కార్యాలయం కట్టుకోండి ‘తమ్ముడు’ | Chandrababu Govt Allocated Valuable Lands to TDP Offices | Sakshi
Sakshi News home page

కార్యాలయం కట్టుకోండి ‘తమ్ముడు’

May 19 2026 5:30 AM | Updated on May 19 2026 5:30 AM

Chandrababu Govt Allocated Valuable Lands to TDP Offices

టీడీపీ ఆఫీసులకు ప్రభుత్వ భూములు ధారాదత్తం 

లీజు గడువు 99 ఏళ్లకు పెంచి విలువైన భూముల అప్పగింత  

ఇటీవలే లీజు కాలపరిమితి పెంపు  

తాజాగా నాలుగు జిల్లాల్లో భూముల కేటాయింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. లీజు పరిమితిని కూడా ఏకంగా 99 ఏళ్లకు పెంచి మరీ సీఎం చంద్రబాబు తన పార్టీ కార్యాలయాలకు భూములు ఇచ్చుకుంటున్నారు. తాజాగా సోమవారం విజయనగరం, ఒంగోలు, ఏలూరు, రాజమహేంద్రవరంలో టీడీపీ కార్యాలయాల కోసం విలువైన భూములను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల పేరిట లీజుకు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. కేవలం వెయ్యి రూపాయల నామమాత్రపు లీజుకి విలువైన భూములను చంద్రబాబు తన పార్టీకి ధారాదత్తం చేస్తున్నారు.  

గరిష్టంగా 99 ఏళ్ల వరకు లీజు 
గతంలో రాజకీయ పార్టీల కార్యాలయాల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూములను 33 సంవత్సరాలకు మాత్రమే లీజుకు ఇచ్చే నిబంధన ఉంది. దానిని చంద్రబాబు పూర్తిగా మార్చేసి లీజు కాలపరిమితిని 66 ఏళ్లకు పెంచారు. అంతటితో ఆగకుండా ఆ పార్టీలు ఉనికిలో ఉన్నంతకాలం లీజు గడువును గరిష్టంగా 99 సంవత్సరాల వరకు పొడిగించుకునే వెసులుబాటు కల్పించారు. అంటే 99 ఏళ్లపాటు ఈ భూములు టీడీపీ హస్తగతం కానున్నాయి. లీజు వ్యవధిని 33 ఏళ్ల నుంచి 66 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనల కారణంగానే గతంలో కొన్ని కేటాయింపులను నిలిపివేశారు. గురువారం మంత్రివర్గంలో లీజుల గడువు పెంచుతూ ఆమోదించి, ఆ వెంటనే తాజా జీవోలను జారీ చేశారు. అనంతరం ఎకరాకు ఏడాదికి రూ.1,000 చొప్పున నామమాత్రపు లీజుకే టీడీపీ కార్యాలయాలకు భూములను కేటాయించారు.  

రాజమహేంద్రవరం, ఒంగోలు, విజయనగరంలో రెండేసి ఎకరాలు 
రాజమహేంద్రవరం అర్బన్‌ మండలం పరిధిలోని సర్వే నంబర్‌ 316–2లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడి పేరుతో పార్టీ కార్యాలయం భవనం కోసం కేటాయించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ తీర్మానం, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అనుమతి రాకముందే లీజుకు ఇచ్చేశారు. 
విజయనగరంలోని కనపాక అయ్యన్నపేటలో సర్వే నంబర్‌ 94/2లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. ఈ కేటాయింపు కోసం ఆ భూమి స్వభావాన్ని మార్చారు. ఆ భూమి రాళ్లగుట్టగా రికార్డుల్లో ఉండగా, దాన్ని అస్సెస్డ్‌ వేస్ట్‌ డ్రై (ఏడబ్ల్యూడీ)గా మార్చారు. అంతేకాకుండా, ఇదే భూమిపై గత ఏడాది మార్చిలో ఇచి్చన జీవోను సైతం రద్దు చేస్తూ కొత్త నిబంధనల ప్రకారం 66 ఏళ్ల లీజు ఖరారు చేశారు. 

⇒  ఏలూరు నగరంలోని టీఎస్‌ నంబర్‌ 660/3లోని 1.61 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. ప్రస్తుతం ఈ భూమి ఏపీ ఆగ్రోస్‌ పరిధిలో ఉండగా, దాన్ని టీడీపీకి దఖలుపరిచారు. 
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొత్త మామిడిపాలెం గ్రామంలోని సర్వే నంబర్‌ 82/1బీ2బీలోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. దీన్ని కూడా ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఎన్‌వోసి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ తీర్మానం లేకుండానే ఇచ్చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement