తొలుత సత్వాకు కేటాయించిన భూముల్లో 50 శాతం ఓర్వెల్కి మిగిలిన 50 శాతం సత్వా ప్రాపర్టీస్ గృహ నిర్మాణ సముదాయానికి కేటాయిస్తూ జారీ చేసిన జీఓ
ఐటీ క్యాంపస్ పేరిట 30 ఎకరాలు కారుచౌకగా కొట్టేసిన సత్వా
ఇదే బాటలో ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్‌కు అనుమతి
వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఐటీ కంపెనీల ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం అడ్డుగోలు భూదోపిడీకి అడ్డు అదుపులేకుండా పోతోంది. ఇప్పటికే బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు సత్వా, ఏఎన్ఎస్ఆర్లకు కారుచౌకగా భూములు కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ కంపెనీల్లోకి దొడ్డిదారిన వేరే కంపెనీలను చేరుస్తూ ‘రియల్’ దందా కొనసాగిస్తోంది. విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్ నంబర్ 4లో సుమారు రూ.1,500 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని కేవలం రూ.45 కోట్లకే కొట్టేసిన సత్వా చివరికి ఆ మొత్తం కూడా సకాలంలో చెల్లించలేదు. గతంలో రూ.45 కోట్లు చెల్లించడానికి సత్వా రెండునెలల అనమతి కోరితే వెంటనే ఆమోదం తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాజెక్టులో మరో రియల్ ఎస్టేట్ సంస్థను చేరిస్తే దానికి కూడా ఆమోదం తెలపడం గమనార్హం.
ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 కింద ప్రోత్సాహకాలు కొట్టేసిన సత్వా ఇప్పుడు ఐటీ క్యాంపస్ నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విడదీస్తూ వేర్వేరు కంపెనీలకు అప్పగిస్తే దానికి కూడా ప్రభుత్వం తలొగ్గడంపై అధికారులు నివ్వెరపోతున్నారు. 30 ఎకరాల విక్రయ ఒప్పందంలో సగం భూమిని హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన ఓర్వెల్ హారిజాన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట, మిగిలిన సగం సత్వా పేరిట బదిలీ చేయాలంటూ సత్వా చేసిన ప్రతిపాదనకు చంద్రబాబు సర్కారు ఆమోదం తెలుపుతూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కేవలం రూ.10వేల చెల్లింపు మూలధనంతో హైదరాబాద్ కేంద్రంగా గత ఏడాది జనవరి 21న ఏర్పాటైన ఓర్వెల్ హారిజాన్కు ఇప్పుడు విశాఖలో ఏకంగా రూ.750 కోట్ల విలువైన భూములు కేటాయించడం ప్రభుత్వ అడ్డగోలు దోపిడీకి మరో నిదర్శనం.
ఓర్వెల్ కంపెనీలో కవీంద్రకుమార్ మిశ్రా, సుమంతకుమార్ బసు డైరెక్టర్లుగా ఉన్నారు. ఐటీ పార్కుల నిర్మాణంలో ఇంతవరకు ఎటువంటి అనుభవం లేని ఈ కంపెనీకి ఇలా దొడ్డిదారిన భూ కేటాయింపులు చేయడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఐటీ క్యాంపస్‌లను ఓర్వెల్ హారిజాన్ నిర్మిస్తే, నివా స సముదాయాలు నిర్మించి తాము అమ్ముకుంటా మని సత్వా చేసిన ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశం ఆ మోదం తెలపడంతో.. ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
అదేబాటలో ఏఎస్‌ఎన్‌ఆర్
కేవలం 99 పైసలకే విశాఖలో 10.29 ఎకరాలు కొ ట్టేసిన బెంగళూరుకు చెందిన ఏఎస్‌ఎన్‌ఆర్ గ్లోబల్ కార్పొరేషన్‌కు కూడా సత్వాకు ఇచ్చినట్లే చంద్రబాబు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. కేటాయించిన భూమిలో ప్రాజెక్టు అమలు చేయడానికి గడువు కోరడమే కాకుండా ఇందులో సహ డెవలపర్ కింద వేరేవాళ్లను తీసుకోవడానికి, నిర్మించిన కార్యాలయాలను ఉపలీజులకు ఇవ్వడానికి ప్రతిపాదించిన ఏఎస్‌ఎన్‌ఆర్ గ్లోబల్‌కు ఓకే చెప్పింది. ఇందుకు అనుమతిస్తూ మరో ఉత్తర్వును జారీచేసింది. రూ.863 కోట్లతో శ్రీసిటీలో అమెరికాకు చెందిన ఎయిర్ కండీషనింగ్, రిఫ్రిజరేషన్ ఉత్పత్తుల సంస్థ కారియర్‌కు పెట్టుబడిలో 40 శాతం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, ఐదేళ్లపాటు 100 శాతం ఎలక్ట్రిక ల్ సబ్సిడీ డ్యూటీ మినహాయింపు, వాటి టైలర్ మే డ్ రాయితీలను ప్రకటిస్తూ మరో ఉత్తర్వును జారీచేసింది.


