

విజయ్‌ శైలిలో సినిమాటిక్‌ టచ్‌ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రమాణస్వీకార సమయంలో సెల్ఫీ వీడియో తీయడం.. ప్రతిపక్ష నేతలను కలవడం, పాలనాపరంగా దూకుడు నిర్ణయాలు, ఓ చైల్డ్‌ యాక్టివిస్ట్‌ రిక్వెస్ట్‌తో సచివాలయంలో కుర్చీపై వేసిన టవల్‌ను తీసేయడం, టిఫిన్‌ బాక్స్‌ తెచ్చుకుని భోజనం చేస్తున్నట్లు వైరల్ అయిన AI ఫోటోలు.. ఇలా ప్రతీది సోషల్‌ మీడియాను కుదిపేసినవే. అయితే తాజాగా దివ్యాంగుల సంఘాలతో జరిగిన మీటింగ్‌ వీడియో రీల్‌గా బయటకు రావడం.. దుమారం రేపింది.

పాలనా సమావేశాలకు సంబంధించిన వీడియోలు అధికారికంగా బయటకు రావడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరీ సినిమా ప్రమోషన్‌లా మార్చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులేమో.. విజయ్‌ నిజంగా ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడని, ఆయన సాదాసీదా జీవనశైలి ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి అని అంటున్నారు. అయితే.. అధికారిక సమావేశాలను రీల్‌లుగా మార్చడం, AI ఫోటోలు వాడటం, పాలనను ప్రచార వేదికగా మార్చడం సరైందేనా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో దివ్యాంగుల హక్కుల ఉద్యమకారుడు డా. పి. సిమ్మచంద్రన్‌ స్పందించారు. సీఎం అనుమతి తీసుని ఆ వీడియోను తీశా.. అందులో తప్పేముంది? అని అంటున్నారాయన. 

విజయ్‌ సినీ స్టార్‌ కావడం వల్ల ఆయన ప్రతి చర్యలోనూ ఒక సినిమాటిక్‌ ఇమేజ్‌ కనిపిస్తోంది. ఆ ఇమేజ్‌ నుంచి బయటకు వచ్చి పాలించాలని స్టాలిన్‌, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లాంటి సినీ ప్రముఖులు.. అలాగే ఇటు మిత్రపక్షాలు సూచిస్తున్నాయి. అయినా ఇప్పటికప్పుడు అందులోంచి ఆయన బయటపడలేకపోతున్నారు. అయితే ఇలాంటి చర్యలు ఆయనకు ప్రజాదరణను పెంచినా రాజకీయ విమర్శలకు అవకాశం ఇచ్చినట్లే అవుతోంది. “పాలనలో గంభీరత తగ్గిపోతుందా?”, “ప్రచారం హద్దు దాటుతోందా?” అనే విమర్శలకు గుప్పించేందుకు ప్రతిపక్షాలకు స్వయంగా విజయే ఆయుధం అందించినట్లు అవుతోంది.

కొత్త కాదు కదా!
రీల్‌ కల్చర్‌ అనేది కొత్తది కాదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యంగా యువ నాయకులు, సోషల్‌ మీడియా వేదికలను పాలనలో భాగం చేసుకుంటున్నారు. అంతెందుకు.. తెలంగాణ, ఏపీలో చోటామోటా నేతల దగ్గరి నుంచి  మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సమావేశాలు,ప్రజా కార్యక్రమాలను రీల్‌ల రూపంలో షేర్‌ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలో ముఖ్యమంత్రుల అధికారిక పేజీల్లో చిన్న వీడియోలు, రీల్స్‌ ద్వారా పాలనలోని నిర్ణయాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా “మన్‌ కీ బాత్” వంటి కార్యక్రమాలను డిజిటల్‌ కంటెంట్‌గా మార్చి సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది కదా. అలాంటప్పుడు విజయ్‌ విషయంలోనే ఎందుకీ చర్చ?. 

తప్పా? ఒప్పా?.. అది నిర్ణయించాల్సింది..
ఎన్నికల్లో ఆయన సాధించిన గెలుపు ఓ కారణం అయితే.. సినీ స్టార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మరో కారణంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ఆయన పాలనలో కనిపిస్తున్న ప్రతి చిన్న చర్య సినిమాటిక్‌ ఇమేజ్‌ బిల్డింగ్‌గా అంతా భావిస్తున్నారు. అందుకే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఇది ప్రజలకు చేరువ కావడానికి, పారదర్శకతను చూపించడానికి ఉపయోగపడవచ్చు. కానీ అదే సమయంలో, పాలనను సినిమాటిక్‌ ప్రచారంగా మార్చే ప్రమాదం కూడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఇదే పద్ధతి సాధారణంగా ప్రచార సాధనంగా మాత్రమే కనిపిస్తే.. విజయ్‌ విషయంలో అది ఆయన సినీ ఇమేజ్‌తో మిళితమై ప్రత్యేకంగా చర్చకు దారితీస్తోంది. సినీ స్టార్‌గా విజయ్‌ ప్రజలను ఆకట్టుకున్నారు. అలాగని పాలనలో కూడా అదే శైలి కొనసాగిస్తానంటే కాస్త కష్టమే. ఈ సినిమాటిక్‌ పాలన ప్రజాస్వామ్యానికి కొత్త శక్తి ఇస్తుందా? లేక ప్రచార హద్దులు దాటుతోందా? అనేది కాలమే నిర్ణయించాలి’’ అని తమిళ రాజకీయాలను అధ్యయనం చేస్తున్న తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్‌ రాజకీయ విశ్లేషకుడు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement