హరితహారం నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవా రం గజ్వేల్‌లో మొక్కలు నాటనున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకేరోజు లక్షా నూట పదహారు మొక్కలు నాటాలని నిర్ణయించారు. ములుగు సమీపంలో రాజీవ్ రహదారిపై ఒకటి, ప్రజ్ఞాపూర్ చౌరస్తాకు సమీపంలో మరొకటి, ఇందిరాచౌక్ దగ్గర ఇంకొకటి మొత్తం మూడు మొక్కలను సీఎం నాటుతారు. గజ్వేల్ పరిధిలో ఉన్న ప్రతి ఇంట్లో, రోడ్లపై, ఔటర్ రింగ్ రోడ్డుపై, ప్రభుత్వ–ప్రైవేటు విద్యాసంస్థల్లో, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ గజ్వేల్‌కు చేరుకుని ఇందిపార్కు చౌరస్తాలో ‘కదంబ’మొక్క నాటడంతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది.