ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కరుప్పు(తెలుగులో వీరభద్రుడు) చిత్ర బృందం క్షమాపణలు చెప్పింది. ఆయనను అగౌరపరచడం తమ ఉద్దేశం కాదని.. సినిమాలో ఉన్న డైలాగలను వెంటనే తొలగిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది.
అసలేం జరిగింది?
సూర్య, త్రిష జంటగా నటించిన తాజా చిత్రం కరుప్పు. ఆర్.జే. బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదలైంది. అయితే ఈ సినిమాలో ఇళయారాజాపై ప్రత్యేక్షంగా, పరోక్షంగా కొన్ని డైలాగులు ఉన్నాయి. కొన్ని చోట్ల అసందర్భంగానూ ఇళయరాజాపై డైలాగులు పెట్టారు. అవి ఆయన గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇళయరాజా కూడా ఆ డైలాగులపై అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కొంతమంది ఇళయరాజా అభిమానులు సినిమాను ట్రోల్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ వివాదం పెద్దది కాకముందే ముగింపు పలికారు చిత్రబృందం. ఇళయరాజాను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగులను తొలగిస్తున్నట్లు పేర్కొంది.
ఈ రోజు నుంచే మార్పు..
ఇళయరాజా అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. సినీ రంగం కోసం ఆయన చేస్తున్న సేవలు ఎన్నోతరాల్లో స్ఫూర్తి నింపుతున్నాయి. కరుప్పులో ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగు వల్ల ఆయన బాధ పడ్డారని మా దృష్టికి వచ్చింది. ఇళయరాజాను మేము క్షమాపణలు కోరుతున్నాం. ఆయన మనోభావాలను దెబ్బతీయడం, అగౌరవపర్చడం మా ఉద్దేశం కాదు. ఈ చిత్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగులను తొలగిస్తున్నాం. ఈరోజు నుంచి ఈ మార్పు చేస్తున్నాం. ఆయన గౌరవమే మాకు ప్రధానం’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.


