అప్పుల పరుగులో ఏపీ ఫస్ట్‌ | Chandrababu Naidu government is at the top of the debt list | Sakshi
Sakshi News home page

అప్పుల పరుగులో ఏపీ ఫస్ట్‌

May 20 2026 4:25 AM | Updated on May 20 2026 4:27 AM

Chandrababu Naidu government is at the top of the debt list

అప్పుల్లో అగ్ర స్థానంలో చంద్రబాబు సర్కారు  

తాజాగా మంగళవారం బడ్జెట్‌ అప్పు రూ.4,600 కోట్లు

కాగ్, ఆర్‌బీఐ గణాంకాల మేరకు బడ్జెట్‌ అప్పు రూ.1,80,603 కోట్లు 

గ్యారెంటీ అప్పులు రూ.1,12,504 కోట్లు 

రాజధాని అప్పులు రూ.47,387 కోట్లు 

మొత్తంగా రెండేళ్లు కాకుండానే బాబు చేసిన అప్పులు రూ.3,40,494 కోట్లు 

ఇంత అప్పు చేసినా అభివృద్ధి, సంక్షేమం మాత్రం శూన్యం

సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ అప్పుల్లో మాత్రం దూసుకెళ్తూ అగ్రస్థానంలో ఉన్నారు. బడ్జెట్‌లో ప్రతి మంగళవారం అప్పులు చేయడంతోపాటు, బడ్జెట్‌ బయట కూడా దొరికిన చోటల్లా అప్పు చేస్తూ రెండేళ్లు కాకుండానే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు. తాజాగా మంగళవారం బడ్జెట్‌లో మరో రూ.4,600 కోట్లు అప్పు చేశారు. 

ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో రెండేళ్లు కాకుండానే చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు రూ.3,40,494 కోట్లకు చేరాయి. ఇందులో బడ్జెట్‌ అప్పులే రూ.1,80,603 కోట్లు కాగా, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,12,504 కోట్లకు చేరాయి. మరో పక్క రాజధాని అమరావతి పేరుతో రూ.47,387 కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా అభివృద్ధి, సంక్షేమం మాత్రం శూన్యంగా ఉంది. 

అప్పు చేయకుండా రాష్ట్ర సంపద పెంచడం ద్వారా సూపర్‌ సిక్స్‌తో పాటు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తానంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాకుండానే రాష్ట్ర ప్రజలపై భారీగా అప్పుల భారం మోపారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా రాష్ట్ర సంపద పెంచడంలోనూ విఫలమయ్యారు. దొరికిన చోటల్లా అప్పులు చేయడంలో మాత్రం సఫలం అయ్యారు. 

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసింది. కానీ చంద్రబాబు రెండేళ్లు కాకుండానే రూ.3.40 లక్షల కోట్లు అప్పు చేసినా, ప్రజలకిచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదు. కొత్తగా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అభివృద్ధి చేయలేదు. రాష్ట్ర ఆస్తులను సృష్టించలేదు. రాష్ట్ర సంపదగానీ, ప్రజల సంపద గానీ పెంచలేదు. మొత్తంగా రాష్ట్ర ప్రజలపై మోయలేని అప్పుల భారం మోపారు.

Advertisement
 
Advertisement
Advertisement