జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి? | Jr NTR Net Worth Car Collection Details Latest | Sakshi
Sakshi News home page

Jr.NTR Car Collection: పుట్టినరోజు స్పెషల్.. ఎన్టీఆర్ గ్యారేజీలో ఎన్ని కార్లున్నాయి?

May 20 2026 7:05 AM | Updated on May 20 2026 7:05 AM

Jr NTR Net Worth Car Collection Details Latest

తెలుగు హీరోల్లో జూ.ఎన్టీఆర్ కాస్త స్పెషల్. చిన్నప్పుడే నటుడు అయిపోయాడు. ఓ వయసొచ్చేసరికి సూపర్ హిట్స్ కొట్టి అద్భుతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. మధ్యలో ఫ్లాప్స్ పడ్డాయి కానీ మళ్లీ పుంజుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌డమ్ సంపాదించాడు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు 44వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇంతకీ తారక్ ఎంత ఆస్తి సంపాదించాడు? గ్యారేజీలో కార్ల కలెక్షన్స్ ఏంటి?

జూ.ఎన్టీఆర్.. సినీ, రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలోనే పుట్టాడు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయి వరకు వచ్చాడు. అలా ఇప్పటివరకు రూ.500-600 కోట్ల మేర ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ప్రొపర్టీస్ రూపంలోనే ఎక్కువగా ఉన్నట్టు టాక్. ప్రస్తుతం ఉంటున్న జూబ్లీహిల్స్‌లోని ఇంటి విలువ రూ.25 కోట్లు ఉంటుందని, అలానే హైదరాబాద్ శివారులోని శంకరపల్లిలో ఆరున్నర ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఉందని తెలుస్తోంది.

సినిమాలు చేసినప్పటికి కుటుంబానికి కూడా ఎన్టీఆర్ అదే స్థాయిలో సమయం కేటాయిస్తుంటాడు. ఇద్దరు కొడుకులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక్కో సినిమాకు ప్రస్తుతం రూ.80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. వీటన్నింటితో పాటు కార్లు, వాచీలంటే కూడా తారక్‌కి పిచ్చి ఇష్టం.

తారక్ దగ్గర ప్రస్తుతం అరడజనుకు పైగానే కార్లు ఉన్నాయి! వాటిలో అత్యంత ఖరీదైన పోర్స్ కేమన్ ఎస్ ఒకటి. దీని ఉత్పత్తిని సదరు కంపెనీ ఎప్పుడో ఆపేసింది. చాన్నాళ్ల క్రితమే ఎన్టీఆర్ దీన్ని కొనుగోలు చేశాడు. అప్పట్లో రూ.3 కోట్లు పెట్టి దీన్ని కొన్నాడు. అంటే ఇప్పటి రేటులో డబుల్ ధర ఉండొచ్చు. దీని తర్వాత చూసుకుంటే కొన్నేళ్ల క్రితం రూ.3.5 కోట్లు విలువైన లాంబోర్గిని ఉరుస్ క్యాప్సుల్ గ్రాఫైట్ కారు కొన్నాడు. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాడు.

ఈ రెండింటితో పాటు రూ.4 కోట్ల విలువ చేసే మెర్సిడెస్ మేబాచ్ ఎస్ క్లాస్, రూ.2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్, రూ.1.70 కోట్ల ఖరీదు చేసే బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఫ్యామిలీ అంతా కలిసి తిరిగేందుకు రూ.1.53 కోట్ల విలువైన టయోటా వెల్ ఫైర్ కారు.. ఎన్టీఆర్ గ్యారేజీలో ఉన్నాయి. వీటలో చాలా వాటికి 9999 లేదా 9 సంఖ్య కలిసొచ్చేలా నంబర్ ప్లేట్స్ ఉంటాయి. తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ పాటించిన '9' సెంటిమెంట్‌నే తారక్ ఫాలో అవుతూ వస్తున్నాడు. కార్లే కాదు ఖరీదైన వాచీలు కూడా తారక్ దగ్గరున్నాయి. రూ.7.47 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే చేతి గడియారం, రూ.2.5 కోట్ల విలువైన నటిలస్ వాచీలు తారక్ సొంతం.

తారక్ సినిమాల విషయానికొస్తే.. 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత చేసిన వాటిలో 'దేవర' హిట్ కాగా గతేడాది రిలీజైన 'వార్ 2' ఘోరమైన డిజాస్టర్ అయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దీని గ్లింప్స్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement