ఫోన్‌పే, గూగుల్‌పే తరహాలో 'వియోనా పే' | Hyderabad Based Viyona Expands Digital Payments to Rural India | Sakshi
Sakshi News home page

ఫోన్‌పే, గూగుల్‌పే తరహాలో 'వియోనా పే'

May 19 2026 2:46 PM | Updated on May 19 2026 2:48 PM

Hyderabad Based Viyona Expands Digital Payments to Rural India

డిజిటల్‌ పేమెంట్స్‌, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థను మరింత విసృ‍్తతం చేసేందుకు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఫిన్‌టెక్‌ కంపెనీ వియోనా (VIYONA) సిద్ధమైంది. ఫోన్‌పే, గూగుల్‌ పే మాదిరిగా ఇంకో సంస్థ డిజిటల్‌ పేమెంట్స్‌ నిర్వహిస్తుందన్నమాట. వియోనా ఇందుకు తగ్గట్టుగా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సర్టిఫికెట్‌ను సంపాదించింది. ఫలితంగా యూపీఐ పేమెంట్స్‌ జారీ చేసేందుకు, ఐఎంపీఎస్‌ ద్వారా ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ను చేసేందుకు వీలేర్పడుతుంది. అలాగే బ్యాంకుల మధ్య డిజిటల్‌ లావేదేవీలకూ వియోన వేదిక కానుంది.

బ్యాంకింగ్‌, పేమెంట్స్‌కు సంబంధించిన విషయాల్లో వియోనా రెండేళ్లుగా విస్తరిస్తూ వస్తోంది. కలెక‌్షన్స్‌తోపాటు చెల్లింపులు, చెల్లింపుల ప్రక్రియలను వివిధ బ్యాంకుల మధ్య ఇంటిగ్రేషన్‌ సాధించడం దీనికి కారణం. తాజాగా ఎన్‌పీసీఐ సర్టిఫికేషన్‌ రావడంతో సంస్థ వ్యాపారులను సంపాదించుకోవడం మరింత సులువైంది.

యూపీఐ పేమెంట్స్‌ స్వీకరణ, చెల్లింపుల సామర్థ్యం పొందిన నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలు విస్తరించనున్నాయి. ‘‘ఐఎంపీఎస్‌తోపాటు బ్యాంకుల మధ్య లావాదేవీలు కూడా సాధ్యమవుతూండటం వల్ల రియల్‌ టైమ్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్లు, మర్చెంట్‌ సెటిల్‌మెంట్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయగలం. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సౌకర్యాలు అందించగలం’’ అని సంస్థ ఛైర్మన్‌ యార్లగడ్డ రవీంద్రనాథ్‌ తెలిపారు. ‘‘వియోనా పే’’ ద్వారా డిజిటల్‌ చెల్లింపులను మరిన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించగలమని చెప్పారు. వ్యాపారులకు డబ్బులు చెల్లించడం మొదలుకొని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ను స్వీకరించే మౌలిక సదుపాయాల కల్పన వరకూ ఆరు రకాల సేవలను త్వరలోనే అందించేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.

అంతేకాకుండా.... కనెక్టెడ్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ ఆన్‌బోర్డింగ్‌ సిస్టమ్‌ల కోసం కూడా కొన్ని కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే వియోనా పే ప్లాట్‌ఫార్మ్‌పై వంద మంది భాగస్వాములు ఉన్నారు. అలాగే వెయ్యికిపై విద్యా సంస్థలకు ఉపయోగపడేలా వియోనా ఫిన్‌టెక్‌ ‘క్యాంపస్‌ ప్రో’ పేరుతో ఒక ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ‘‘గ్రామ్‌ పే’’ ద్వారా సుమారు ఐదు వేల మంది వ్యాపారులను డిజిటల్‌ పేమెంట్ల క్షేత్రంలోకి తీసుకురాగలిగామని సంస్థ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement