పదవి కోసం ప్రజలను మోసం చేయలేం: జగన్ | we-are-not-able-to-cheat-people-for-power-ys-jagan | Sakshi
Sakshi News home page

Jun 12 2014 7:54 PM | Updated on Mar 21 2024 8:11 PM

పదవి కోసం ప్రజలను మోసం చేయలేం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో గెలుపోటములపై నిన్న, ఈరోజు ఇక్కడ ఆయన సమీక్ష జరిపారు‌. నిన్న అనకాపల్లి పార్లమెంటుతోపాటు పెందుర్తి, చోడవరం, మాడుగుల శాసనసభ స్థానాలలో జరిగిరిన ఎన్నికలపై సమీక్ష జరిపారు. ఈ రోజు తూర్పు విశాఖ, భీమిలి నియోజకవర్గాలతోపాటు విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావాలని ఎవరికి ఉండదు? అని ప్రశ్నించారు. కాని ఆపదవి పొందడానికి ఎలాంటి అబద్ధాన్నైనా తాను ఆడలేనన్నారు. పదవికోసం ఎలాంటి గడ్డైనా తినే అలవాటు తనకు లేదని చెప్పారు. అబద్ధాలు ఆడి, మోసం చేసి సీఎం పదవిలోకి వెళ్తే మనం ప్రజలకు న్యాయం చేసినవారం అవుతామా? అని ప్రశ్నించారు. మరో 10 రోజుల్లోనే ఖరీఫ్‌ సీజన్‌ మొదలవుతుంది. రుణాల కోసం ప్రతి రైతు బ్యాంకుల దగ్గరకు వెళ్తున్నారు. పాత రుణాలు కడితే తప్ప కొత్త రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు చెప్పినప్పుడు ప్రతిరైతు ఎంత బాధపడతారో మనకు తెలుసని అన్నారు. సీఎం అయి నిజాయితీతో పరిపాలన చేయాలని, ప్రజలకు సేవ చేయలని అందరికీ ఉంటుందన్నారు. ప్రతి ఇంట్లో నాన్న ఫొటోతోపాటు తన ఫొటోకూడా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పదవి కోసం మనం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనప్పుడు ఆ వెంటనే ప్రజలు నిలదీస్తారని గుర్తు చేశారు. అప్పుడు వారికి మనం సమాధానం చెప్పగలమా? అని అడిగారు. నియోజకవర్గాలపై సమీక్షల సందర్భంగా ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, నేతలు హాజరయ్యారు. నియోజక వర్గాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కోరారు. గత ఎన్నికల్లో లోపాలను సవరించుకోవాలన్నారు. గ్రామాల్లో చురుగ్గా పనిచేసే కమిటీలను ఏర్పాటు చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement