కాంట్రాక్ట్ రీసెర్చ్ సేవల్లో ఉన్న హైదరాబాదీ కంపెనీ జీవీకే బయోసైన్సెస్‌కు పెద్ద దెబ్బే తగిలింది. కంపెనీకి అతిపెద్ద క్లయింట్ అయిన యూకే ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జీఎస్‌కే) తీవ్రమైన షాక్ ఇచ్చి ఓ భారీ కాంట్రాక్టు నుంచి మధ్యలోనే వైదొలిగిందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో జీవీకే బయో రూ.200 కోట్లకుపైగా ఆదాయం కోల్పోయినట్లు సమాచారం. సంస్థ ఆదాయంలో ఇది 25%కి పైగా ఉండడంతో సంస్థకు ఎటూ పాలుపోవటం లేదు. జీఎస్‌కేలో కీలక బాధ్యతల్లో ఇటీవల చేరిన ఉన్నతాధికారి ఒకరు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలతో ఉన్న కాంట్రాక్టులను సమీక్షిస్తున్నారు. ఇందులో భాగమే తాజా పరిణామమని తెలిసింది. జీవీకే బయోపై పలు నియంత్రణ సంస్థలు అలర్ట్ విధించడం తెలిసిందే. జీవీకే బయోతో తమకు బలమైన బంధం ఉందని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీఎస్‌కే ఆర్‌అండ్‌డీ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ వాలెన్స్ చెప్పడం గమనార్హం. అయితే తాజా సమీక్ష పూర్తయిన తర్వాత జీవీకే బయోకు తిరిగి కాంట్రాక్టు దక్కే అవకాశాలు లేవనే చెబుతున్నారు.