అవన్నీ అసత్య కథనాలు: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని దేవాలయాల బంగారు నిల్వలకు బదులుగా ప్రభుత్వం బంగారం బాండ్లు జారీ చేయనుందని, ఆ నిల్వలను నగదుగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అసత్యాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుల చేసింది.ఆలయాల బంగారాన్ని నగదుగా మార్చేందుకు సంబంధించి ఎలాంటి పథకాన్ని ప్రవేశపెట్టే యోచన ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. అలాగే, ఆలయ గోపురాలు, తలుపులపై ఉండే బంగారు పూతను ‘భారత వ్యూహాత్మక బంగారు నిల్వ’గా పరిగణిస్తారనే ప్రచారంలోనూ ఎలాంటి నిజం లేదని పేర్కొంది. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని, వాటిని షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. అధికారికంగా ధ్రువీకరించని సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తూ ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు, గందరగోళం సృష్టించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి కేవలం అధికారిక ప్రకటనలు, ప్రభుత్వ వెబ్సైట్లలోని సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని స్పష్టం చేసింది.