న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కఠిన భద్రతా నిబంధనల మధ్య పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షలో అవకతవకలు, ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు రావడంతో పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే. ఆ పరీక్షకు 22 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రద్దు కావడంతో ఆవేదన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం నిర్వహించి.. పరీక్ష నిర్వహణలో నిష్పక్షపాతం, పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. గత పరీక్షా ప్రక్రియలో గుర్తించిన లోపాలు తలెత్తకూడదని అధికారులకు ఆదేశించారు. కఠిన పర్యవేక్షణ వ్యవస్థలపై దృష్టి పెట్టిన ధర‍్మేంద్ర ప్రధాన్ పరీక్షా కేంద్రాల్లో అప్రమత్తతతో రీ-నీట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు.
అలాగే పరీక్ష ఏర్పాట్లు, భద్రతా పర్యవేక్షణ అమలుపై రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. భద్రతా చర్యలతో పాటు విద్యార్థులకు రవాణా సౌకర్యం, తాగునీరు, ఇతర అవసరమైన ఏర్పాట్లు పరీక్షా కేంద్రాల్లో ఉండాలని ప్రధాన్ అధికారులకు ఆదేశించారు.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు
నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21 (ఆదివారం) నిర్వహిస్తారు.
ప్రస్తుతం ఉన్న చిరునామా మారితే పరీక్షా నగర ప్రాధాన్యత మార్చుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లు నీట్ ఎన్‌టీఏ పోర్టల్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మే 21 వరకు మార్పులు చేసుకోవచ్చు.
విద్యార్థులు మొదటి, రెండో ప్రాధాన్యత పరీక్షా నగరాలను ఎంచుకునే అవకాశం పొందుతారు.
ప్రస్తుతం ఉన్న చిరునామా, పరీక్షా నగర ప్రాధాన్యత మార్పులకు తప్ప ఇతర సవరణలకు అనుమతి లేదు. మే 21 తర్వాత వచ్చే వినతులను పరిగణనలోకి తీసుకోరు.
రద్దైన పరీక్షకు చెల్లించిన ఫీజు తిరిగి ఇస్తారు. రీ-ఎగ్జామ్‌కు అదనపు ఫీజు వసూలు చేయరు.
పరీక్ష పెన్-అండ్-పేపర్ (ఆఫ్‌లైన్) విధానంలోనే 13 భాషల్లో నిర్వహిస్తారు. అవి అస్సామీ, బెంగాలీ, ఇంగ్లిష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ.
పరీక్షా ప్రక్రియల నిర్వహణకు విద్యార్థులకు అదనంగా 15 నిమిషాలు ఇస్తారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరుగుతుంది.
సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు, అడ్మిట్ కార్డులు, ఇతర పరీక్షా వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో తర్వాత ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. తాత్కాలికంగా జూన్ 14 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.
2027 నుంచి నీట్-యూజీని కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తామని ఏజెన్సీ ప్రకటించింది.
రీ-ఎగ్జామ్ ఫలితాల విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తారు.
అప్‌డేట్లు, పరీక్షా సూచనల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక ఎన్‌టీఏ సోర్సులనే నమ్మాలని అధికారులు సూచించారు.
నీట్ (యూజీ) 2026పై మరింత సమాచారం కావాలంటే అభ్యర్థులు 011-40759000, 011-69227700 హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయొచ్చు. లేక neetug2026@nta.ac.in కు ఈమెయిల్ పంపవచ్చు.


