కేంద్ర మంత్రులు ప్రస్తుత ఆర్థిక మాంద్యానికి గల కారణాలపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆటో రంగం కుదేలవడానికి గల కారణాలు చెప్పి అబాసు పాలవగా.. తాజాగా మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తన వ్యాఖ్యలతో నవ్వుల పాలయ్యారు. గురువారం ఓ సమావేశానికి హాజరైన గోయల్.. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశంగా అడుగులు వేస్తోందని, దానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత జీడీపీ ఎలా ఉన్నా తమ లక్ష్యానికి ఏ మాత్రం అడ్డుకాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ‘ఇంట్లో కూర్చొని టీవీల్లో చూస్తూ లెక్కలు వేయకండి. అసలు గణితాన్ని మర్చిపోండి. ఐన్‌స్టీన్ గురత్వాకర్షణ శక్తిని గణితాన్ని ఉపయోగించి కనుక్కొలేదు. ఒక వేళ గణితం ద్వారానే వెళ్లినట్లయితే ప్రపంచంలో ఏ ఆవిష్కరణ జరిగేది కాదని నా అభిప్రాయం’ అంటూ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.