నేటి కార్పొరేట్ ప్రపంచంలో లక్షల ప్యాకేజీలు, ఆకర్షణీయమైన కెరీర్ వృద్ధి వైపే యువత పరుగులు తీస్తోంది. కానీ, ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ సరికొత్త చర్చకు తెరలేపింది. ‘బెంగళూరులో రూ.38 లక్షల ప్యాకేజీ (ఎల్‌పీఏ) కావాలా? లేక హైదరాబాద్‌లో ప్రశాంత జీవితం కావాలా?’ అంటూ సదరు ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఆన్‌లైన్ వేదికగా వైరల్‌గా మారింది.
ఆ వేతనం కంటే.. జీవన నాణ్యతే ముఖ్యం!
మధన్ మోహన్ అనే ఓ ఐటీ నిపుణుడు ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో తన కెరీర్ ఎంపిక గురించి ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నాడు. ప్రస్తుత సంస్థలో చేరడానికి ముందు తన వద్ద రెండు బెటర్ జాబ్ ఆఫర్లు ఉన్నట్లు వెల్లడించాడు. ఆఫర్ 1.. రూ.38 ఎల్‌పీఏ ప్యాకేజీ, బెంగళూరులో లొకేషన్. ఆఫర్ 2.. రూ.30 లక్షల ప్యాకేజీ, హైదరాబాద్‌లో జాబ్ లొకేషన్. ‘నా చుట్టూ ఉన్న చాలా మంది.. చేతికి వచ్చే ఆ 8 లక్షల రూపాయల అదనపు ఆదాయాన్ని ఎందుకు వదులుకుంటావు? అని ప్రశ్నించారు. కానీ కొన్నిసార్లు, ఉత్తమ నిర్ణయం అంటే కేవలం అత్యధిక ప్యాకేజీని ఎంచుకోవడం మాత్రమే కాదని నేను గ్రహించాను’ అని మధన్ మోహన్ పేర్కొన్నాడు.
హైదరాబాద్‌పైనే ఎందుకు మొగ్గు?
‘బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో నిత్యావసరాలు, జీవన వ్యయం చాలా తక్కువ. ట్రాఫిక్, రోజువారీ ఉరుకుల పరుగుల ఒత్తిడి కూడా తక్కువే. దాదాపు 15 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. స్నేహితులు, కుటుంబ సభ్యులు సమీపంలోనే ఉన్నారు. హైదరాబాద్ బెస్ట్ ఫుడ్, ఇక్కడి అనుకూల వాతావరణం మానసిక ప్రశాంతతను ఇస్తాయి. చాలా మంది ఉద్యోగులు కేవలం కాగితంపై కనిపించే సీటీసీని మాత్రమే లెక్కిస్తారు. కానీ జీవితంలో ఆనందం, మానసిక శ్రేయస్సు, జీవన నాణ్యతను లెక్కించడం మర్చిపోతారు. దీర్ఘకాలంలో మనశ్శాంతే అత్యంత విలువైనది. ఒత్తిడికి బదులు శాంతిని ఎంచుకోవడం కూడా ఒక తెలివైన కెరీర్ ప్లానింగే’ అని అతను నెటిజన్లతో పంచుకున్నాడు. తన నిర్ణయం పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ప్రస్తుతం సంతృప్తితో ఉన్నానని తెలిపాడు.
నెట్టింట స్పందనలు ఇలా..
మధన్ మోహన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దాదాపు 82,000 కంటే ఎక్కువ వ్యూస్‌తో వైరల్‌గా మారింది. ‘జీతం వర్సెస్ జీవన నాణ్యత’ అంశంపై నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘అన్ని నగరాల కంటే హైదరాబాదే బెస్ట్’ అని కొందరు వ్యాఖ్యానించగా.. ‘నాకు కూడా హైదరాబాద్ సొంత ఇల్లాంటి అనుభూతినే ఇస్తుంది’ అని మరొకరు రాసుకొచ్చారు. ‘బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో ఖర్చులు చాలా తక్కువ సోదరా, నీ నిర్ణయం కరెక్ట్’ అంటూ మెజారిటీ నెటిజన్లు తన నిర్ణయాన్ని కొనియాడారు. ‘నేనైతే బెంగళూరులో ఆ రూ.38 లక్షల ఆఫర్ తీసుకునేవాడిని. అక్కడ ఏడాది పాటు పనిచేసి ఆపై 30% హైక్‌తో రూ.50 లక్షల ప్యాకేజీకి హైదరాబాద్‌లో ఉద్యోగం వెతుక్కుని వచ్చేవాడిని. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి మార్పులు ఆర్థికంగా భారీ ఊతాన్ని ఇస్తాయి. అయితే, ఇవి తరచూ చేయడం సరైందికాదు’ అని ఒకరు స్పందించారు.
ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!


