రూపాయి మరో కొత్త కనిష్టం.. | Rupee falls to fresh record low of 96. 70 against US dollar | Sakshi
Sakshi News home page

రూపాయి మరో కొత్త కనిష్టం..

May 20 2026 3:24 AM | Updated on May 20 2026 3:24 AM

Rupee falls to fresh record low of 96. 70 against US dollar

ఇంకో 50 పైసలు డౌన్‌ ∙96.70కి పతనం 

గత ఎనిమిది సెషన్స్‌లో 2.64 శాతం క్షీణత 

ముంబై: భగ్గుమంటున్న క్రూడాయిల్‌ రేట్లు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, డాలరు బలపడుతుండటం లాంటి ప్రతికూల పరిణామాలతో రూపాయి మారకం విలువ వేగంగా కరిగిపోతోంది. మంగళవారం డాలరుతో పోలిస్తే మరో 50 పైసలు క్షీణించి సరికొత్త ఆల్‌టైమ్‌ కనిష్టం 96.70కి పతనమైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో క్రితం ముగింపు 96.20తో పోలిస్తే మరింత తక్కువగా 96.38 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్‌ .. ఇంట్రాడేలో 96.27కి పెరిగింది. కానీ అది నిలబెట్టుకోలేక చివరికి 50 పైసలు క్షీణతతో ముగిసింది. దీనితో గత ఎనిమిది సెషన్లలో 2.64 శాతం (రూ. 2.48) మేర పతనమైనట్లయింది. తద్వారా ఆసియాలోనే అత్యధికంగా పతనమైన కరెన్సీగా నిల్చింది. 

డాలరు బలపడటం, అమెరికా ట్రెజరీ ఈల్డ్‌లు పెరుగుతుండటం, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంలాంటి అంశాలు రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయని మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అనుజ్‌ చౌదరి తెలిపారు. అయితే, పసిడి, వెండిపై దిగుమతులపై ఆంక్షలు, ఆర్‌బీఐ జోక్యంతో కనిష్ట స్థాయిల్లో రూపాయికి కొంత మద్దతు లభించవచ్చని పేర్కొన్నారు. స్పాట్‌ మార్కెట్లో 96–96.60 శ్రేణిలో తిరుగాడవచ్చని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement