పిల్లలూ... చదవాలి లా | Lessons in Law and Order: Virender Punj | Sakshi
Sakshi News home page

పిల్లలూ... చదవాలి లా

May 20 2026 4:21 AM | Updated on May 20 2026 4:21 AM

Lessons in Law and Order: Virender Punj

స్కూల్‌లో లీగల్‌ పాఠాలు నేర్పుతున్న రిటైర్డ్‌ ఐపిఎస్‌ వీరేందర్‌

ఆ ఇంటి కుర్రాడు ఫోన్ లో వచ్చిన లింక్‌ నొక్కాడు. బ్యాంక్‌ ఖాతా ఖాళీ అయ్యింది. మరో ఇంటి కుర్రాడు మార్ఫింగ్‌ ఫొటో పెట్టాడు. పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కాడు. ఇంకో ఆకతాయి బైక్‌ రేస్‌ చేశాడు. కేసు నెత్తిన పడింది. ఇవన్నీ ‘తెలియక’ చేసినవే.  కానీ చట్టం ‘తెలియదు’ అనే మాటను క్షమించదు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచి లీగల్‌ పాఠాలు ఉండాలంటున్నారు రిటైర్డ్‌ ఐపిఎస్‌ వీరేందర్‌. ‘మిషన్‌ లీగల్‌ స్టడీస్‌ ఇండియా’ పేరుతో ఆయన ఢిల్లీలో చేస్తున్న కృషి దేశం అందుకోవాల్సి ఉంది.

‘ఇగ్నొరెన్స్‌ ఆఫ్‌ లా ఈజ్‌ నాట్‌ యాన్‌ ఎక్స్‌క్యూజ్‌’ అని చట్టంలో మొదటి పాఠం.  ‘మా వాడు బుద్ధిమంతుడు సార్, తెలియక చేశాడు’ అని తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా లాభం ఉండదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది.  

తప్పులు... శిక్షలు
నేటి పిల్లల ప్రపంచం స్క్రీన్‌ అంత చిన్నది... లేదా స్క్రీన్‌ అంత పెద్దది. స్క్రీన్‌ మీద ఏది కనిపిస్తే అదే నిజం అనుకుంటున్నారు. సైబర్‌ నేరం చేస్తే జైలుకు వెళ్తారని తెలియదు. అమ్మాయి ఫోటో అనుమతి లేకుండా షేర్‌ చేస్తే పోక్సో అవుతుందని తెలియదు. బైక్‌పై ముగ్గురు వెళ్తే, హెల్మెట్‌ లేకపోతే, మైనర్‌ డ్రైవింగ్‌ చేస్తే తలిదండ్రులకు కూడా జైలు శిక్ష పడుతుందని తెలియదు. మనం కూడా మార్కులు, ర్యాంకులు, ఐఐటి.. నీట్‌ అంటూ పరుగెత్తిస్తాం. కానీ రోడ్డు మీద ఎలా నడవాలి, ఫోన్ లో ఏం చేయకూడదు, ఆపద వస్తే ఏ చట్టం కాపాడుతుంది అనే ‘బతుకు పాఠం’ చెప్పం. ఫలితం? చిన్న తప్పు చేసి జీవితాన్ని బజారున పడేసుకుంటున్నారు.

బడిలో  చట్టం నేర్పిస్తే?
‘లీగల్‌ స్టడీస్‌’ అనే సబ్జెక్ట్‌ సి.బి.ఎస్‌.ఇ.లో 11, 12 క్లాసులకు ఆప్షనల్‌గా ఉంది. ఆర్‌.టి.ఐ ఎలా వేయాలి, కన్సూ్యమర్‌ హక్కులు ఏంటి, సైబర్‌ చట్టాలు, మహిళా రక్షణ చట్టాలు, ట్రాఫిక్‌ రూల్స్‌  అన్నీ అందులో ఉంటాయి. కానీ ఢిల్లీలో 1500 స్కూల్స్‌ ఉంటే కేవలం 29 స్కూల్స్‌ మాత్రమే ఈ సబ్జెక్ట్‌ ఆఫర్‌ చేస్తున్నాయి.  ఎందుకు? ‘దీనివల్ల కెరీర్‌ ఏముంది’ అని స్కూల్స్‌ అనుకుంటాయి. ‘మార్కులు రావు’ అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఇది మార్కుల పాఠం కాదు, మనిషిగా బతికే పాఠం. దీన్ని ఎవరు చె΄్పాలి? రిటైర్డ్‌ జడ్జిలు, లాయర్లు, పోలీస్‌ అధికారులు వారానికి ఒక పీరియడ్‌ తీసుకుంటే చాలు.

కోర్టులో నల్లకోటు వేసుకునే లాయర్‌ బడిలో చాక్‌పీస్‌ పడితే చట్టం పిల్లల భాషలోకి దిగివస్తుంది. ‘కేసు’ అంటే భయం పోయి ‘క్లారిటీ’ వస్తుంది. సినిమాల్లో చూసే పోలీస్, లాయర్‌ కాకుండా నిజమైన చట్టం తెలుస్తుంది. నేర్చుకుంటే నేరం ఆగుతుంది. ఒక పిల్లవాడికి తన హక్కులు తెలిస్తే, ఎదుటివాడి హక్కులూ తెలుస్తాయి.  ‘రోడ్డు నాదే’ అని బైక్‌ నడిపేవాడు ‘రూల్‌ అందరిదీ’ అని నమ్ముతాడు. చట్టం తెలిసిన పౌరుడు పోలీస్‌కు సాయం చేస్తాడు, భయపడడు. మోసం జరిగితే కన్సూ్యమర్‌ కోర్టుకు వెళ్తాడు. అమ్మాయిని ఏడిపిస్తే అది ‘ఈవ్‌ టీజింగ్‌’ కాదు, ‘క్రిమినల్‌ ఆఫెన్ ్స’ అని గట్టిగా చె΄్తాడు. సమాజం మారాలంటే శిక్ష ఎందుకు పడుతుందో తెలియాలి. అది బడి నుంచే తెలియాలి.

అతని కృషి
ఢిల్లీ రిటైర్డ్‌ ఐ.పి.ఎస్‌. ఆఫీసర్‌ వీరేందర్‌ పుంజ్‌ ఈ విషయంలో మొదటగా కళ్లు తెరిచారు. 2012 నిర్భయ కేసు సమయంలో ఆయన్ను ఒక ప్రశ్న వెంటాడింది. ‘నిందితుల్లో ఒకడు మైనర్‌. వాడికి చిన్నప్పుడే చట్టం పాఠం చెప్పుంటే ఈ దారుణం జరిగేదా?’... ఈ ప్రశ్నకు జవాబుగా రిటైర్‌ అయ్యాక స్కూల్‌ బ్యాగ్‌ తగిలించుకున్నాడు. ‘మిషన్‌ లీగల్‌ స్టడీస్‌ ఇండియా’ పేరుతో బడి బడికీ తిరుగుతున్నాడు. పిల్లలతో మాట్లాడుతున్నాడు. ‘మీ హక్కులు తెలుసా?’ అని అడుగుతున్నాడు.  పిల్లలు ఆయనకు ఉత్తరాలు రాశారు. ‘మాకు లీగల్‌ స్టడీస్‌ కావాలి’ అని. ‘"WE WANT LEGAL STUDIES SUBJECT IN OUR SCHOOLS" ‘ అని ప్లకార్డులు పట్టుకున్నారు. చిన్నప్పుడు హిట్‌ అండ్‌ రన్‌ కేసులో తండ్రిని పోగొట్టుకున్న వీరేందర్‌కు న్యాయం జరగలేదు. ఆ గాయమే ఇవాళ వేల మంది పిల్లలకు చట్టం అనే కవచం ఇచ్చేలా చేస్తోంది.  

ఒక్క పిరియడ్‌ చాలు
చట్టం పుస్తకంలో కాదు, బుర్రలో ఉండాలి. మామిడి పండు తియ్యగా ఉండాలంటే మొక్క సమయం నుంచి నీళ్లు పోయాలి. పౌరుడు బాధ్యతగా ఉండాలంటే బడిలోనే చట్టం నేర్పాలి. క్లాస్‌రూమ్‌లో ఒక్క పిరియడ్‌ చట్టం వింటే చాలు. జీవితం సేఫ్‌.  రేపు మీ పిల్లల స్కూల్లో ‘లీగల్‌ స్టడీస్‌’ ఉందా అని అడగండి. లేకపోతే అడిగించండి. చట్టం తెలిసిన బిడ్డ ఇంటికి భరోసా, దేశానికి ధీమా.      – కె.

Advertisement
 
Advertisement
Advertisement