సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు దేశ రాజధాని ఢిల్లీలో సమైక్య సమర నినాదం చేయనున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా మూడురోజుల పాటు ఆందోళనలు చేపట్టనున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగులు హస్తినకు చేరుకోగా.. బుధవారం రాజధాని ఎక్‌సప్రెస్‌లో వందలాది మంది ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆందోళనల్లో భాగంగా 26న ఏపీ భవన్ నుంచి ఇండియాగేట్ వరకూ కొవ్వొత్తులతో ర్యాలీ, 27న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా నిర్వహిస్తారు. 28న కూడా ఆందోళనలు కొనసాగిస్తామని ఫోరం నేతలు తెలిపారు. వీలైతే రాష్టప్రతి ప్రణబ్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించాలని సీమాంధ్ర ఉద్యోగులు నిర్ణయించారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న పలువురు రాష్ట్ర ఎంపీలను కలిసిన ఉద్యోగుల ప్రతినిధి బృందం.. మహాధర్నాలో పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతు తెలిపాలని కోరింది. ఎస్పీ, జేడీ(యూ), బీజేపీ తదితర పార్టీల జాతీయ నేతలను కూడా కలిసి ఆందోళనకు మద్దతు పలకాలని నేతలు విన్నవించారు. కాగా, ఉద్యోగుల ధర్నాకు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంఘీభావం ప్రకటించారు.