వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడి వెనుక మంత్రి అచ్చెన్నాయుడి హస్తం ఉందని, కోటబొమ్మాళిలో బుధవారం ఆయన పర్యటన సమయంలో కుట్రకు బీజం పడిందని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌లు ఆరోపించారు. దాడిని నిరసిస్తూ వారిద్దరి నేతృత్వంలో కోటబొమ్మాళిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయం నుంచి స్థానిక పోలీసుస్టేషన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అక్కడ బైఠాయించి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి అచ్చెన్నతో పాటు మండల టీడీపీ అధ్యక్షుడు బోయిన రమేష్, మరో 30 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయాలని డిమాండు చేశారు.