జనావాసాలలో భూసేక ‘రణం’
గజాల్లోకి మార్చిన స్థలాలకూ భూసేకరణ నోటీసులు
గజం రూ.70వేలు పలికే భూములపై దృష్టి
భూములు ఇవ్వని రైతులపై కక్ష సాధింపు
ఉండవల్లి, పెనుమాక రైతులపై పిడుగుపాటు
విలువైన భూములను తమ వారికి కట్టబెట్టేందుకే!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉండవల్లిలో భూ సేకరణకు భూములు ఇవ్వని రైతులపై ప్రభుత్వం కక్షసాధిస్తోంది. మదగజంలా జనావాసాలపై పడుతోంది. ఉండవల్లి నుంచి అమరావతి వెళ్లే రహదారిలో రోడ్డుకు ఇరువైపులా జనావాసాల మధ్య ఉన్న వందలాది రైతుల భూములనూ భూ సేకరణ కింద తీసుకుంటామంటూ ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఉండవల్లిలో 280 మంది రైతులకు నోటీసులు ఇచ్చారు. మరికొందరికి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. భూసేకరణ ప్రకటన కూడా ఊరుపేరు లేని పత్రికలతోపాటు, ఇక్కడ దొరకని ఆంగ్ల దినపత్రికల్లో ఇచ్చారు. ఇంటికి నోటీసు వచ్చే వరకూ ఈ సమాచారం తెలియనీయకుండా సీఆర్డీఏ అధికారులు జాగ్రత్త పడ్డారు. రాజధానిని ప్రకటించినప్పటి నుంచి భూసమీకరణకు ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు.
గత 12 ఏళ్లుగా భూములు ఇవ్వకపోవడంతో ఇప్పుడు కక్ష సాధింపుగానే తమకు భూసేకరణ నోటీసులు ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజాల్లోకి మార్చిన ఇళ్లస్థలాలు, ఇళ్లకూ భూసేకరణ నోటీసులు ఇచ్చారు. గజం రూ.70వేలు పలికే భూములు లాక్కునేందుకు బాబు సర్కారు పన్నాగం పన్నింది.
బహిరంగంగా మాట్లాడితే ఇబ్బందులపాలే...
అమరావతి రోడ్డులో ఉండవల్లి సెంటర్ నుంచి వెళ్లే దారిలో కుడివైపున ఉండవల్లి దేవాలయం భూముల వద్ద ఉండవల్లి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద నుంచి ఐదు ఎకరాల్లో అనుమతులతో ఇళ్లు నిరి్మంచుకున్నారు. గుంటూరు చానల్ నుంచి సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్లు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మరొక 10 ఎకరాలు 30 మంది నుంచి 40 మంది రైతుల చేతిలో ఉంది. ఎడమచేతి వైపు పంటపొలాల్లో గతంలో బహుళ అంతస్తులు నిర్మించారు.
వాటి పక్కన ఉన్న కొన్ని పొలాలను గజాల్లోకి మార్చుకున్నారు. వాటినీ భూసేకరణలో పెట్టడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. బహిరంగంగా మాట్లాడితే ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లి గుహల ఎదురుగా 2014కు ముందు వెంచర్ వేశారు. ఆ వెంచర్లో సుమారు 50 మంది రెండు నుంచి మూడు సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఇప్పుడు అక్కడ కూడా భూములు తీసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
అదే ప్రాంతంలో గతంలోనే ఇళ్లు కట్టుకున్న వారు తమను గ్రామ కంఠంలో కలపాలంటూ అర్జీలు పెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆ భూములకూ నోటిఫికేషన్ ఇచ్చారు. పెనుమాక గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వెనుక పంట పొలాల్లో నివాసాలు ఉన్నాయి. పక్కనే ఆ గ్రామానికి చెందిన రైతు పొలం ఉంది. అదే రైతుకు కొండవీటి రిజర్వాయర్ ఏర్పాటుచేసే దగ్గర మరో ఎకరం ఉంది. ‘ఆ ఎకరం పూలింగ్‌కు ఇస్తాను, ఈ భూమిని వదిలేయండి’ అని రైతు అధికారులను వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.
కొండవీటి వాగు వెడల్పు, మరికొన్ని రోడ్ల నిర్మాణం కోసం కొన్ని నివాసాలు తొలగించాల్సి వస్తోంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచి్చన వారికి ప్లాట్లు ఇవ్వలేదు, ఇళ్లు కూడా తొలగిస్తే ఎలాగంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలువైన భూములు తమవారికి కట్టబెట్టేందుకే బాబు సర్కారు ఈ దురాగతానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
భూమి ఇవ్వాలని బెదిరిస్తున్నారు
ఇప్పటికే ఆరు ఎకరాల భూమిని అభివృద్ధి కోసం తీసుకున్నారు. మళ్లీ భూమి ఇవ్వాలని బెదిరిస్తున్నారు. మా భూములు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ల్యాండ్ పూలింగ్‌కు ఇస్తామని ఎన్ఓసీ తెచ్చుకోవాలట. ఇదెక్కడి అన్యాయం. – ఎం.ఉమామహేశ్వరరెడ్డి, రైతు, ఉండవల్లి
ప్రభుత్వం విధానాన్ని మార్చుకోవాలి
ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలి. క్షేత్రస్థాయిలో వాస్తవికతను అర్థం చేసుకోవాలి. నాకు కేవలం 1.60 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు మొత్తం ఇచ్చేయమంటున్నారు. ఇప్పటికే అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాను. మళ్లీ ఇదొక సమస్యగా మారింది. – పి.వెంకటరెడ్డి, రైతు, ఉండవల్లి
పోరాటానికి సిద్ధం
చంద్రబాబు ప్రభుత్వం బెదిరిస్తే అదిరేదిలేదు. న్యాయబద్ధంగా ఎంతటి పోరాటానికైనా సిద్ధమే. మా నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేశ్ ఏమీ పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పేరుతో టీడీపీ సర్కారు మమ్మల్ని దారుణంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది. న్యాయ పోరాటం చేస్తాం. – దశరథరామిరెడ్డి, రైతు, ఉండవల్లి


