నోటిఫికేషన్‌లో శాస్త్రీయతను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం
న్యాయస్థానాలు, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్
జీవోలను తుంగలో తొక్కుతూ బ్యాక్‌లాగ్ పోస్టులకు మహిళా రిజర్వేషన్
రెగ్యులర్‌తో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్టులపై అభ్యర్థుల మండిపాటు
అర్హత పరీక్షను పోటీ పరీక్షగా మార్చేశారంటూ ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. జీవోలను తుంగలో తొక్కుతూ అశాస్త్రీయ పద్ధతులను అవలభిస్తోందనే విమర్శల్ని మూటగట్టుకుంటోంది. వర్సిటీల అధికారులు, సీనియర్ ఆచార్యుల సమక్షంలో చేపట్టాల్సిన ఎంపికను నాలుగు గోడల మధ్య బంధించడంతో నోటిఫికేషన్‌లో పారదర్శకతను ప్రశ్నార్థకంగా మార్చేసింది. ముఖ్యంగా న్యాయస్థానాల తీర్పులకు, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ (అర్హత) పరీక్ష పెట్టడం వివాదాలకు తావిస్తోంది.
ఎన్నడూ లేనివిధంగా వింత సంస్కృతిని తీసుకొచ్చి బ్యాక్‌లాగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సైతం స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తుండటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. 2023 నోటిఫికేషన్‌ను అర్థంతరంగా రద్దు చేసి.. కనీసం వయో పరిమితి పెంచకుండా 44 ఏళ్ల గరిష్ట వయోపరిమితి విధించడం తీవ్ర చర్చనీయాంశమైంది. సాధారణ డిగ్రీ అర్హతతో ఉండే స్కూల్ టీచర్ (డీఎస్‌సీ) పోస్టులకే జనరల్ కేటగిరీకి 45 ఏళ్లు, రిజర్వుడు కేటగిరీలకు 50 ఏళ్ల వయోపరిమితి ఇస్తున్నప్పుడు, వర్సిటీల్లో పోస్టులకు వయో పరిమితి విధించడం హాస్యాస్పదంగా మారింది.
అర్హత పరీక్షా.. పోటీ పరీక్షా?
ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నిర్వహించే స్క్రీనింగ్ టెస్టును పోటీ పరీక్షగా మార్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఫ్యాకల్టీకి రాత పరీక్షలో నిర్దిష్ట మార్కులు సాధిస్తేనే.. వచ్చి న మార్కుల్లో 0.5 శాతం, ఇంటర్వ్యూల్లో సర్విసు ఆధారంగా (గరిష్టంగా పదేళ్లు) ఏడాదికి ఒక మార్కు చొప్పున వెయిటేజీ ప్రకటించింది. అయితే, చాలామంది కాంట్రాక్టు అధ్యాపకులు 20 ఏళ్లకు పైగా వర్సిటీల్లో సేవలందిస్తున్నారు. పీహెచ్‌డీలు, పరిశోధన పత్రాలు వంటి అకడమిక్స్‌తో పాటు తరగతి బోధనలో విశేష అనుభవం గడించారు.
అలాంటి అనుభవజు్ఞలకు పోటీ పరీక్ష తరహాలో టెస్టులు పెట్టడాన్ని అభ్యర్థులు తప్పు పడుతున్నారు. దీనివల్ల సీనియర్లతో ప్రస్తుత తరం పోటీకి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. అర్హత పరీక్షలో 1:12 నిష్పత్తిలో మెరిట్ ఎలా తీస్తారని, పైగా మైనస్ మార్కుల విధానం ఏమిటని ప్రశి్నస్తున్నారు. ఇదే జరిగితే కేవలం స్క్రీనింగ్ టెస్టులో పైచేయి సాధించిన వారు రావచ్చు కానీ.. దశాబ్దాల బోధన అనుభవం, పరిశోధన పటిమను వర్సిటీల్లోకి తీసుకురాలేరని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. యూజీసీ సైతం వర్సిటీల్లో బోధన పోస్టులను కేవలం పీహెచ్‌డీ, పబ్లికేషన్లు, రీసెర్చితో పాటు అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేస్తుండటం గమనార్హం.
యూజీసీ స్కేల్ ఇవ్వరు.. అసోసియేట్‌కు దరఖాస్తుకు చేయనివ్వరా?
చంద్రబాబు సర్కారు విచిత్ర పోకడలతో విద్యావేత్తలు తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్కేలుతో కచ్చి తంగా పని చేసిన అనుభవం ఉండాలనే నిబంధన విధించింది. అయితే, రాష్ట్రంలోని వేలాది మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కేవలం రూ.35–40వేల మధ్య జీతాలతో బతుకీడుస్తున్నారు. ఇది యూజీసీ స్కేల్స్‌కు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎనిమిదేళ్ల బోధన, పీహెచ్‌డీ తర్వాత రెండేళ్ల బోధన అనుభవం గడించిన ఎందరో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు యూజీసీ స్కేల్‌లో పనిచేసి ఉండాలనే నిబంధన పెట్టడంతో ఆ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోగలరని నిలదీస్తున్నారు. ప్రభుత్వం పోస్టుల పేరుతో మాయ చేయడం తప్ప పారదర్శకంగా వ్యవహరించడం లేదని మండిపడుతున్నారు.
ఒకే ప్రభుత్వంలో విరుద్ధ నిర్ణయాలు
కేవలం ప్రచార ఆర్భాటంతో చంద్రబాబు సర్కారు వర్సిటీల నోటిఫికేషన్‌ను హడావుడిగా విడుదల చేసి అభాసుపాలవుతోంది. ముఖ్యంగా బ్యాక్‌లాగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్టు పెట్టడంతో పాటు ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్, ఎస్సీ క్లాసిఫికేషన్‌తో నోటిఫికేషన్ ఇవ్వడం ప్రభుత్వ పరస్పర విరుద్ధ నిర్ణయాలకు అద్దం పడుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ పోస్టులను మెరిట్ ఆధారంగా నింపాలని ప్రభుత్వ జీవోలు, ఏపీ సబార్డినేట్ రూల్స్ చెబుతుంటే.. దానికి విరుద్ధంగా స్క్రీనింగ్ టెస్టు పెట్టడం గమనార్హం. వాస్తవానికి జీవో నంబర్ 77 తర్వాత ప్రత్యేకంగా పోస్టుల్లో మహిళ అని కాకుండా మొత్తం పోస్టుల్లో 33శాతం పైగానే మహిళలతో నింపాలి.
కానీ, అవి బ్యాక్ లాగ్ పోస్టులు కాబట్టి పాత పద్ధతినే అనుసరిస్తామని ఉన్నత విద్యాశాఖ చెబుతోంది. అలాగైతే 2024 తర్వాత వచ్చి న ఎస్సీ క్లాసిఫికేషన్‌ను బ్యాక్‌లాగ్ పోస్టులకు ఎలా వర్తింపజేస్తారని.. ఇది దళిత, గిరిజన వర్గాలకు అన్యాయం చేయడమేనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఇచ్చి న 1,523 పోస్టుల నోటిఫికేషన్‌లో 279 పోస్టులు బ్యాక్‌లాగ్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ) కాగా.. అందులో 65 పోస్టులకుపైగా మహిళా రిజర్వేషన్ కల్పించారు. ఒకవేళ ఆ పోస్టులో మహిళలు లేకుండా, నూతన ఎస్సీ క్లాసిఫికేషన్ అభ్యర్థులు రాకపోతే అలాంటి పోస్టులు ఎప్పటికీ భర్తీ కాకుండా నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.


