రాష్ట్రంలో నిరుద్యోగులకు దినదినగండంలా ఉంది. ఒక్కోరోజు గడుస్తుంటే వేలాది మంది ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారి ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోతున్నాయి. ఇందుకు కారణం ప్రభుత్వం ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు విడుదల చేయించకపోవడమే. ఏటా ఉద్యోగ నియామకాలంటూ చెప్పి ఈ నాలుగున్నరేళ్లలో 2016లో మాత్రమే 4,275 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి టీడీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా అవి వెలువడడం లేదు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఈ ఏడాది సెప్టెంబర్ 19న 18,450 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఇప్పటివరకు నోటిఫికేషన్లు మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి దాటిపోతున్న నిరుద్యోగులు ఆందోళనతో ఉన్నారు. గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం 34 ఏళ్లనుంచి 42 ఏళ్లకు పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఇప్పటివరకూ నోటిఫికేషన్లు లేకపోవడంతో ఆ వయో పరిమితిని మించిపోయిన వేలాది మంది ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చినా కనీసం దరఖాస్తు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది. దీంతో లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్‌లు తీసుకున్న నిరుద్యోగుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. పుట్టిన తేదీ, గరిష్ట వయోపరిమితిపై లెక్కలు వేసుకుంటూ రోజులు లెక్కపెట్టుకోవలసిన దుస్థితిలోకి ప్రభుత్వం తమను నెట్టిందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జాడలేక తీవ్ర ఆందోళన
Nov 19 2018 7:25 AM | Updated on Mar 22 2024 10:55 AM
Advertisement