ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వార్దా తుపాను రోజు రోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. నిన్నటిదాకా తీవ్ర తుపానుగా కొనసాగిన వార్దా.. శనివారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారింది. ఇది గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర వైపు దూసుకువస్తోంది. శనివారం రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 710, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 650, చెన్నైకి తూర్పున 660 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అతి తీవ్ర తుపాను పశ్చిమ వాయవ్య దిశగా అదే తీవ్రతతో ఆదివారం సాయంత్రం వరకు పయనించనుంది.