సాక్షి,ఢిల్లీ: కూటమి ప్రభుత్వం తప్పును ఒప్పుకుంది. రిటైల్ బంకుల నుంచి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలు తప్పేనని అంగీకరించింది. అందుకు అనుగుణంగా ఆదేశాలను ఉపసంహరించుకున్నామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అమరావతి నిర్మాణం కోసం రిటైల్ బంకుల నుంచి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలు ఇవ్వడంతో కొరత ఏర్పడింది. ఈ ఆదేశాలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు నిబంధనలకు విరుద్ధమని కేంద్ర పెట్రోలియం కార్యదర్శి లేఖ రాశారు. కేంద్రం వార్నింగ్‌తో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలను రద్దు చేసింది.
కాగా, గత నెలలో ఏపీలో పెట్రోల్ సంక్షోభానికి తెరలేపింది కూటమి ప్రభుత్వం. రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా బల్క్ డీజిల్‌ను రిటైల్ బంకుల నుంచి సరఫరా చేసేందుకు సిద్ధమైంది. మొత్తం 2 కోట్ల 75 లక్షల 66 వేల లీటర్ల డీజిల్‌ను సరఫరా చేయాలని నిర్ణయించింది.
కూటమి సర్కార్ చర్యలతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అంశంపై ఏపీ సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాలను కేంద్ర పెట్రోలియం శాఖ తప్పుబట్టింది.
ఏపీ ప్రభుత్వ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కేంద్రం లేఖ రాసింది. ఇది పెట్రోలియం నియమాలు, నిత్యావసర వస్తువుల చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. తాజాగా ఆ అంశానికి సంబంధించి తన తప్పును కూటమి సర్కార్ ఒప్పుకుంది. రిటైల్ బంకుల నుంచి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలు తప్పేనని అంగీకరించారు మనోహర్.అందుకు అనుగుణంగా ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేశారు.
పెట్రోల్ ధరల తగ్గింపుపై తర్వాత మాట్లాడదాం
దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి, వాటిపై ట్యాక్స్‌ను ఎత్తివేసే ఆలోచన ఏమైనా ఉందా’? అంటూ నాదెండ్ల మనోహర్‌ని మీడియా అడగ్గా.. . ధరల తగ్గింపుపై తర్వాత మాట్లాడదాం’ అంటూ సమాధానాన్ని దాటవేశారు.
ఇది ఇప్పుడు అడిగే ప్రశ్న కాదు.
ప్రజలు పెట్రోల్, డీజిల్‌ను ఆదా చేసేలా ఉండాలని ప్రధాని పిలుపునిస్తుండగా.. రాష్ట్రంలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించగా.. ‘‘ఇది ఇప్పుడు అడిగే ప్రశ్న కాదు, దీనిపై ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు’’ అని సమాధానమిచ్చారు.


