పట్టుపడుతున్న ఎగ్జిబిటర్స్
మల్టీప్లెక్స్ తరహాలోనే సింగిల్ స్క్రీన్స్‌లోనూ పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయడం.. ఇప్పటికిప్పుడు వీలుకాదంటూ ‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ సభ్యులు మాట్లాడటం తెలిసిందే. ఈ సమస్యపై చర్చించేందుకు ‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ అధ్యక్షుడు డి.సురేశ్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో గత శుక్రవారం నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌తో సమావేశం నిర్వహించారు. పర్సెంటేజ్ విధానంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు ఏడుగురు నిర్మాతలు, ఏడుగురు ఎగ్జిబిటర్లు, ఏడుగురు డిస్ట్రిబ్యూటర్లు (మొత్తం 21 మంది)తో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
రెండు నెలల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే... హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సోమవారం మరోసారి అత్యవసరంగా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో మూడు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదట. ‘పెద్ది’ సినిమా ప్రదర్శనలో తమకు పర్సెంటేజ్ కావాల్సిందేనని ఎగ్జిబిటర్లు పట్టుబట్టారట. థియేటర్ రెంట్‌తో పాటు అదనంగా 7.5 శాతం పర్సెంటేజ్ ఇచ్చేందుకు సిద్ధమేనని నిర్మాతలు చెప్పారని తెలిసింది. అయితే ‘పెద్ది’కి మాత్రమే పర్సెంటేజ్ ఇస్తే సరిపోదని, తర్వాతి చిత్రాలకు కూడా ఎంత మేర పర్సెంటేజ్ ఇస్తారు? అనే విషయంపై ‘పెద్ది’ రిలీజ్‌కు ముందే తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు కోరారట. ఈ డిమాండ్‌పై అంతర్గతంగా చర్చించుకుని, తమ నిర్ణయాన్ని నేడు చెబుతామని నిర్మాతలు చెప్పినట్లు సమాచారం.


