పవన్‌కళ్యాణ్‌కు కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఘాటు లేఖ
సాక్షి, అమరావతి: మెగా కుటుంబానికి కాపులు దేవుడిచ్చిన వరమని, కాపులను వదిలేసి రాజకీయం చేస్తానంటే పునాదిలేని భవనంగా జనసేన పార్టీ మిగిలిపోతుందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్‌పీఎస్) హెచ్చరించింది. ఈనెల 15న జనసేన పార్టీ సమావేశంలో పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను ఒక కులం కోసమో.. ప్రాంతం కోసమో పనిచేయనని చెప్పడంపై స్పందిస్తూ కేఆర్‌పీఎస్ రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు, వర్కింగ్ చైర్మన్ మాసాబత్తుల శ్రీనివాసరావు, కన్వీనర్ రావి శ్రీనివాస్, కోఆర్డినేటర్ అమ్మా శ్రీనివాసనాయుడు తదితరులు పవన్‌కు ఘాటుగా బహిరంగ లేఖ రాసి దానిని సోమవారం విడుదల చేశారు.
అందులో కేఆర్‌పీఎస్ నేతలు ఏమన్నారంటే.. అనేక కులాలతోపాటు హిందూ సమాజం కోసం మాట్లాడతానని, వారి సమస్యలను అడ్రస్ చేస్తానని చెబుతున్న మీరు కాపులకు జరుగుతున్న అన్యాయంపై ధైర్యంగా ఎందుకు మాట్లాడటంలేదు? ఒక పార్టీ అధ్యక్షులుగా, ఉపముఖ్యమంత్రిగా కాపు సమాజానికి చెందిన న్యాయమైన సమస్యలను అడ్రస్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? కాపులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. పవన్‌కళ్యాణ్ మాతోనే ఉన్నాడని.. ఆటోమెటిక్‌గా కాపులు పవన్‌తోనే ఉంటారని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు ఆయన తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కేంద్ర, రాçష్ట్ర మంత్రులు, ఉపముఖ్యమంత్రులు సైతం కాపులకు అంతేస్థాయిలో అన్యాయం చేశారు.
ముగ్గురు అన్నదమ్ములూ ఆలోచించు కోండి..
మీ మెగా కుటుంబ సభ్యుల సినిమాలకు, చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి, చిరంజీవి ఐ బ్యాంకుకి, ప్రజారాజ్యం పార్టీకి, జనసేన పార్టీకి, టోటల్‌గా మీ కుటుంబానికి అండగా నిలబడింది 80 శాతం కాపులే. కాపులు మీ కుటుంబాన్ని ఓన్ చేసుకున్నారు. మరి కాపులను మీ మెగా కుటుంబం ఓన్ చేసుకుందా? లేదా? అనేది మీ అన్నదమ్ములు ముగ్గురు ఆలోచించుకోవాలి. 2014లో ఒక్క సీటు తీసుకోకుండా టీడీపీకి మీరు మద్దతు ఇవ్వడంతో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిం ది.
ఆ ఎన్నికల్లో.. అధికారంలోకి వచ్చిన ఆర్నెలల్లోపు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని ప్రకటించి, మేనిఫెస్టోలో పెట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మోసం చేశారు. అయినా ఆనాడు మీరు ప్రశ్నించలేదు. దానిపై 2016 నుండి 2019 మధ్య జరిగిన కాపు ఉద్యమంపై మీరు స్పందించని కారణంగానే 2019లో రెండుచోట్లా మీరు ఓడిపోయారు. అవసరం తీరిపోయాక చంద్రబాబు అప్పట్లో మిమ్మల్సి, మోదీని వదిలేశారు. ఆ తర్వాత మళ్లీ మీ మద్దతుతో 2024లో అధికారం చేపట్టిన చంద్రబాబు కాపులకు మళ్లీ అన్యాయం చేస్తున్నారు. మీరు, చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తే 2029లో మళ్లీ వైఎస్సార్‌సీపీ గెలవడం ఖాయం.


