రానున్న ఎన్నికలు మన తలరాతను మార్చే ఎన్నికలని, ఆ ఎన్నికల్లో ప్రజల గుండె చప్పుడు వినే నాయకుడ్నే ఎన్నుకోవాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల రోడ్ షో లో భాగంగా జిల్లాలోని తునిలో జగన్ ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలు ప్రజల జీవితాలను మార్చే ఎన్నికలని అభిప్రాయపడ్డారు. ప్రజా శ్రేయస్సు కోరే వైఎస్సార్ సీపీకి ప్రజలు పట్టంకట్టాలన్నారు. ఆ దివంగత నేత చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు అష్టకష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. మహానేత వైఎస్సార్ పాలనకు ముందు బాబు పాలన భయానకంగా సాగిందన్నారు. బాబు హయాంలో పిల్లలు చదువుల కోసం భూములు అమ్ముకున్న భయానక రోజులు చూశామన్నారు. ఆసుపత్రి ఫీజుల కోసం అప్పులు చేసి జీవితాంతం ఊడిగం చేసిన బాబు పాలనను ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. వృద్ధులకు ముష్టేసినట్లుగా పింఛన్లు ఇచ్చారని జగన్ ఎద్దేవా చేశారు. గ్రామగ్రామాన బెల్ట్‌షాపులు ఏర్పాటుచేసిన ఘనత మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ మాయమాటలతో ఓట్లు వేయమని అడగటానికి వస్తున్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో తెలియని ఆయన ఇంటికో ఉద్యోగ ఇస్తానని హామీలు గుప్పిస్తున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబులా తనకి అబద్దాలు చెప్పలేనని, ఆయనలా ప్రజలను వంచించలేనని జగన్ తెలిపారు. సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని విడిగొట్టిన బాబు..ఇప్పుడు సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటూ కల్లిబొల్లి మాటలు వల్లిస్తున్నాడన్నారు. అధికారంలోకి రాగానే నిరుపేద రోగుల కోసం ఆరో సంతకం చేస్తానన్నారు. అధికారంలోకి 15 నుంచి 17 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తానన్నారు. రొటేషన్‌పై డాక్టర్లను అందుబాటులో ఉంచి అందరికీ వైద్యం చేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ని గెలిపించి రాష్ట్ర భవిస్యత్తు కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగానే తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా శోభను, ఎమ్మెల్యేగా రాజాను, ఎంపీగా చలమలశెట్టి సునీల్‌ను జగన్ ప్రకటించారు.
Mar 24 2014 8:54 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement