ఊరి శివారు నుంచి నడిరోడ్డు వరకు కొట్టుకుంటూ తీసుకొచ్చిన టీడీపీ రౌడీలు
‘అధికారం మాది.. పార్టీ మాది.. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం’ అంటూ హెచ్చరికలు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో బరితెగింపు
దాడి వెనుక టీడీపీ ఎంపీటీసీ కీలకపాత్ర
బాధితులంతా జనసేన మద్దతుదారులు కావడంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు
రగిలిపోతున్న కాపు సంఘం నేతలు
కేంద్ర మంత్రి ఎదుట పంచాయితీ.. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన కాపు నేతలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు కాపు సామాజిక వర్గీయలపై బరితెగించారు. దారికాసి మరీ కాపు యువకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఊరి శివారు నుంచి గ్రామ నడిరోడ్డు వరకూ కాపులను కొట్టుకుంటూ తీసుకొచ్చారు. బల ప్రదర్శనతో తమ బరితెగింపును, గూండాయిజాన్నీ చాటారు. దాడి వ్యవహారం కాపు సంఘ నేతల వద్దకు చేరడం, చివరకు వారంతా కేంద్ర మంత్రి వద్ద పంచాయితీ చేయడంతో ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో ఈ నెల 11వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో ఓ టీడీపీ కార్యకర్త బుడంపాడు అడ్డరోడ్డు నుంచి ముట్లూరులోని తన ఇంటికి బైక్‌పై వెళుతున్నాడు. అదే మార్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఒకే బైక్‌పై ఎదురుగా వస్తుండగా.. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో వారిమధ్య ఘర్షణ జరిగింది.
గొడవ పెద్దది కావడంతో టీడీపీ కార్యకర్త గ్రామంలోని టీడీపీ ఎంపీటీసీకి ఫోన్ చేయగా.. ఆయనతో పాటు మరో పది మందికిపైగా టీడీపీ గూండాలు ముట్లూరు–కోవెలమూడి మధ్య నల్లకుంట ప్రాంతానికి చేరుకుని ముగ్గురిపైనా విచక్షణా రహితంగా దాడికి దిగారు. వారిలో ఇద్దరు భయభ్రాంతులకు గురై దాడినుంచి తప్పించుకుని గ్రామంలోకి పరుగులు పెట్టారు. మరో వ్యక్తి కాపుల్లో పలుకుబడి ఉన్నవారు కావడంతో అతడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అక్కడితో ఆగకుండా నల్లకుంట నుంచి సుమారు ఐదు వందల మీటర్ల మేర అతడిని రోడ్డుపైనే కొట్టుకుంటూ గ్రామంలోకి తీసుకెళ్లారు.
అంతా మా ఇష్టం
కాగా.. గ్రామంలోకి వెళ్లిన ఇద్దరూ ఈ విషయాన్ని గ్రామ పెద్దలు, కాపు నేతలు, జనసేన నాయకులకు వివరించడంతో బాధిత కుటుంబ సభ్యులు, కాపు నేతలు కలిసి టీడీపీకి చెందిన నాయకులను ఇదేం దారుణమని ప్రశ్నించారు. ఇలా కొట్టుకుంటూ గ్రామంలోకి తీసుకురావడం ఏమిటని నిలదీయగా.. ‘అధికారం మాది.. పార్టీ మాది.. మా ఇష్టం.. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం’ అంటూ టీడీపీ ఎంపీటీసీ, ఆయన వెంట ఉన్న టీడీపీ నాయకులు బదులిచ్చారు. ఈ విషయమై ఆ రోజు రాత్రి ఒంటిగంట వరకు గ్రామంలో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. బాధితులంతా జనసేన పార్టీకి మద్దతుదారులు కావడంతో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు.
కేసులు నమోదు చేయకుండా..
దాడుల అనంతరం కాపు వర్గానికి చెందిన వారు టీడీపీకి చెందిన వారు ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, దాడుల్లో గాయపడిన కాపు వర్గీయులపై రెండు కేసులు నమోదు చేయగా.. టీడీపీకి చెందిన వారిపై ఒక్క కేసు మాత్రమే నమోదు చేశారు. అందులోనూ కీలకమైన, దాడికి పాల్పడిన స్థానిక
ప్రజాప్రతినిధిపై కేసు పెట్టలేదు. బాధిత కాపు సామాజిక వర్గీయులు ఈ విషయాన్ని కాపు సంఘ నేతల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి వద్ద
పంచాయితీ పెట్టడంతో ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆదివారం రాత్రి ఆ స్థానిక ప్రజాప్రతినిధిపై కేసు నమోదు చేశారు.
జనసేన పార్టీకి మద్దతుగా నిలవడం వల్లే దాడి
జనసేన పార్టీకి మద్దతుగా నిలిచామన్న అక్కసుతోనే టీడీపీకి చెందిన నాయకులు తమపై దాడికి తెగబడ్డారని బాధిత కుటుంబాల వారు చెబుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నప్పటికీ.. జనసేనకు మద్దతుగా నిలిచిన కాపులపై టీడీపీ నేతలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోయారు. కాపులను చిన్నచూపు చూస్తూ.. అవకాశం దొరికినప్పుడల్లా కాపులపై దాడులకు తెగబడుతున్నారని బాధిత వర్గం ఆరోపిస్తోంది. దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు కాపు నేతలు సిద్ధమవుతున్నారు.


