‘సన్‌రే’కు జీ హుజూర్‌ ! | Chandra Babu govt Lands At Cheap Prices To Real Estate Companies | Sakshi
Sakshi News home page

‘సన్‌రే’కు జీ హుజూర్‌ !

May 19 2026 4:57 AM | Updated on May 19 2026 5:03 AM

Chandra Babu govt Lands At Cheap Prices To Real Estate Companies

శాసన వ్యవస్థలో కీలక వ్యక్తి సన్నిహిత సంస్థ కావడంతో బాబు నజరానా 

భోగాపురం ఎయిర్‌పోర్టుకు సమీపంలోని కంచేరులో భూ సంతర్పణ 

ఎకరం రూ.కోటి చొప్పున 3.61 ఎకరాలు విక్రయం 

సంస్థ స్థలాల మధ్య ప్రభుత్వ భూమి ఉండడంతో అమ్మేస్తున్నట్టు ఉత్తర్వులు 

జీవోలో పేర్కొన్న కారణంపై విస్మయం వ్యక్తం చేస్తున్న నిపుణులు  

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ప్రభుత్వ భూములను తమకు కావాల్సిన వారికి ఇష్టారీతిన దోచిపెడుతోంది. అయాచిత లబ్ధిచేకూర్చడానికి బ­రి­తెగిస్తోంది. అంతా విస్తుపోయే కారణాలు చూపు­తూ విలువైన భూములను కారు చౌకగా కట్టబెడుతోంది. తాజాగా అలాంటి భూపందేరం జీవో సాక్షి­గా బయటపడింది. విజయనగరం జిల్లా భోగాపు­రం మండలం కంచేరు గ్రామ పరిధిలో ‘అవని’ బ్రాండ్‌ పేరుతో 5 స్టార్‌ హోటల్‌ నిర్మించేందుకు ‘సన్‌రే గ్రీన్‌ స్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’కు అత్యంత విలువైన భూమిని ధారాదత్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ.­36 కోట్ల నుంచి రూ.54 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.3.5 కోట్లకు కట్టబెట్టడానికి సిద్ధమైంది. నిబంధనలను తుంగలో తొక్కి అవుట్‌రైట్‌ సేల్‌కు భూమిని విక్రయిస్తోంది. పైగా ఆ భూమి పెట్టుబడిదారుల స్థలాల మధ్యలో ఉండడంతో పాటు వేరొకరికి ఇవ్వలేని పరిస్థితుల్లో వారికే అమ్మేస్తున్నట్టు జీవోలో పేర్కొనడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.    

శాసన వ్యవస్థలో కీలక వ్యక్తి సన్నిహిత సంస్థ కావడంతోనే.. 
శాసన వ్యవస్థలో కీలక వ్యక్తి సన్నిహిత సంస్థ కావ డంతోనే సన్‌రేకు విలువైన భూమిని కట్టబెట్టిందన్న చర్చ­నడుస్తోంది. నర్నీపట్నంలోని టీడీపీ కీలక నేత, గతంలో సభ్యుడిగా ఉన్న సన్‌రే గ్రీన్‌ స్పేస్‌ కంపెనీకి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వాస్తవానికి కొన్నేళ్ల ముందు సదరు టీడీపీ కీలక నేత దంపతులు ఆ సంస్థలో ప్రత్యక్ష భాగస్వాములుగా కొనసాగారు. ప్రస్తు­తం స్లీపింగ్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.  

ఎకరం రూ.15 కోట్లపైనే..అయినా రూ.కోటికే 
భోగాపురంలో ప్రస్తుతం ఏరియాను బట్టి బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.10 నుంచి రూ.15కోట్లకుపైగా  పలుకుతోంది. అలాంటి ఖరీదైన ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని కారు చౌకగా ఎకరం రూ.కోటికే కట్టబెడుతుండడం విస్తుగొలుపుతోంది. దాదాపు రూ.36–54 కోట్లకుపైగా విలువైన భూమిని రూ.3.5 కోట్లకే ముట్టజెపుతోంది. 

విమానాశ్రయం పూర్తయితే ఆ భూమి బంగారమే.. 
గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించిన భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే అదే భూమి విలువ రూ.150 నుంచి రూ.200 కోట్లకు చేరుకుంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. టూరిజం పేరిట అత్యంత ఖరీదైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని టీడీపీ, కూటమి నేతలు, వారి అనుచరులకు ప్రభుత్వం పర్యాటక భూములను అప్పగిస్తోందని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

నిర్దిష్ట విధానాలను తుంగలోకి తొక్కి 
తమ వారికి భూములు అప్పగించడానికి నిర్దిష్ట వి­ధానాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. ప్రభుత్వ ఆస్తులను కాజేసే కుట్రతో లీ­జు గడువును భారీగా పొడిగించడంతో పాటు కొత్తగా ‘ఫ్రీ హోల్డ్‌’ పేరుతో సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు రే­టు ప్రకా­రం భూమి విలువ కట్టి కారుచౌకగా రియ­ల్‌ఎస్టేట్‌ సంస్థలకు అమ్మేస్తోంది. ఇటీవల తిరుపతిలో ‘తిరు­పతి వన్‌ ప్రాజెక్టు’, అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కంపెనీకి భూ సంతర్పణ చేసింది.  

5 స్టార్‌ హోటల్‌ నిర్మాణం పేరిట 
సన్‌రే గ్రీన్‌ స్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ రూ.117.66 కోట్ల పెట్టుబడితో కంచేరులో 5స్టార్‌ హోటల్‌ నిర్మించడానికి 3.61 ఎకరాల ప్రభుత్వ భూమిని కోరింది. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్‌ సదరు సంస్థల సొంత భూముల మధ్యలో ప్రభుత్వ భూమి ఇరుక్కుపోయిందనే కారణంతో కారు చౌకగా అమ్మేస్తోంది. విచిత్రం ఏమంటే ప్రభుత్వ భూమి 3.61 ఎకరాలు అయితే.. పెట్టుబడిదారులు మాత్రం అక్కడ 3.10 ఎకరాలే ఉందనడం కొసమెరుపు.

ఈ వ్యవహారంలో భూమితో పాటు ప్రైవేటు సంస్థకు అయాచిత లబ్ధి చేకూరుస్తోంది. మూలధన పెట్టుబడిలో రూ.10 కోట్లు రీయింబర్స్‌ చేయడంతో పాటు పదేళ్లు 100 శాతం ఎస్‌జీఎస్‌టీ, ఇతర ప్రోత్సాహకాల కింద దాదాపు రూ.40 కోట్లకుపైగా దోచిపెడుతుంది. ఇక్కడ భూ బదలాయింపుల్లో ‘నోవేషన్‌ క్లాజ్‌’ను సైతం ఎత్తేశారు. ఈ క్లాజ్‌ ఉంటే భూమి బదలాయింపులు చేసిన ప్రతిసారీ ప్రభుత్వ అనుమతి కచ్చితంగా పొందాలి. అప్పటి రేట్ల ప్రకారం ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అలాంటి అవకాశం లేకుండా ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement