విశ్వ గురు
స్నాతకోపన్యాసం ఇవ్వాలని కొన్నేళ్లుగా, చాలాసార్లు అడుగుతూ వస్తున్నా నేనెప్పుడూ మృదువుగా తిరస్కరిస్తూనే వచ్చాను. అందుకు కారణం, ప్రసంగించేందుకు నేను సిద్ధంగా లేనని నాకు అనిపించటం. జీవిత పరమార్థాన్ని కుదించి చెప్పడం అంత తేలిక కాదు. జీవితాన్ని పూర్తిగా ఎలా ఆనందించాలో తెలియజేయటం చాలా కష్టం. అదీ కాక, ఏం చెప్పాలా అని ఒత్తిడికి లోనవుతాం. మిగిలిన వాళ్ల స్నాతకోపన్యాసాలు వినడం నాకెంతో ఇష్టం. కానీ వారి అడుగు జాడల్లో నడవడం చాలా కష్టం. ఇంకెందుకు వాటిని వినడం లేదా చదవడం అంటారేమో. ఎందుకంటే, నేనెప్పుడూ మార్గదర్శనం కోరుకునే వ్యక్తిని. నా చిన్నతనం చర్చిలో గడిచింది. ‘‘దేవుడే దారి చూపుతాడు. దారి చూపాల్సిందిగా మనం ఆయన్ని కోరాలంతే. భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకునే సాహసాన్ని కూడా మనం ప్రదర్శించగలగాలి’’ అని నాకు చెబుతూ వచ్చారు. నేనెప్పటికీ ఆ మాటల్ని విశ్వసిస్తాను.
ఒక ప్రణాళికగా జీవితం నడవదు
ఇన్నాళ్లూ ఉపన్యసించేందుకు ససేమిరా అన్నవాడిని, ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నానో కూడా నాకు తెలియదు. నిజానికి, నా ప్రసంగ పాఠానికి ఏదైనా శీర్షిక పెట్టాలంటే, ‘‘నాకు తెలియదు’’ అనే పెట్టాలి. నాకు అన్నీ తెలుసు అనే స్థితికి ఎన్నడూ చేరుకోలేనని నాకు 57 ఏళ్లు వచ్చాక గ్రహించాను. జీవితం మనం ప్రణాళిక వేసుకున్నట్లుగా సాగదని చెప్పడానికే నేను ఇక్కడకు వచ్చాను. కనీసం, నా జీవితం అలా సాగలేదని చెప్పగలను. జీవితంలో చాలా భాగం నాకు ఏమీ తెలియకుండానే గడిచిపోయింది. ఈ తెలియకపోవడం అన్నది 22 లేదా 27 ఏళ్ల వయసప్పుడే కాదు. ఆరు నెలల క్రితం కూడా ఏమీ తెలియదు. ఆ మాటకొస్తే నిన్న కూడా ఏమీ తెలియదు. ఆరేళ్ల వయసప్పుడే ఒక పాత్రలో నటించాను. ఆ తర్వాత నాటకాలు వేశాను. పాడాను. కచ్చేరీలు చేశాను. కానీ, అవే నా వృత్తిగా పరిణమిస్తాయని నేను ఎన్నడూ అనుకోలేదు. సహచరుడు ఒకరు మోడలింగ్ చేస్తూ, బాగా డబ్బు గడించడం చూసి 19 ఏళ్ల వయసులో నేను మోడలింగ్‌కి ప్రయత్నం చేశాను. కానీ, నాది ఫొటోజెనిక్ ఫేస్ కాదని, కెమెరా నాకు అచ్చిరాదని, వేరే వ్యాపకం ఏదైనా చూసుకోవడం మంచిదని, ఆ ఏజన్సీ అధిపతి నాకు నిష్కర్షగా చెప్పేశాడు. ఆ మాటలు నాలో పాతుకుపోయి, నేను సినీ జీవితంలోప్రవేశించిన తర్వాత కూడా, చాలా రోజులు నా చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. కనుక, చెవికెక్కించుకునే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
కోరుకున్న చోటుకే చేరుకుంటాం
