ఒకవైపు మోసం చేస్తూ.. మరోవైపు మాటలు చెబుతూ.. | Chandrababu is cheating the fishermen | Sakshi
Sakshi News home page

ఒకవైపు మోసం చేస్తూ.. మరోవైపు మాటలు చెబుతూ..

May 20 2026 5:01 AM | Updated on May 20 2026 5:01 AM

Chandrababu is cheating the fishermen

మత్స్యకారుల్ని దగా చేస్తున్న చంద్రబాబు  

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: క్రెడిట్‌ చోరీ చేయడంలో ఆరితేరిన.. మోసాలు, వెన్నుపోటు అలవాటుగా మారిన చంద్రబాబు మత్స్యకారుల విషయంలో కూడా మరోసారి ధృతరాష్ట్ర కౌగిలి రాజకీయ విన్యాసం చేశారు. మత్స్యకారుల సేవలో పేరిట మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో నిర్వహించిన కార్యక్రమంలో యథేచ్ఛగా అబద్ధాలు వల్లెవేశారు. మత్స్యకారుల కోసం తాను ఎంతో, ఎన్నో చేశానని కళ్లార్పకుండా నిర్భీతిగా చెప్పేశారు. వారిని మభ్యపెట్టాలని శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. 

మత్స్యకారులు మాత్రం చంద్రబాబు చేసిన ద్రోహాలను, మోసాలను చర్చించుకోవడం కనిపించింది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరంలోకి తమిళనాడు, పాండిచ్చేరి నుంచి హైస్పీడ్‌ బోట్లతో అక్రమంగా వచ్చి వేటాడి మత్స్యసంపదను దోచుకోవడమే కాకుండా.. ఇక్కడి జాలర్ల వలలను, బోట్లను ధ్వంసం చేస్తున్న తమిళ జాలర్లను, వారి బోట్లను స్థానిక మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. ఆ బోట్లను మత్స్యకారులకు తెలియకుండా చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను పురమాయించి టీడీపీకి చెందిన ఎంపీ  బీద మస్తాన్‌రావుతో మార్చి 16వ తేదీన వదిలేయించి తీరని ద్రోహానికి పాల్పడ్డారు. 

దీంతో మత్స్యకారుల్లో, వారి గ్రామాల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాము ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లను మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్ర, ఎంపీ బీద మస్తాన్‌రావు కుట్రపన్ని విడిపించారని మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ భూములను మార్చి 12న ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తూ లోకేశ్‌తో శంకుస్థాపన చేయించారు. ఈ విధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 164 మత్స్యకార గ్రామాలను చంద్రబాబు మోసగించారు. 

తాము దగా పడుతున్నామన్న విషయాన్ని గ్రహించిన మత్స్యకారులంతా ఏకమయ్యారు. టీడీపీని దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించకుండా దురాయి వేసుకున్నారు. ఇంత పెద్దస్థాయిలో మత్స్యకారుల్లో ఆగ్రహావేశాలు రావడంతో గాయపరిచి వెన్నపూసిన చందంగా చంద్రబాబు అబద్ధాలు వల్లించేందుకు ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమాన్ని  వేదికగా చేసుకున్నాడు. 

పంచ్‌ డైలాగ్‌లతో క్రెడిట్‌ చోరీ 
చంద్రబాబు ‘బోటు మనదే.. వేట మనదే’ అంటూ పంచ్‌ డైలాగ్‌లు కొట్టి జాలర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. 200 హైస్పీడ్‌ బోట్లను 60 శాతం సబ్సిడీతో ఇస్తానన్నారు. అయితే అవి జువ్వలదిన్నె హార్బర్‌కా? రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మత్స్యకారులకా? అనేది మాత్రం చెప్పలేదు. 

వైఎస్సార్‌సీపీ పాలనలో నిధులు కేటాయించి, 90 శాతానికిపైగా పనులు పూర్తయిన జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు సాగర్‌ డిఫెన్స్‌ కంపెనీకి కట్టబెట్టుతూ కుమారుడు లోకేశ్‌తో శంకుస్థాపన చేయించిన విషయాన్ని ప్రస్తావించకుండానే.. అత్యాధునిక సాంకేతిక వసతులతో రూ.288 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించానని, మరో రూ.3,600 కోట్లతో 9 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నానని క్రెడిట్‌ చోరీ చేశారు. జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ భూముల్లో ఏర్పాటు చేస్తున్న సాగర్‌ డిఫెన్స్‌ కంపెనీ విషయాన్ని, హార్బర్‌ను ఎప్పటికి పూర్తిచేస్తారో అనే విషయాన్ని మాత్రం చంద్రబాబు ప్రస్తావించకపోవడం మత్స్యకారుల మనసుల్ని మరింత గాయపరిచింది.  

ఎంపీ బీదను దూరం పెట్టి.. 
టీడీపీపై అందులోనూ కావలి నియోజకవర్గానికి చెందిన ఎంపీ బీద మస్తాన్‌రావుపై మత్స్యకారుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిన చంద్రబాబు ఈ కార్యక్రమానికి ఆయన్ని దూరంగా ఉంచారు. బీద మస్తాన్‌రావు వస్తే మత్స్యకారులు తిరగబడతారనే దూరంగా ఉంచినట్లు ఆ పార్టీ వారే చర్చించుకుంటున్నారు.  

అరకొరగానే మత్స్యకారుల హాజరు 
చంద్రబాబు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆశించినస్థాయిలో మత్స్యకారులు హాజరు కాలేదు. ముందుగానే నిర్ణయించుకున్న ఒకరిద్దరు మత్స్యకారులకు శిక్షణ ఇచ్చి టీడీపీకి అనుకూలంగా మాట్లాడించారు.   మరోవైపు ఆయిల్‌ సంక్షో భం నేపథ్యంలో ప్రధాని మోది ఇచ్చిన పొదుపు మంత్రాన్ని అమలు చేస్తున్నామంటూనే మంగళవారం తుమ్మలపెంటలో జరిగిన చంద్రబాబు కార్యక్రమానికి వందలాది కార్లలో టీడీపీ నేతలు, అధికారులు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మూడు ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసిన వాహనాలను చూసి జనం ఇదేనా పొదుపు.. చంద్రబాబు అందరికీ చెబుతాడు.. ఆయన మాత్రం చేయడు.. అంటూ సెటైర్లు వేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement