ఓస్లోలో ప్రధాని మోదీతో నార్వే ప్రధాని జోనాస్
నార్వే ప్రధానితో భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు
ఓస్లో: యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌తో శుద్ధ ఇంధనంలో సమష్టి కృషే ధ్యేయంగా హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు. శుద్ధ ఇంధనం మొదలు వాతావరణ మార్పులను తట్టుకోవడం, తక్కువ కర్భన ఉద్గారాలు వెదజల్లేలా సముద్రవాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డిజిటల్ సాంకేతిక, అంతరిక్షం, ఆర్కిటిక్ ఖండంలో పరిశోధన దాకా పలు అంశాలపై నార్వే ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
సోమవారం నార్వే రాజధాని నగరం ఓస్లోలో జోనాస్ గార్ స్టోర్‌తో విస్తృతస్థాయిలో చర్చల సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘ఇరుదేశాల మధ్య బంధాన్ని హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాం. పర్యావరణ అనుకూల సుస్థిరాభివృద్ధి ధ్యేయంగా శుద్ధ ఇంధనంతోపాటు వాతావరణ మార్పుల కట్టడి, పర్యావరణ పరిరక్షణ కోసం ఇకపై భారత్, నార్వే కలిసి నడుస్తాయి.
గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ తర్వాత భారత దేశ ప్రతిభ, అందిపుచ్చుకునే తత్వం, వేగాన్ని నార్వే సాంకేతికత, పెట్టుబడులతో జోడించి రెండు దేశాల పరిశ్రమలు, సంస్థలు క్లీన్ ఎనర్జీ మొదలు బ్లూ ఎకానమీ, గ్రీన్ షిప్పింగ్ దాకా ఎన్నో రంగాల్లో అద్భుతాలు సృష్టించనున్నాయి. సత్సంబంధంలో భారత్, యూరప్ కొత్త స్వర్ణయుగంలోకి అడుగుపెడుతున్నాయి.
వచ్చే 15 ఏళ్లలో భారత్‌లోకి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులతోపాటు పది లక్షల ఉద్యోగాల కల్పనకు భారత్, యురోపియన్ స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందం బాటలుపరుస్తుంది. వచ్చే నాలుగేళ్లలో నార్వే, భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్కిటిక్‌లో భారత పరిశోధనా కేంద్రం ‘హిమాద్రి’కి నార్వే ఎంతగానో సాయపడుతోంది.
ఇస్రో, నార్వే స్పేస్ ఏజెన్సీ మధ్య అవగాహన ఒప్పందం కుదరడం సంతోషకరం. ఆహార, ఇంధన భద్రత మొదలు పలు రంగాల్లో ఇరుదేశాల మధ్య బంధం సమున్నత శిఖరాలకు చేరుకోబోతోంది. ఉక్రెయిన్‌కావొచ్చు పశ్చిమాసియా సంక్షోభంకావొచ్చు ఏదైనా సంఘర్షణను చర్చలు, సంప్రతింపులు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోగలం. శాంతిస్థాపనకు భారత్, నార్వే ఎల్లప్పుడూ కృషిచేస్తాయి’’అని మోదీ వ్యాఖ్యానించారు.
మోదీకి నార్వే అత్యున్నత పురస్కారం
నార్వే అత్యున్నత పౌర పురస్కారం ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేనియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ను మోదీ అందుకున్నారు. భారత్–నార్వే సత్సంబంధాలను సమున్నత శిఖరాలకు చేర్చేందుకు మోదీ చేస్తున్న కృషి, ఆయన దార్శనిక నాయకత్వానికిగాను మోదీని ఈ పురస్కారంతో గౌరవిస్తున్నట్లు నార్వే ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మెడల్‌ను రాజప్రాసాదంలో నార్వే రాజు హరాల్డ్–5 స్వయంగా మోదీకి ప్రదానంచేశారు.
మోదీకి పురస్కారం అందజేస్తున్న రాజు హరాల్డ్
మోదీ పారిపోయారు: రాహుల్
మీడియా ఎదుట నార్వే ప్రధానితో మోదీ కరచాలనంచేశాక మీడియా ప్రతినిధుల నుంచి ఎలాంటి ప్రశ్నోత్తరాలను స్వీకరించకుండానే భారత ప్రధాని వెనుతిరిగారు. దీనిపై నార్వే మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తంచేశారు. ‘‘మోదీ మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ప్రపంచ పత్రికాస్వేచ్ఛలో నార్వే అగ్రస్థానంలో ఉంది. అదే భారత్ 157వ స్థానంలో అట్టడుగున ఉంది.
పాలస్తీనా, ఎమిరేట్స్, క్యూబా లాంటి దేశాల పక్కన ఆగిపోయింది’’అని హెలీ లింగ్ అనే జర్నలిస్ట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ స్పందిస్తూ ‘ఎక్స్’లో సోమవారం ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘భయపడనప్పుడు దాచిపెట్టాల్సిన పనేలేదు. మీడియా అడిగేప్రశ్నలకు సమాధానం చెప్పలేక మోదీ పారిపోయారు. ఇలా చేస్తే భారత పరువు పోదా?’’అని రాహుల్ నిలదీశారు.