జర్నలిజం ప్రధానాంశంగా నేను కమ్యూనికేషన్స్‌లో లిబరల్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసే దశలో ఉన్నప్పుడు మనం ఒక నాటకం వేయా లని టీచరు చెప్పారు. చిట్టీలలో పేర్లు రాసి, డ్రా తీశారు. నా పేరు రావడంతో, నన్నో పాత్రకు ఎంపిక చేశారు. ఇష్టం లేకపోయినా, డిగ్రీ చివరి ఏడాదిలో 90 శాతం సమయాన్ని నాటకానికే వెచ్చించాల్సి వచ్చింది. నాటకం వేసేందుకు స్థానికంగా ఉన్న మరో యూనివర్సిటీకి మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ యాక్టింగ్ స్టూడెంట్లు కొంతమంది ఉన్నారు. వారికి, మాకూ ఒకేచోట బస. ఎందుకో తెలియదుకానీ, ‘‘నేను ఎవరి సాహచర్యాన్ని కోరుకుంటున్నానో వారి వద్దకే చేరాను’’ అనే భావన నాలో కలిగింది! సిడ్నీలోని యాక్టర్స్ సెంటర్‌లో ఒక ఏడాది కోర్సులో చేరాలనుకున్నా. 20 సీట్లు ఉన్నాయి. మొదటిసారి నాకు రాలేదు. సీటు వచ్చిన ఒకతను చేరకపోవడంతో, నాకు మళ్లీ పిలుపు వచ్చింది. దానికీ, సుమారు ఎనిమిదిమంది పోటీ పడితే, నాకు దక్కింది. కోర్సులో చేరాలని వచ్చిన జాబు చూసి సంతోషపడ్డాను కానీ, చివరలో 3,500 డాలర్ల ఫీజు చెల్లించాలనే నిబంధన చూసి హతాశుడినయ్యాను. ఇది 1984 నాటి మాట.
ఆ ఫీజు నాకు అప్పట్లో, పది లక్షల డాలర్లతో సమానం. నాన్న ఇచ్చిన పైకంతో అప్పుడే డిగ్రీ పూర్తి చేశాను. మరో కోర్సు చేయడా నికి డబ్బులు ఇవ్వాలని నాన్నని అడిగే సాహసం చేయలేక పోయాను. ఆఫరు లెటర్‌ను చెత్త బుట్టలో పడేశాను. నటన నా నుదుటిన రాసిపెట్టిలేదేమో అనుకున్నా. మరుసటి రోజు, మా నాయనమ్మ వీలునామా చలువ వల్ల, నాకు 3,500 డాలర్లు వచ్చి పడ్డాయి. చెత్త బుట్టలో పడేసిన లెటర్‌ని జాగ్రత్తగా బయటకు తీసి, కోర్సులో చేరాను. అలా, నాలుగేళ్ల పాటు నటన నేర్చుకున్నాను.
కొందరికి అది పూర్తి కాకతాళీయంగా జరిగినదిగా తోచవచ్చు. నాకు మాత్రం, అది ఒక సంకేతం, ఒక ప్రార్థనకు లభించిన జవాబు అనిపి స్తుంది. అలాగే, నాకు ‘ద బాయ్ ఫ్రమ్ ఔన్స్’ అనే సంగీత నాటకంలో నటించే అవకాశం లభించింది. అప్పటికే రెండు పెద్ద మ్యూజి కల్స్ చేసే పనిలో ఉన్నాను. నాటకాలు, సినిమాలు, టెలివిజన్ కార్య క్రమాల్లో అవకాశాల కోసం నేను ముమ్మరంగా ప్రయత్నిస్తున్న రోజులవి. వచ్చింది గొప్ప అవకాశం అని నాకు లోపలి నుంచి తోస్తున్నా, అప్పటికప్పుడే మరో మ్యూజికల్ చేయడం సరికాక పోవచ్చు అనుకుని ఆ అవకాశాన్ని వద్దను కున్నాను. తీరా, దాన్ని చూస్తున్నప్పుడు, అంతకు రెండేళ్ల క్రితం లభించిన ఆ అవకాశాన్ని చేజిక్కించు కోనందుకు ఎంతో బాధపడ్డాను. అంతఃకరణ చెప్పినట్లు నడచుకోక పోవడం తప్పు అనిపించింది. ఆ క్షణమే, లోపల ఏది మంచిదని తోస్తుందో దాన్నే చేయాలని నిర్ణయించుకున్నాను.
భయం కలగటం మంచి సంకేతం!
మన మెదడు ఎప్పుడూ ఒక ప్రణాళికతో నడచుకోవాలని చెబుతుంది. కానీ, మనం మన హృదయ కవాటాలను తెరచి, లోపలి నుంచి మన మది చెప్పింది వింటే, అది నిగూఢమైన ఒక మార్మిక సంకేతంగా తోచవచ్చు. కానీ, కొన్నిసార్లు ఆ సంకేతాలు నిశ్శబ్దంతో నిండి ఉంటాయి. అప్పుడు అంతరాత్మ ఏం చెబుతోందో ఎలా తెలుస్తుంది అనిపించవచ్చు. దేన్నైనా పరిపూర్ణమైనదిగా చేయాలనే ఆలోచనను మొదట పక్కన పెట్టండి. లోపల నుంచి వచ్చిన ఆలోచన భయపెడితే బహుశా అది మంచి సంకేతమే కావచ్చు. అది ఉత్తేజపరిస్తే చాలా మంచి సంకేతం కింద లెక్క. అది చెప్పిన పని చేయడం వల్ల నామమాత్రపు లాభమైనా లభిస్తుందనే భరోసా లేదని తెలిసినా, ప్రయత్నించి చూడాలనే తలంపు కలిగితే, అది అద్భుతమైన సంకేతం కింద లెక్క. నాకు జీవితంలో జరిగిన గొప్ప మేలు ఏదైనా ఉందీ అంటే, అది నేను చేసిన తప్పిదాలే లేదా నా వైఫల్యాలే, అనుకోకుండా సత్ఫలితాలను ఇచ్చిన చివరి నిమిషపు ప్రయత్నాలే. మనసు నాకు ఎప్పుడూ మంచి చెబుతూనే ఉంటుంది. ఇప్పటికీ దారి చూపుతూనే ఉంది. అది చెప్పినట్లు చేస్తేనే, నాకు నేను సరైన బాటలో ఉన్నాననిపిస్తుంది. ఈ ప్రసంగం కూడా దాని ప్రబోధం మేరకే చేస్తున్నాను.
మీకు ఏది సంతోషం కలిగిస్తుందో వెదకండి. భయం, సందేహాలు, ఒంటరితనం, వైఫల్యాలు ఎదురైనపుడు మీలో వెలుగును నింపేది ఏదో తెలుసుకోండి. లోపల రగులుతున్న దానిని కనుగొనండి. ‘‘నిచ్చెన చివరి మెట్లు దాకా ఎక్కిన తర్వాత, ఎక్కాల్సిన గోడ ఇది కాదు అని తెలుసుకోవడం కన్నా అధ్వానమైన విషయం బహుశా మరొకటి ఉండదు’’ అని జోసెఫ్ క్యాంప్‌బెల్ (అమెరికన్ రచయిత) అంటాడు. మీరు ఎక్కాల్సిన గోడ ఏదో, దానికి ఎంచు కోవాల్సిన నిచ్చెన ఏదో మీ మనసే మీకు చెబుతుంది. మీరందరూ సాహసం, ఆశ్చర్యం, సంతోషం, తెగువ, గొప్పగా చెప్పుకోతగిన వైఫల్యాలు, విజయాలు, గొప్ప స్నేహ బంధాలు, ప్రేమతో నిండిన జీవితం గడపాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. మీరు కోరుకుంటు న్నట్లుగా మీరు జీవిస్తున్నారనే భావన మీలో కలగాలి. ఎందుకంటే, దాన్ని మీ దగ్గర నుంచి ఎవరూ లాక్కోలేరు.


